వేరువేరు దుస్తుల్లో ఉన్న ఈ రెండు CRPF జవాన్ల ఫోటోలు బీజేపీ అధికారంలో ఉన్నప్పటివే

గత ప్రభుత్వాలు సైనికులకు సరైన సదుపాయాలు అందించలేదని, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సైనికులకు సరైన సదుపాయాలు అందిస్తుందని చెప్పే క్రమంలో సాధారణ రక్షణ యూనిఫాం ధరించిన ఒక సైనికుడి ఫోటోని భద్రతా సదుపాయాలు కలిగిన అధునాతన దుస్తులు ధరించిన మరొక సైనికుడి ఫోటోతో పోలుస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ పోస్టులో సాధారణ దుస్తులతో ఉన్న ఫోటో గత ప్రభుత్వం సమయంలో సైనికుల పరిస్థితిని చూపిస్తుంటే, మరొక ఫోటో మోదీ ప్రభుత్వం సైనికులకు అందిస్తున్న సదుపాయాలను చూపిస్తుందంటూ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ రెండో ఫోటోలకు సంబంధించిన చూద్దాం.

క్లెయిమ్: గత ప్రభుత్వ హాయాంలో, మోదీ ప్రభుత్వ హయాంలో సైనికులకు అందిస్తున్న సదుపాయాలను పోలుస్తున్న ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ రెండు ఫోటోలు మోదీ/బీజేపీ ప్రభుత్వ హాయాంకి సంబంధించినవే. ఎడమ వైపు ఫోటో 2017లో జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక CRPF జవాను భాద్యతలు నిర్వహిస్తున్న సమయంలో తీసింది కాగా, కుడి వైపు ఫోటో 26 జనవరి 2021న ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున CRPF కమాండో విధులు నిర్వహిస్తున్నప్పుడు తీసింది. ఐతే కుడి వైపు ఉన్న ఫోటోలో ఉన్నది ‘VALLEY QAT’ అనే CRPF యొక్క ఎలైట్ యూనిట్ కమాండో. సాధారణంగా సైనికులకు సంబంధించి చేసే ఆపరేషన్లు, వారు చెందిన యూనిట్ల బట్టి వారి యూనిఫాం ఒక్కో రకంగా ఉంటుంది, అందుకే కుడి వైపు ఉన్న ఫోటోలో సైనికుడు ప్రత్యేకమైన యూనిఫాంలో ఉన్నాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులోని ఫోటోలో ఎడమ వైపు సాధారణ సైనికుల దుస్తులు మరియు ఆయుదాలతో ఉన్న సైనికుడి ఫోటో 2017లో జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఒక CRPF జవాను భాద్యతలు నిర్వహిస్తున్న సమయంలో తీసింది. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అలామి, స్టాక్ ఫోటో వెబ్సైటులో ముందు తెలిపిన వివరణతో అప్లోడ్ చేసి ఫోటో మాకు కనిపించింది. అంటే ఈ ఫోటో కూడా బీజేపీ (మోదీ ప్రధానమంత్రి) అధికారంలో ఉన్నప్పుడు తీసిందేనని, బీజేపీ అధికారంలో సైనికులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను తెలియజేస్తుందని అర్ధం చేసుకోవచ్చు.

ఇకపోతే పోస్టులో కుడి వైపు ఫోటో, 26 జనవరి 2021న ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున CRPF కమాండో విధులు నిర్వహిస్తున్నప్పుడు తీసింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇదే ఫోటో గెట్టి ఇమేజ్స్, స్టాక్ ఫోటో వెబ్సైటులో ఇదే వివరణతో కనిపించింది.

ఈ వెబ్సైటులో ఉన్న ఫోటోని జూమ్ చేసి చూసినప్పుడు కమాండో భుజనికి ఉన్న బ్యాడ్జ్ పై ‘VALLEY QAT’ అని రాసి ఉండడం చూడొచ్చు. దీని ఆధారంగా గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా, ‘VALLEY QAT’ అనేది ప్రత్యేకంగా జమ్ముకాశ్మీర్‌లో ఆపరేట్ చేసే CRPF యొక్క ఎలైట్ యూనిట్ అని తెలిసింది.

సాధారణంగా సైనికులకు సంబంధించి వారు చేసే ఆపరేషన్లు, వారు చెందిన యూనిట్ల బట్టి వారి యూనిఫాం ఒక్కోరకంగా ఉంటుంది. జమ్ముకాశ్మీర్‌లో ఆపరేట్ చేసే ఎలైట్ యూనిట్ కాబట్టి సైనికుడు అధునాత రక్షణ సౌకర్యాలున్న యూనిఫాం ధరించాడు. కాగా సాధారణ CRPF జవానులు ఇప్పటికి సాధారణ కాకి యూనిఫాం ధరిస్తున్నారు.

ఐతే సైనికులకు సంబంధించి రక్షణ సదుపాయాలు లేక ఆయుధాల ఆధునీకరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇంతకు ముందున్న గత ప్రభుత్వాల సమయంలో కూడా ఆధునీకరణ జరిగింది. ఇప్పటి బీజేపీ ప్రభుత్వ హాయాంలో కూడా సైన్యానికి సంబంధించి ఆధునీకరణ జరుగుతూ వస్తుంది. ఐతే ఈ నేపథ్యంలో, పోస్టులో రెండు ఫోటోల ద్వారా చేసిన పోలిక మాత్రం కరెక్ట్ కాదు. రెండు ఫొటోలూ ఈ ప్రభుత్వ హయాంలోనివే.

చివరగా, వేరువేరు యూనిఫాంలో ఉన్న ఈ రెండు CRPF జవాన్ల ఫోటోలు బీజేపీ అధికారంలో ఉన్నప్పటివే.