ఈ ఫొటోలో జిన్నా కుడివైపు కూర్చున్న వ్యక్తి భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాదు

‘జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ, ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ ఆలీ జిన్నా తో కలిసి బెంగాల్ లో అధికారం పంచుకున్నప్పటి ఫోటో,’ అని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ ఫొటోలో జిన్నాకు కుడి పక్కన ఉన్న వ్యక్తి శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని సూచిస్తూ, ఆయన ముఖం పైన ఒక సర్కిల్ ఉంది. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆల్-ఇండియా ముస్లిం లీగ్ స్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలిసి దిగిన ఫోటో.

ఫ్యాక్ట్(నిజం): జిన్నా కుడివైపు కూర్చున్న వ్యక్తి భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాదు, పాకిస్థాన్ రెండవ ప్రధాని ఖ్వాజా నజీముద్దీన్. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ ఫోటో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, దాన్ని ఉపయోగించి ఇంటర్నెట్‌లో ఒక రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము. ఈ సెర్చ్ ద్వారా, వైరల్ ఫోటో యొక్క అన్-క్రాప్డ్ వెర్షన్ (uncropped version) మాకు Alamy అనే స్టాక్ ఫోటో వెబ్సైటులో లభించింది.

ఈ ఫోటో యొక్క క్యాప్షన్ ప్రాకారం ఇది లక్నోలో జరిగిన ముస్లిం లీగ్ వర్కింగ్ కమిటీ సెషన్‌కు సంబంధించిన ఫోటో. ఇదే ఫోటో మాకు వికీ కామన్స్ సైటులో లభించింది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ముస్లిం లీగ్‌లో సభ్యుడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు, ఆయన భారతీయ జన సంఘ్ యొక్క వ్యవస్థాపకుడు (ఇక్కడ, ఇక్కడ).  

అలాగే, ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తున్న క్రమంలో, మాకు ఇందులో కనిపిస్తున్న వ్యక్తులు ఉన్న మరో ఫోటో Getty Images అనే స్టాక్ ఫోటో వెబ్సైటులో, ఇంకా The Hindu Frontline వారి ఒక 2015 నాటి కథనంలో లభించింది. 

ఈ ఫొటోల వివరణలా ప్రకారం, ఈ ఫొటోలో జిన్నాకు కుడి వైపు ఉన్న వ్యక్తి పేరు ‘సర్-నిజాముద్దీన్ (Sir Nizam-ud-Din).’ Frontline కథనం ప్రకారం, ఈయన బెంగాల్ ప్రభుత్వం యొక్క హోం మంత్రి. 

ఈ వ్యక్తి గురించి మరిన్ని వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా సర్-నిజాముద్దీన్ అసలు పేరు ఖ్వాజా నజీముద్దీన్ అని నాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). బెంగాల్ ప్రభుత్వంలో హోం మంత్రిగా చేసిన తర్వాత, ఈయన పాకిస్తాన్ యొక్క రెండవ ప్రధాన మంత్రిగా పనిచేశాడు. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ వెబ్సైటులో ఉన్న తన ఫోటో (ఇక్కడ, ఇక్కడ), Getty Images ఇంకా వేరే పబ్లిక్ డొమైన్‌లో ఉన్న ఫొటోలతో (ఇక్కడ, ఇక్కడ), Frontline కథనం ఇంకా Getty, Alamy స్టాక్ ఫొటోలతో పోల్చి చూస్తే, సర్-నిజాముద్దీన్, ఖ్వాజా నజీముద్దీన్ ఒక్కరే అనే విషయం మాకు స్పష్టం అయింది.

అయితే, భారతీయ జన సంఘ్ యొక్క వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ,పాకిస్తాన్ యొక్క రెండవ ప్రధాన మంత్రి ఖ్వాజా నజీముద్దీన్ మీసకట్టు, జుట్టు ఒకే మాదిరిగా ఉండడం గమనార్హం. 

చివరగా, ఈ ఫొటోలో జిన్నా కుడివైపు కూర్చున్న వ్యక్తి భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాదు, పాకిస్థాన్ రెండవ ప్రధాని ఖ్వాజా నజీముద్దీన్