“మొన్న ఇద్దరు (ముస్లింలు )సుమో తో గోమాతని గుద్ది గుద్ది చంపాడు, పాలనలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని సీరియస్ గా తీసుకుని ఆ రాక్షసుల్ని చితక్కొట్టి ఊరేగించారు. ఇది కేవలం బీజేపీ పాలన లోనే జరుగుతుంది” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, పోలీసులు ఇద్దరు వ్యక్తులకు సగం గుండు చేయించి రోడ్డుపై నడిపిస్తున్న దృశ్యాలను, కొంతమంది వ్యక్తులు జీపుతో ఎద్దును ఢీకొట్టిన దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇద్దరు ముస్లింలు ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపగా, పోలీసులు వారిని అరెస్టు చేసిన రోడ్డుపై నడిపిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 01 అక్టోబర్ 2025న రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో నెచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో బవేరియా ప్రాంతంలో ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు. వార్తా కథనాల, ప్రకారం నిందితులు నెచ్వాకు చెందిన శివరాజ్ (26), సుజన్‌గఢ్‌కు చెందిన ప్రేమ్ చంద్ (40), మరో ఇద్దరు వ్యక్తులు. ఈ సంఘటనపై FIR నమోదు చేసిన నెచ్వా పోలీసులు Factly తో మాట్లాడుతూ, ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని, నిందితులందరూ హిందువులేనని, ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నామని అని చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను, 03 అక్టోబర్ 2025న రాజస్థాన్‌లోని సికార్ జిల్లాకు చెందిన నెచ్వా పోలీసులు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో నెచ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రోడ్లపై నడిపిస్తూ, శిక్షించిన దృశ్యాలను చూపిస్తుంది.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 01 అక్టోబర్ 2025న, రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని నెచ్వా పట్టణంలోని బవేరియా ప్రాంతంలో ఒక ఎద్దు వివాహ ఊరేగింపులోకి దూసుకెళ్లింది, దీంతో ఆగ్రహించిన జీపు డ్రైవర్ ఆ ఎద్దును వెంబడించి జీపుతో ఢీకొట్టి చంపాడు. ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటనలో నెచ్వాకు చెందిన శివరాజ్ (26), సుజన్‌గఢ్‌కు చెందిన ప్రేమ్ చంద్ (40) సహా మరో ఇద్దరు వ్యక్తులను నిందితులుగా గుర్తించారు.
ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం నెచ్వా పోలీసులను మేము సంప్రదించగా, మాతో (Factly) నెచ్వా పోలీస్ స్టేషన్ SHO కృతిక సోనీ మాట్లాడుతూ, “ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు, నిందితులందరూ హిందువులే, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాము, మరో ఇద్దరు నిందితుల కోసం వెతుకుతున్నాము” అని చెప్పారు. అలాగే ఈ కేసుకు సంబంధించి నమోదైన FIR కాపీని మాకు షేర్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి నమోదైన FIR ప్రకారం నిందితులు ప్రేమ్ చంద్, నెచ్వాకు చెందిన శివరాజ్.
చివరగా, ఈ వైరల్ వీడియో 01 అక్టోబర్ 2025న రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో కొంతమంది వ్యక్తులు ఒక ఎద్దును జీపుతో ఢీకొట్టి చంపిన సంఘటనకు సంబంధించినది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు.