15 డిసెంబర్ 2025 నాటి ఒక అధికారిక గెజిట్ నోటిఫికేషన్ యొక్క గ్రాఫిక్‌ను కలిగి ఉన్న పోస్ట్‌ను (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తూ, సుప్రీం కోర్టు, సివిల్ రిట్ పిటిషన్ నంబర్ 2490, కేసు నంబర్ 8222/2024లో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధి ఇప్పుడు 15 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాల 8 నెలలు (128 నెలలు) ఉంటుందని ఆదేశించింది అని క్లెయిమ్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా భారత సుప్రీంకోర్టు, సివిల్ రిట్ పిటిషన్ నంబర్ 2490, కేసు నంబర్ 8222/2024లో, పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని 15 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
ఫాక్ట్ (నిజం): ఈ పోస్ట్‌తో పాటు ఉన్న గెజిట్ నోటిఫికేషన్ గ్రాఫిక్ పెన్షన్ కమ్యుటేషన్‌కు సంబంధించినది కాదు, ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) & NPSకి సంబంధించినది. పైగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని 10 సంవత్సరాల 8 నెలలకు (128 నెలలు) తగ్గించాలని సుప్రీంకోర్టు ఆదేశించలేదు. CWP 2490/2024, 8222/2024 కేసులు సుప్రీం కోర్టుకు కాదు, పంజాబ్ & హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించినవి. ప్రస్తుతానికి పెన్షనర్లకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్ కమ్యుటేషన్) నియమాలు, 1981 వర్తిస్తాయి, ఇది కమ్యుటేషన్ తేదీ నుండి 15 సంవత్సరాల తర్వాత మాత్రమే పూర్తి పెన్షన్ పునరుద్ధరణకు వీలు కల్పిస్తుంది. కాబట్టి, పోస్ట్‌లో చేసిన వాదన తప్పు.
వైరల్ పోస్ట్‌తో షేర్ చేయబడిన గెజిట్ నోటిఫికేషన్ గ్రాఫిక్‌ను పరిశీలించినప్పుడు, ఆ గెజిట్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) జారీ చేసిందని మేము కనుగొన్నాము. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ Exits and Withdrawals under the National Pension System) (Amendment) రెగ్యులేషన్స్, 2025కి సంబంధించినది. అసలు నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడవచ్చు. దీని ద్వారా వైరల్ పోస్టులో ఉన్న గెజిట్ నోటిఫికేషన్ గ్రాఫిక్‌కి పెన్షన్ కమ్యుటేషన్‌కు సమబంధం లేదని కనుగొన్నాం.
తదుపరి, తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ క్లెయిమ్ లో ఇచ్చిన కేసు నంబర్లు CWP 2490/2024 (ఇక్కడ, ఇక్కడ), 8222/2024 పరిశీలిస్తే, ఇవి సుప్రీంకోర్టు కాకుండా పంజాబ్ & హర్యానా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లు అని మేము కనుగొన్నాము. ఈ కేసుల్లో ప్రధానంగా పంజాబ్, హర్యానాలోని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మధ్యంతర స్టే (ఇక్కడ, ఇక్కడ) కోసం దాఖలు చేసిన ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. అవి దేశవ్యాప్తంగా పెన్షన్ నియమాలలో ఎటువంటి మార్పుకు దారితీయలేదు, కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని కూడా తగ్గించలేదు.
దీని గురించి మరింత వెతికితే, పంజాబ్ & హర్యానా హైకోర్టు (CWP 9426/2023) Shila Devi & Others vs State of Punjab కేసులో పంజాబ్ రాష్ట్ర పెన్షన్ నియమాలను సవాలు చేస్తూ ధాఖలు చేసిన 807 పిటిషన్లను కొట్టివేసిందని మేము కనుగొన్నాము. అంతే కాకుండా, అనేక సంబంధిత పిటిషన్లను 15 సంవత్సరాల కమ్యుటేషన్ రికవరీ నియమాన్ని సమర్థిస్తు కోర్టులు డిస్మిస్ చేశాయి.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్) రూల్స్, 1981 ప్రకారం ప్రస్తుత నియమం 15 సంవత్సరాల తర్వాత పూర్తి పెన్షన్ పునరుద్ధరణను నిర్దేశిస్తుంది. అధికారిక ప్రభుత్వ పోర్టల్స్ (ఇక్కడ, ఇక్కడ) కూడా 15 సంవత్సరాల తర్వాత పునరుద్ధరణను సూచిస్తున్నాయి. CCS రూల్స్, 1981 ప్రకారం “కమ్యుటేషన్ కారణంగా పెన్షన్ తగ్గింపు అమలులోకి వచ్చిన తేదీ నుండి పదిహేను సంవత్సరాలు పూర్తయిన తర్వాత కమ్యుటెడ్ పెన్షన్ మొత్తాన్ని పునరుద్ధరించాలి: పెన్షన్‌ను సవరించడం వల్ల ఒకటి కంటే ఎక్కువ సందర్భాలలో కమ్యుటేషన్ మొత్తాన్ని చెల్లించినప్పుడు, సంబంధిత తేదీ(లు) నుండి పదిహేను సంవత్సరాలు పూర్తయిన తర్వాత కమ్యుటెడ్ పెన్షన్ మొత్తాన్ని పునరుద్ధరించాలి(అనువదించబడింది).”
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT), చండీగఢ్‌తో సహా ఇటీవలి హైకోర్టు తీర్పులు, పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ నియమాలను సవాలు చేస్తూ 106 కేసులను కొట్టివేసాయి. తెలంగాణ హైకోర్టు జూలై 2025లో, సుప్రీంకోర్టు తీర్పును సైట్ చేస్తూ 15 సంవత్సరాలను తిరిగి ధృవీకరించింది (ఇక్కడ, ఇక్కడ). 15 సంవత్సరాల పునరుద్ధరణ వ్యవధిని ఎటువంటి సవరణలు మార్చలేదు. ఇటీవలి సవరణలు కమ్యుటేషన్ కాలానికి సంబంధించినవి కావు (ఇక్కడ, ఇక్కడ).
చివరిగా, భారత సుప్రీంకోర్టు పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధిని తగ్గించలేదు.