డాక్టర్ B.R.అంబేడ్కర్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). ఈ ఫోటోను షేర్ చేస్తూ, ఈ అరుదైన ఫోటోను ‘క్రిస్టోఫర్ జెమిని’ అనే ఫోటోగ్రాఫర్ తీసినట్లు చెబుతున్నారు. ఈ కథనం ద్వారా ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, కె.బి. హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఫోటో.
ఫాక్ట్(నిజం): అంబేడ్కర్, RSS వ్యవస్థాపకుడు హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్నట్లు చూపిస్తున్న ఈ ఫోటో ఫేక్. ఈ వైరల్ ఫోటో డిజిటల్‌గా సృష్టించబడింది. అలాగే వైరల్ ఫోటోను ‘క్రిస్టోఫర్ జెమిని’ అనే ఫోటోగ్రాఫర్ తీసినట్లు పేర్కొన్నారు. అయితే ఆ పేరుతో భారతదేశ చరిత్రతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ, ఫోటోగ్రాఫర్లు కానీ ఎవరూ లేరు. ఈ ఫోటోకు సంబంధించిన ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. అంతేకాకుండా, అంబేడ్కర్, RSS వ్యవస్థాపకుడు హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై ప్రయాణం చేసినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకితే, ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన ఎటువంటి విశ్వసనీయ సమాచారం లభించలేదు. తదుపరి మేము ఈ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కల్చర్ వెబ్‌సైట్, నేషనల్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్ వంటి పలు వెబ్‌సైట్‌లలో వెతికాము, అక్కడ కూడా ఈ ఫోటోకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. ఒకవేళ ఈ ఫోటో నిజమైనదే అయితే కచ్చితంగా ఈ ఫోటోను ఏదైనా ప్రభుత్వ వెబ్‌సైట్ కానీ, మీడియా సంస్థలు కానీ అంబేడ్కర్, హెడ్గేవార్‌లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించబడిన ఏదో ఒక సందర్భంలో ఈ ఫోటోను రిపోర్ట్ చేసేవి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ ఫోటోలో అస్పష్టంగా లేదా అసంపూర్ణంగా ఉన్న మనుషుల ముఖాలు, మసకబారిన మనుషుల మొహాలు, పలు అసహజ విషయాలను ఈ ఫోటోలో కనిపించడం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి ఈ ఫోటో AI ఉపయోగించి జనరేట్ చేయబడిందని లేదా డిజిటల్‌గా సృష్టించబడిందని అర్థమవుతుంది.
ఈ ఫోటోను “క్రిస్టోఫర్ జెమిని” అనే ఫోటోగ్రాఫర్ తీసినట్లు వైరల్ పోస్టులలో పేర్కొన్నారు. అయితే ఈ పేరుతో భారతదేశ చరిత్రతో సంబంధం ఉన్న వ్యక్తులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ ఎవరూ లేరు.
అలాగే ఈ వైరల్ ఫోటోలో కనిపిస్తున్న బండి యొక్క నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ నంబర్ ‘78787655’ అని ఉండటం మనం చూడవచ్చు. అయితే బ్రిటిష్ పాలనలో భారతదేశంలో ఇటువంటి ‘78787655’ కేవలం 8-అంకెలతో కూడిన రిజిస్ట్రేషన్ నంబర్లు ఎప్పుడూ ఉపయోగించలేదు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్లు బ్రిటిష్ పాలనలో బొంబాయికి ‘B XXXX’ లేదా మైసూర్‌కు ‘MYS XXXX’ వంటి ప్రాంతీయ కోడ్‌ల ఆధారంగా ఆల్ఫాన్యూమరిక్ ఫార్మాట్‌ను కలిగి ఉన్నాయి. అలాగే అంబేడ్కర్, RSS వ్యవస్థాపకుడు హేడ్గేవార్‌తో కలిసి ప్రయాణం చేసినట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. రిపోర్ట్స్ ప్రకారం, అంబేద్కర్ ఒక్కసారి మాత్రమే హేడ్గేవార్‌ను కలిశారు. హేడ్గేవార్, గోల్వాల్కర్, సావర్కర్ బృందం హిందూ రాష్ట్ర ఆలోచనకు అంబేడ్కర్ మద్దుతు కోరుతూ కలిశారు, కానీ దానికి అంబేడ్కర్ తిరస్కరించారు. ఈ సమాచారం ఆధారంగా ఈ ఫోటో డిజిటల్‌గా సృష్టించబడిందని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, అంబేడ్కర్, RSS వ్యవస్థాపకుడు హేడ్గేవార్‌తో కలిసి మోటార్ సైకిల్ పై వెళ్తున్నట్లు చూపిస్తున్న ఈ ఫోటో ఫేక్. ఈ వైరల్ ఫోటో డిజిటల్‌గా సృష్టించబడింది.