ఒక వ్యక్తి చేత మూత్రం తాగిస్తున్న ఈ సంఘటన రాజస్థాన్లో జరిగింది, ఆ వ్యక్తి దళితుడు కాదు

ఉత్తర భారతదేశంలో దళితులపై కొనసాగుతున్న మనువాద చట్టాలు, శిక్షలు అని చెప్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడుతోంది. పొస్ట్‌లో ఉన్న ఫోటోలో నేల మీద కూర్చొని ఉన్న ఒక వ్యక్తికి షూ అందిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లో బోరుబావి వద్ద నీళ్లు పట్టుకున్నందుకు దళితున్ని శిక్షిస్తున్నట్టుగా ఈ పోస్టులో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో బోరుబావి వద్ద నీళ్లు పట్టుకున్నందుకు దళితున్ని శిక్షిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ సంఘటన 2020లో రాజస్థాన్‌లోని భావే అనే గ్రామంలో  జరిగింది, ఒక వివాహితతో  సంబంధం పెట్టుకున్నాడు అని కలురామ్ దేవసి అనే యువకుడిని కొంతమంది కిడ్నాప్ చేసి కొట్టి, అతనిచేత బలవంతంగా మూత్రం తాగించారు. కలురామ్ దళితుడు కాదు, రేబారి (దేవసి) అనే OBC (Other Backward Classes) గ్రూపుకి చెందిన వ్యక్తి. కాబట్టి పొస్ట్‌లో చెప్తున్నది తప్పుదోవ పట్టిస్తుంది.

పొస్ట్‌లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా ఒక  ఫేస్‌బుక్‌ పొస్ట్‌ లింక్ దొరికింది. అందులో దైనిక్ భాస్కర్ పత్రికలో ప్రచురించిన కథనం యొక్క  చిత్రం ఉంది. ఆ కథనం శీర్షిక  ‘యువకుడి అపహరణ, బాటిల్‌లో మూత్రం, బూట్లలో నీళ్లు తాగించారు, ఐదుగురి అరెస్ట్’ అని ఉంది.

దీని ఆధారంగా ఇంటర్నెట్లో సరైన కీ వర్డ్స్‌తో  వెతకగా, దైనిక్ భాస్కర్ మరియు వేరే సంస్థలు రాసిన వార్తా  కథనాలు లభించాయి. ఈ కథానాల ప్రకారం జూన్ 2020లో, రాజస్థాన్‌లోని భావే  అనే గ్రామములో కలురామ్ దేవసి అనే యువకుడిని, వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడు అని ఆరోపిస్తూ కొంతమంది కిడ్నాప్ చేసి కొట్టి, అతనిచేత బలవంతంగా మూత్రం తాగించారు. ఈ సంఘటనపై రాజస్థాన్ పోలీస్ తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు. ఈ సంఘటను సంబందించిన మరిన్ని కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

దైనిక్ భాస్కర్ వారి కథనం  ప్రకారం, అరెస్ట్ అయిన వారి పేర్లు లక్ష్మణరామ్ దేవసి, జవనారం, భీమారం, నవరం మరియు దర్గారం దేవసి.

లక్ష్మణరామ్ మరియు దర్గారం  పేరులలో ఉన్న రేబారి (దేవసి) కులం పేరు, బాధితుడు కలురామ్ ది కూడా ఇదే కులం. రాజస్థాన్ రాష్ట్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ వారి కులాల జాబితా ప్రకారం రేబారి (దేవసి) అనే ఓబిసి (OBC) క్యాటగిరీ కిందకి వస్తుంది కానీ దళితుల క్యాటగిరి ఎస్సీ (SC) కాదు.

దీన్ని ఇంకా నిర్ధారించుకోవటానికి కేసు యొక్క ఎఫ్.ఐ.ఆర్  కాపీని  డౌన్లోడ్ చేసి చూసాము. ఒకవేళ  కలురామ్ దళితుడు అయ్యుంటే అరెస్ట్ అయ్యిన వారి పైన SC/ST ప్రివెన్షన్ అఫ్ ఆస్ట్రోసిటీస్ ఆక్ట్, 1989 కింద  కేసు నమోదు అయ్యి  ఉండేది. కానీ ఎఫ్.ఐ.ఆర్  కాపీ ప్రకారం ఐ.పి.సి సెక్షన్ 143, 365, 384, 342, 323 కింద కేసు నమోదు చెయ్యటం జరిగింది. ఈ ఆధారాల బట్టి దేవసి కులానికి చెంది వ్యక్తిని  పొస్ట్‌లో దళితుడు అని తప్పుగా చెప్తున్నారు అని నిర్ధారించుకోవచ్చు. అతన్ని కొట్టినవారిలో కొంతమంది దేవసి కులానికి చెందినవారే .

చివరిగా, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి దళితుడు కాదు, ఈ సంఘటన కూడా ఉత్తర్ ప్రదేశ్లో జరగలేదు. సంభందం లేని పాత వీడియోని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.