దేశవ్యాప్తంగా CAA అమలు చేస్తున్నామంటూ కేంద్ర హోం శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు

‘దేశ వ్యాప్తంగా అమలు కానున్న CAA, అధికారిక ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ’  అని చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశ వ్యాప్తంగా అమలు కానున్న CAA, అధికారిక ప్రకటన చేసిన కేంద్ర హోం శాఖ.

ఫాక్ట్ (నిజం): పౌరసత్వ చట్టం, 1955 కి అనుగుణంగా 2009లో రూపొందించిన పౌరసత్వ రూల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలలోని కొన్ని జిల్లా కలెక్టర్లకు అధికారాలిస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి 2019లో రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టం, 2019కి ఎటువంటి సంబంధంలేదు. ఎందుకంటే 2019లో రూపొందించిన సవరణ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. 2019 చేసిన సవరణ చట్టానికి సంబంధించి ఇంకా రూల్స్ రూపొందించలేదు, అందుకే ఇంకా ఈ చట్టం అమలులోకి రాలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఇటీవల 28 మే 2021న  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన ఆరు మైనారిటీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు పౌరసత్వ ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడానికి గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలలోని 13 జిల్లాల కలెక్టర్లకు అధికారాలిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పౌరసత్వ చట్టం, 1955 కి అనుగుణంగా 2009లో రూపొందించిన పౌరసత్వ రూల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ అధికారాలను కలెక్టర్లకు అందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ లోకి వచ్చి ఇప్పటికే పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 5 (రిజిస్ట్రేషన్ ద్వారా) మరియు సెక్షన్ 6 (సహజంగా) కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న  హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ మరియు క్రైస్తవ మతాలకు చెందిన చట్టబద్ధమైన వలసదారులు (పాస్పోర్ట్ / వీసాలతో ప్రవేశించిన వారు) లబ్ది పొందనున్నారు. పైగా ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు, 2018లో కూడా ఇలాగే 2009 రూల్స్ ఆధారంగా పౌరసత్వ ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడానికి కలెక్టర్లకు అధికారాలిస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

పైన తెలిపిన వివరణ ప్రకారం  పౌరసత్వ చట్టం, 1955 చట్టం కింద పౌరసత్వ ధృవీకరణ పత్రాలను మంజూరు చేయడానికి కలెక్టర్లకు అధికారాలిస్తూ జారి చేసిన నోటిఫికేషన్ ని 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేస్తున్నారని తప్పుగా అర్థం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు, 2019లో తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA) కింద రూల్స్ తేవడానికి మరింత సమయం కోరుతూ ప్రభుత్వం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి లేఖ రాసినట్టు కూడా వార్తలు ఉన్నాయి.

చివరగా, దేశవ్యాప్తంగా CAA అమలు చేయాలంటూ కేంద్ర హోం శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇంకా అసలు 2019 CAA చట్టానికి సంబంధించిన రూల్స్ రూపొందించనేలేదు.