ఈ ఫొటోల్లో ఉన్న శ్రీ యంత్రం బిల్ విథర్‌స్పూన్ నేతృత్వంలోని ఆర్టిస్ట్ బృందం గీసింది

1990లో అమెరికాలోని ఒరెగాన్‌లో ఒక ఎండిపోయిన చెరువు ఉండే ప్రాంతంలో సుమారు 13 మైళ్ళ పొడువు, వెడల్పు ఉన్న ఒక శ్రీ యంత్రం కనుగొనబడింది అని, అది గియ్యటం మానవమాత్రులకి అసాధ్యం అని చెప్తున్న పోస్టు ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ఇది ఎవరు గీశారు? అంతకముందే ప్రపంచం అంతా  హిందూమతంతోనే పుట్టింది అనటానికి ఇది నిదర్శనం అని పోస్టులో రాసారు. ఇందులోని నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

YouTube Poster

క్లెయిమ్: 1990లో అమెరికాలోని ఒరెగాన్‌లో ఒక ఎండిపోయిన చెరువు ఉండే ప్రాంతంలో కనుకొనబడిన శ్రీ యంత్రం మానవాతీతమైనది, ఇది పూర్వమే ప్రపంచమంతా హిందూమతంతోనే పుట్టింది అనటానికి సూచన.

ఫ్యాక్ట్ (నిజం): ఈ శ్రీ యంత్రాన్ని బిల్ విథర్‌స్పూన్ అనే ఆర్టిస్ట్ మరియు తన బృందం 1990లో అమెరికాలోని ఒరెగాన్‌లో ఉన్న ఒక లేక్ బెడ్ పైన గీశారు. శ్రీ యంత్రం హైందవ సాంప్రదాయక చిహ్నం. శ్రీ యంత్రంపై తాను చేసిన రీసెర్చ్ తనపై ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపిందని బిల్ ఒక అర్టికల్‌లో రాసారు. ఈ సంఘటనపై 2021లో ‘శ్రీ యంత్ర:ది ఒరెగాన్ డెసర్ట్ మిస్టరీ’ అనే ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా రిలీజ్ అయ్యింది. మనుషులు గీసిన దాన్ని మానవాతీతమైనదిగా పోస్టులో తప్పుదోవ పట్టించేలా క్లెయిమ్ చేస్తున్నారు.

తగిన కీ వర్డ్స్ ఉపయోగించి పోస్టులో చెప్తున్న శ్రీ యంత్రాన్ని గురించి వెతుకగా, బిల్ విథర్‌స్పూన్ అనే ఆర్టిస్ట్ ఈ శ్రీ యంత్రాన్ని ఒరెగాన్‌లోని మిక్కీ బేసిన్లో 1990లో తన బృందంతో కలిసి గీశారు అని తెలిసింది. దీని గురించి ఎం.ఐ.టి ప్రెస్ డైరెక్ట్‌లో ప్రచురించబడిన ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు. ఇదే ఆర్టికల్ ప్రాజెక్ట్ మూస్ ద్వారా కూడా ప్రచురితమైంది, దాన్ని ఇక్కడ చదవచ్చు.

బిల్, తన కొడుకు మరియు స్నేహితులతో కలిసి 1990లో ఒరెగాన్‌లోని ఒక లేక్ బెడ్ పైన శ్రీ యంత్రాన్ని గీశారు. అది పూర్తయ్యే నాటికీ ¼ మైళ్ళు వెడల్పు, 40 ఎకరాల విస్తీర్ణం మరియు 13 మైళ్ళ లైన్లు కలిగి ఉంది. శ్రీ యంత్రాన్ని గియ్యటానికి 10 రోజులు పట్టింది వీరికి. శ్రీ యంత్రానికి సంభందించిన చిత్రాన్ని కింద చూడచ్చు, ఇదే చిత్రం పోస్టులో కూడా ఉంది కానీ అది క్రాప్ చేయబడింది.  

1990లలో ఈ శ్రీ యంత్రాన్ని యూ.ఎఫ్.ఓలు (Unidentified flying object) గీసాయి అనే వాదనలు రాగా , ఇది తాను తన బృందంతో కలిసి గీసినదని బిల్ స్పష్టం చేసారు.

2021లో ఒరెగాన్‌ శ్రీ యంత్ర పైన శ్రీ యంత్ర:ది ఒరెగాన్ డెసర్ట్ మిస్టరీ’ అనే డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది. డాక్యుమెంటరీ ప్రీమియర్ అయిన సందర్భంగా బిల్, అయోవా సోర్స్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ చదవచ్చు. ఈ శ్రీ యంత్రాన్ని గురించి ఒరెగాన్ లైవ్ వారు ప్రచురించిన ఒక ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు.

చివరిగా, మనుషులు గీసిన శ్రీ యంత్రాన్ని మానవాతీతమైనదని పోస్టులో తప్పుదోవ పట్టించేలాగా షేర్ చేస్తున్నారు. ఈ చిత్రాల్లో ఉన్న శ్రీ యంత్రం బిల్ విథర్‌స్పూన్ అనే ఆర్టిస్ట్ తన బృందంతో కలిసి గీశారు.