‘ముస్లిం వ్యక్తి మొదటిసారి విమానంలో ప్రయాణించడం వల్ల భయాందోళనకు గురై ఏడుస్తున్నాడు. క్యాబిన్ సిబ్బంది అతనికి సహాయం చేస్తున్నారు కానీ అతను స్కల్ క్యాప్ ధరించి ఉన్నాడనే కారణంతో ఒక సంఘీ వ్యక్తి అతనిని చెంపదెబ్బ కొట్టాడు’ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక ఇండిగో విమానం లోపల, ఒక ప్రయాణికుడు టోపీ (స్కల్ క్యాప్) వేసుకున్న తన తోటి ప్రయాణికుడిని కొట్టడం మనం చూడవచ్చు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: మొదటిసారి విమానంలో ప్రయాణిస్తూ, భయాందోళనకు గురైన ఒక ఒక ముస్లిం వ్యక్తిని ఒక హిందూ వ్యక్తి చెంప దెబ్బ కొడుతున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న సంఘటన ఇండిగో విమానం 6E-138లో ఇటీవల జరిగింది. ఇందులో నిందితుడు (హఫిజుల్ రెహమాన్), బాధితుడు (హొసైన్ అహ్మద్ మజుందార్) ఇద్దరూ ముస్లిం వ్యక్తులే. కాబట్టి, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన అనేక మీడియా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన 31 జూలై 2025న (కొన్ని కథనాల ప్రకారం 1 ఆగస్ట్ 2025న) ముంబై-కలకత్తా ఇండిగో విమానం నెం. 6E-138లో జరిగింది.
అస్సాంకు చెందిన హుస్సేన్ అహ్మద్ మజుందార్, ఈ విమానంలో ప్రయాణం చేస్తుండగా భయాందోళనకు గురయ్యాడు. తనకు విమాన సిబ్బంది సహాయం చేస్తుండగా, హఫిజుల్ రహమాన్ అనే తోటి ప్రయాణికుడు వీడియోలో కనిపిస్తున్న విధంగా తనను చెంప మీద కొట్టాడు. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా నిందితుడు హిందువు కాదు, ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి.
ఈ విషయం గురించి, స్థానిక బిధాన్‌నగర్ పోలీస్ వారు ‘Xలో పోస్ట్ చేస్తూ’, 1 ఆగస్ట్ 2025న వారికి ఇండిగో విమానం నెం. 6E-138లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక గొడవ గురించి వారికి ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పారు. ఈ గొడవ పెద్దదై, హఫిజుల్ రెహమాన్ అనే వ్యక్తి హొసైన్ అహ్మద్ మజుందార్ అనే వ్యక్తిని చెంప దెబ్బ కొట్టాడని, ఈ నిమిత్తం విచారణ జరిగుతుందని, ఇందులో పేర్కొన్నారు.
అయితే, ఈ సంఘటన తర్వాత, బాధితుడు హొసైన్ అహ్మద్ మజుందార్, తాను ఎక్కడ ఉన్నాడు అనే వివరాలు కుటుంబ సభ్యులతో పంచుకోక పోయే సరికి వారు భయపడ్డారు (ఇక్కడ, ఇక్కడ). కానీ తను కలకత్తా నుంచి సిల్చార్ వెళ్లవలసిన విమానం ఎక్కకుండా, హొసైన్ రైలు మార్గం ద్వారా తన ఇంటికి ప్రయాణిస్తున్నాడని 2 ఆగస్ట్ 2025న పోలీసులు ఇండియన్ ఎక్స్‌ప్రెస్స్‌కు తెలిపారు.
హొసైన్ పట్ల ఈ విధంగా వ్యవహరించినందుకు ఇండిగో సంస్థ హఫిజుల్ రెహమాన్‌ను తమ విమానాల్లో ప్రయాణించకుండా సస్పెండ్ (బ్యాన్) చేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
చివరగా, విమానంలో ప్రయాణిస్తున్న ఒక ముస్లిం వ్యక్తిని, తన తోటి ప్రయాణికుడు చెంప దెబ్బ కొట్టిన ఈ సంఘటనలో నిందితుడు కూడా ముస్లిం వ్యక్తే. అతను హిందువు అని తప్పుడు ప్రచారం జరిగుతుంది.