“ముస్కాన్ అనే ముస్లిం అమ్మాయి సౌరభ్ అనే హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కొంతకాలం తర్వాత, ఆమె తన చిన్ననాటి స్నేహితుడైన సాహిల్ అనే ముస్లిం వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఆమె భర్త సౌరభ్‌కు ఈ విషయం తెలియగానే, ముస్లిం ప్రియుడు, అతని ముస్లిం భార్య ఆ హిందూ భర్తను చంపి 15 ముక్కలుగా నరికివేశారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుతో పాటు సాహిల్, ముస్కాన్ ఫోటోలను కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సౌరభ్ అనే హిందూ అబ్బాయిని అతని ముస్లిం భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ అనే ముస్లిం వ్యక్తి కలిసి దారుణంగా హత్య చేశారు.
ఫాక్ట్(నిజం): ఇటీవల 2025 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన సౌరభ్ రాజ్‌పుత్ హత్యలో, హతుడు సౌరభ్ రాజ్‌పుత్‌తో పాటు నిందుతులైన అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కూడా హిందూవులే. ఇదే విషయాన్ని ఈ హత్య కేసును విచారిస్తున్న మీరట్ బ్రహ్మపురి పోలీసులు Factly తో చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, 04 మార్చి 2025న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సౌరభ్ రాజ్‌పుత్ అనే మర్చంట్ నేవీ అధికారిని అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లా చంపారు అని పేర్కొంటూ వైరల్ పోస్టులోని ఫోటోలను రిపోర్ట్ చేస్తూ ప్రచురించబడిన పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన సౌరభ్ రాజ్‌పుత్ 2016లో ముస్కాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 2019లో తాను ఒక పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెకు సాహిల్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్ రాజ్‌పుత్ తన కుమార్తె పుట్టిన రోజు జరపడం కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ నుండి ఇండియా వచ్చాడు. అయితే అప్పటికే ముస్కాన్ రస్తోగి తన భర్త సౌరభ్‌ను అంతమొందించాలనుకుంది. 04 మార్చి 2025 రాత్రి సౌరభ్ తినే భోజనంలో నిద్ర మాత్రలు కలిపి వడ్డించింది, తిన్న తర్వాత మత్తులోకి వెళ్లిన సౌరభ్‌పై ప్రియుడు సాహిల్‌తో కలిసి కత్తితో దాడి చేసి చేసింది. ఆ తర్వాత సౌరభ్ శరీరాన్ని 15 ముక్కలుగా చేసి, ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, తడి సిమెంట్ తో నింపేశారు. డ్రమ్‌ను ఇంట్లో వదిలి, ముస్కాన్ మరియు ఆమె ప్రియుడు సాహిల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి విహారయాత్రకు వెళ్లారు. 18 మార్చి 2025 న తిరగి వచ్చిన ముస్కాన్ తన తల్లికి అంతా చెప్పగా, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఈకేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న ముస్కాన్, సాహిల్‌ను మీరట్ బ్రహ్మపురి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని, 19 మార్చి 2025న, మీరట్ కోర్టు వారిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది అని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
వార్త కథనాల ప్రకారం, సౌరభ్ రాజ్‌పుత్ హత్యలో నిందుతులైన అతని భార్య పూర్తి పేరు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు పూర్తి పేరు సాహిల్ శుక్లా. ఈ పేర్లను బట్టి నిందుతులు ఇద్దరు ముస్లిం మతానికి చెందిన వారు కాకపోవచ్చని తెలుస్తుంది. అలాగే సౌరభ్ మంచి వ్యక్తి అని, అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ తమ కూతురిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుకుంటున్నట్లు ముస్కాన్ తల్లిదండ్రులు మీడియాతో చెప్పారు. ముస్కాన్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడిన వీడియోలను చూస్తే ముస్కాన్, ఆమె తల్లిదండ్రులు హిందువులే అని స్పష్టమవుతుంది (ఇక్కడ).
తదుపరి మేము ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ హత్య కేసును విచారిస్తున్న మీరట్ బ్రహ్మపురి పోలీసులను మేము సంప్రదించగా, మాతో (Factly) మాట్లాడుతూ వారు, “సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందుతులైన అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా ఇద్దరు హిందూవులే, ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది” అని చెప్పారు.
చివరగా, ఇటీవల 2025 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన సౌరభ్ రాజ్‌పుత్ హత్యను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.