ప్రాచీన కాలంలో లైఫ్ ట్యాంకులు వాడినట్టు చూపిస్తున్న 5000 ఏళ్ల కిందటి చిత్రం అని చెప్తూ, ఒక శిల్పం ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఆ శిల్పం భారత్ కి చెందినట్టు ‘#భారత్_మాతాకీ_జై_జై_హింద్’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రాచీన కాలంలో లైఫ్ ట్యాంకులు వాడినట్టు చూపిస్తున్న 5000 ఏళ్ల కిందటి భారతదేశానికి చెందిన శిల్పం ఫోటో.
ఫాక్ట్: ఫోటోలోని శిల్పం 865 బీసీ – 860 బీసీ కాలానికి చెందిన అస్సిరియన్ ఆర్ట్. చిత్రం లోని శిల్పం సుమారు 2900 ఏళ్ల కిందటిది మరియు భారతదేశానికి సంబంధించినది కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని శిల్పం ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని ఒకరు ట్వీట్ చేసి, గాలితో నింపిన జంతు చర్మం సహాయంతో నదిలో ఈదుకుంటూ వెళ్తున్న ఒక అస్సిరియన్ సైనికుడు అని రాసినట్టు చూడవొచ్చు. కొన్ని కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, ఫోటోలో ఉన్న శిల్పం బ్రిటీష్ మ్యూజియం లో ఉన్నట్టు తెలిసింది. బ్రిటీష్ మ్యూజియం వారి వెబ్సైటులో ఆ శిల్పం 865 బీసీ – 860 బీసీ కాలానికి చెందిన అస్సిరియన్ ఆర్ట్ అని రాసి ఉన్నట్టు చదవొచ్చు. కాబట్టి, ఈ శిల్పం కేవలం సుమారు 2900 ఏళ్ల కిందటిది మరియు భారతదేశానికి సంబంధించినది కాదు.
‘The Ancient Assyrians’ అనే పుస్తకంలో కూడా ఈ శిల్పం కి సంబంధించిన సమాచారాన్ని చదవొచ్చు.
ప్రాచీన కాలంలో అస్సిరియన్ సామ్రాజ్యం మిడిల్ ఈస్ట్–ఈజిప్ట్-లెవాంట్ ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది.
చివరగా, చిత్రం లోని శిల్పం కేవలం సుమారు 2900 ఏళ్ల కిందటిది మరియు భారతదేశానికి సంబంధించినది కాదు.