ఘాజియాబాద్‌లో నిర్వాసితుల గుడారాల ధ్వంసానికి సంబంధించిన ఈ ఘటనలో బాధితులు బంగ్లాదేశీయులు కాదు

ఘాజియాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల స్థావరాలను కూల్చేశారు అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు గుడారాలను కూల్చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఇదే వీడియోకు సంబంధించి వివరణ కోరుతూ చాలా మంది మా వాట్సాప్ టిప్‌లైన్‌కు ఈ వీడియోను పంపించారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఘాజియాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల స్థావరాలను కూల్చేస్తున్న వీడియో. 

ఫాక్ట్(నిజం): ఈ నిర్వాసితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని,  బంగ్లాదేశీయులు కాదని విచారణ అనంతరం ఘాజియాబాద్‌ పోలీసులు స్పష్టం చేసారు. వీరిపై దాడి చేసిన వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ఈ దృశ్యాలను రిపోర్ట్ చేసిన అనేక వార్తా కథనాలు మాకు కనిపించాయి.  ఈ కథనాల ప్రకారం ఘాజియాబాద్‌లో మధుబన్ బాపుధామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడారాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్న కొందరు నిర్వాసితులపై  ‘హిందూ రక్షా దళ్’ అధినేత పింకీ చౌదరి మరియు అతని అనుచరులు దాడి చేసారు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఆ నిర్వాసితులు బంగ్లాదేశీ రోహింగ్యాలు అని ఆరోపిస్తూ వారిపై దాడి చేసి, వారి గుడారాలను ధ్వంసం చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఐతే పోలీసులు ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. తమ విచారణలో ఆ నిర్వాసితులు బాంగ్లాదేశ్ వారు కాదని, వారు ఉత్తరప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ ఉంటున్నారని తేలిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వీరిపై దాడి చేసిన పింకీ చౌదరి మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

నిందితులపై ‘మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారని’, ప్రజల ఆస్తికి నష్టం కలిగించడం’, మొదలైన  నేరాలకు సంబంధించిన  సెక్షన్ 191(2), 354, 115(2), 117(4), 299 & 324(5) కింద కేసు నమోదు చేసినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. దీన్నిబట్టి బంగ్లాదేశీ రోహ్యింగ్యాలను తరిమేసారు  అని చేస్తున్న వాదనలో నిజం లేదని స్పష్టమవుతుంది.

చివరగా, ఘాజియాబాద్‌లో నిర్వాసితుల గుడారాల ద్వంసానికి సంబంధించిన ఘటనలో బాధితులు బంగ్లాదేశీయులు కాదు.