మాయావతి, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా కాలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనలేదు

బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి, , ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో తన విగ్రహాలు, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఎన్నికల గుర్తు(ఏనుగు) విగ్రహాలను ఏర్పాటు చేయడానికి 2008-09 మరియు 2009-10 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుండి మొత్తం రూ. 2,000 కోట్లు ఉపయోగించారని, ఈ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఖర్చు చేసిన ప్రజా నిధులను తిరిగి మాయావతి చెల్లించాలని కోరుతూ 2009లో రవికాంత్, సుకుమార్ అనే ఇద్దరు లాయర్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) జస్టిస్ బివి నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 15 జనవరి 2025న కొట్టివేసింది (ఇక్కడ & ఇక్కడ). ఈ నేపథ్యంలో, “మాయావతి మరియు ఏనుగు విగ్రహాలు ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా కాలేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మాయావతి, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా కాలేదని పేర్కొంటూ, 2009లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను సుప్రీంకోర్టు 15 జనవరి 2025న కొట్టివేసింది.

ఫాక్ట్(నిజం): ఉత్తరప్రదేశ్ సీఎంగా మాయావతి ఉన్న సమయంలో నోయిడా, లక్నో సహా పలు పబ్లిక్ పార్కుల్లో మాయావతి విగ్రహాలు, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఖజానా నుంచి వెయ్యి కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ 2009లో రవికాంత్, సుకుమార్ అనే ఇద్దరు లాయర్లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను దాఖలు చేశారు. పిటిషనర్లు ఈ విగ్రహాల ఏర్పాటుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తుకు, విగ్రహాల తొలగింపు, BSP ఎన్నికల గుర్తును స్తంభింపజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరుతూ పలు అంశాలను ఈ పిటిషన్‌లో కోరారు. 2009లో ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు అప్పటి నుండి విచారణ చేస్తుంది. ఈ పిటిషన్‌లో పిటిషనర్లు కోరినట్లుగా ఇదివరకే ఏర్పాటు చేసిన విగ్రహాల తొలగింపు సాధ్యం కానందున, రాజకీయ పార్టీలు తమ గుర్తులను ప్రచారం చేయడానికి ప్రజా నిధులను లేదా బహిరంగ స్థలాన్ని ఉపయోగించకూడదని పేర్కొంటూ 2016లో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) పలు మార్గదర్శకాలను జారీ చేసిందని పేర్కొంటూ సుప్రీంకోర్టు 15 జనవరి 2025న ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకానీ ఈ తీర్పులో ఎక్కడా మాయావతి, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా కాలేదని సుప్రీంకోర్టు పేర్కొనలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) (WRIT PETITION(S)(CIVIL) NO(S).266/2009) నేపథ్యం:

ఉత్తరప్రదేశ్ సీఎంగా మాయావతి ఉన్న సమయంలో నోయిడా, లక్నో సహా పలు పబ్లిక్ పార్కుల్లో మాయావతి విగ్రహాలు, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఖజానా నుంచి వెయ్యి కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ 2009లో రవికాంత్, సుకుమార్ అనే ఇద్దరు లాయర్లు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను దాఖలు చేశారు. పిటిషనర్లు ఈ విగ్రహాల ఏర్పాటుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తుకు, విగ్రహాల తొలగింపు, BSP ఎన్నికల గుర్తును స్తంభింపజేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని కోరుతూ పలు అంశాలను ఈ పిటిషన్‌లో కోరారు పిటిషనర్లలో ఒకరు 2010లో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ విగ్రహాలను తెరవకూడదని, BSP పార్టీ గుర్తుకు ప్రజాధనాన్ని వెచ్చించరాదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ఈ పిటిషనల్లో పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని (ECI) కోరింది. దీనిపై ECI BSP పార్టీని వివరణ కోరగా ఈ పిటిషన్లపై ప్రతిస్పందిస్తూ తాము ఏర్పాటు చేసిన/చేస్తున్న ‘ఏనుగు’ విగ్రహాలు తమ పార్టీ గుర్తుకు కచ్చితమైన ప్రతిరూపం కాదని, పార్టీ గుర్తులో ఏనుగు తొండం కిందకు దించి ఉంటుందని, కానీ ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఏనుగు విగ్రహాలలో ఏనుగు తొండం పైకి లేపి ఉన్నాయని పేర్కొంది. ఇటువంటి ఏనుగు విగ్రహాలు అనేకం బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు మొదలైన వాటిలో కనిపిస్తాయని BSP పేర్కొంది. అలాగే BSP తమ వాదనల్లో భారత జాతీయ కాంగ్రెస్ (INC) కూడా అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరియు బహిరంగ ప్రదేశాలకు తన నాయకుల పేర్లను పెట్టిందని పేర్కొంది. గత INC, BJP ప్రభుత్వాలు కూడా ఇటువంటి విగ్రహాలను నిర్మించాయని BSP ECI కి సమర్పించిన తన అఫడవిట్ లో పేర్కొంది.

ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికలను పర్యవేక్షించడం, నిర్దేశించడం, నియంత్రించడం ECI యొక్క అధికార పరిధి అని, ఎన్నికలేతర కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ రోజువారీ పనితీరుతో ECIకి ఎటువంటి సంబంధం లేదని BSP తమ వాదనలో పేర్కొంది.

ఈ WRIT PETITION(S)(CIVIL) NO(S).266/2009 విచారణ సుప్రీంకోర్టులో సాగుతుండగా COMMON CAUSE అనే సంస్థ ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్‌ను (W.P.(C) No.8363/2010) దాఖలు చేస్తూ BSP పార్టీ యొక్క ‘ఏనుగు’ను గుర్తు స్తంభింపజేయాలని ECIని ఆదేశించాలని కోరింది. ఈ రిట్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు 7 జూలై 2016న డిస్పోజ్ చేస్తూ (కొట్టివేస్తూ), ‘అధికారంలో ఉన్న, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తన రిజర్వ్ చిహ్నాన్ని మరియు / లేదా దాని నాయకులను ప్రచారం చేయడానికి పబ్లిక్ స్థలాలు మరియు ప్రజా నిధులను ఉపయోగించకుండా, తద్వారా స్వేచ్ఛగా, న్యాయంగా మరియు శాంతియుతంగా నిర్వహించే మార్గంలో రాకుండా నిరోధించడానికి తగిన మార్గదర్శకాలను జారీ చేయాలని’ ECIని ఆదేశించింది (ఇక్కడ).

రిట్ పిటిషన్‌ను (W.P.(C) No.8363/2010) విచారణలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను అనుసరించి, ECI అధికారంలో ఉన్న, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తన రిజర్వ్ చిహ్నాన్ని లేదా దాని నాయకులను ప్రచారం చేయడానికి పబ్లిక్ స్థలాలు, ప్రజా నిధులను ఉపయోగించకుండా ఉండటంపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలను కోరింది. పలు పార్టీల అభిప్రాయాలను, వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఏ రాజకీయ పార్టీ తమ ఎన్నికల చిహ్నాన్ని ప్రచారం చేయడానికి పార్టీ ప్రజా నిధులను లేదా ప్రభుత్వ లేదా బహిరంగ స్థలాన్ని ఉపయోగించకూడదని 2016లో ECI మార్గదర్శకాలను జారీ చేసింది. ECI వారి ఈ ఆదేశాలను ఉల్లంఘించిన రాజకీయ పార్టీలపై తగిన చర్యలు తీసుకుంటామని ECI జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది (ఇక్కడ).

15 జనవరి 2025న WRIT PETITION(S)(CIVIL) NO(S).266/2009)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు:

ఈ పిటిషన్‌పై 15 జనవరి 2025న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనం పరిశీలిస్తే, ఈ పిటిషన్‌ను డిస్పోజ్ చేస్తూ (కొట్టివేస్తూ) ఈ పిటిషన్‌లో పిటిషనర్లు కోరినట్లుగా ఇదివరకే ఏర్పాటు చేసిన విగ్రహాల తొలగింపు సాధ్యం అవనందున, రాజకీయ పార్టీలు తమ గుర్తులను ప్రచారం చేయడానికి ప్రజా నిధులను లేదా బహిరంగ స్థలాన్ని ఉపయోగించకూడదని పేర్కొంటూ ఇదివరకే 2016లో కేంద్ర ఎన్నికల సంఘం (ECI ) పలు మార్గదర్శకాలను జారీ చేసినందున జస్టిస్ బివి నాగరత్న, సతీష్ చంద్ర శర్మలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అంతేకానీ, ఈ తీర్పులో ఎక్కడ మాయావతి, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు వల్ల ప్రజాధనం వృథా కాలేదని సుప్రీంకోర్టు పేర్కొనలేదు. అంతేకాకుండా, 07 జూలై 2016న ECI జారీ చేసిన మార్గదర్శకాలను లేదా ECI జారీ చేసే మార్గదర్శకాలను BSP పార్టీ మాత్రమే కాకుండా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా పాటించాలని ఆదేశించింది (ఇక్కడ).

చివరగా, మాయావతి, BSP పార్టీ గుర్తు అయిన ఏనుగు విగ్రహాలు ఏర్పాటు వల్ల ప్రజాధనం వృధా కాలేదని పేర్కొంటూ, 2009లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)ను సుప్రీంకోర్టు 15 జనవరి 2025న కొట్టివేసింది అనే వాదన ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.