₹3,249కే టాటా కంపెనీ ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేసిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు

₹3,249కే టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేసిందని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ఈ పోస్టులో చెప్పబడింది. న్యూస్ 18 తెలుగు వెబ్సైట్ కూడా ఇవే వివరాలను ప్రస్తావిస్తూ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A black bicycle with orange wheels

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ₹3,249కి టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది.

ఫాక్ట్: ₹3,249కే ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేస్తున్నట్లు టాటా సంస్థ ఎక్కడా పేర్కొనలేదు. వైరల్ పోస్టులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడర్ 2023లో విడుదల చేసింది. దీని కనీస ధర ₹26,000 వరకు ఉంటుంది. పైగా, వివిధ పరిస్థితులను బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ సైకిల్ గరిష్టంగా 30 కిలోమీటర్ల మాత్రమే ప్రయాణిస్తుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా పోస్టులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడర్ తయారుచేసిన జీటా ప్లస్ ఎలక్ట్రిక్ సైకిల్ అని తెలిసింది. స్ట్రైడర్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, 24 ఫిబ్రవరి 2025 నాటికి దీని ధర ₹27,995 గా ఉంది. 2023లో ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేసినప్పుడు దీని ప్రారంభ ధర ₹26,995 ఉండేదని పలు వార్తా కథనాలు ద్వారా తెలిసింది. అయితే ₹3,249కే ఇదే మోడల్ లేదా కొత్త మోడల్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను విక్రయిస్తున్నట్లు స్ట్రైడర్ కానీ టాటా ఇంటర్నేషనల్ కానీ ఎక్కడా ప్రకటించలేదు.

ఈ విషయం గురించి మరింత స్పష్టత కోసం స్ట్రైడర్ కస్టమర్ కేర్‌ని సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు. అయితే, హైదరాబాద్‌లోని స్ట్రైడర్ సైకిల్ డీలర్ పృథ్వీ సైక్లింగ్ స్టూడియో వారిని సంప్రదించగా, ₹3,249కే ఎలక్ట్రిక్ సైకిల్‌ని అమ్ముతున్నారనేది తప్పుడు సమాచారం అని, ఎలక్ట్రిక్ సైకిళ్ల బ్యాటరీ ధరే కనీసం ₹10,000 ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే జీటా ప్లస్ మోడల్ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే వివిధ పరిస్థితులను బట్టి గరిష్టంగా 30 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించవచ్చని వారు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని స్ట్రైడర్ కంపెనీ వెబ్సైట్లో కూడా చూడవచ్చు.

ఇక, వైరల్ పోస్టు గురించి మరింత పరిశోధించగా, ఈ సమాచారాన్ని ముందుగా కొన్ని బ్లాగులు (ఇక్కడ & ఇక్కడ) ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రచురించినట్లు గుర్తించాం. తమ వెబ్సైట్లకు ఎక్కువ మంది యూజర్లని ఆకర్షించడం ద్వారా ఎక్కువ ప్రకటనలను ప్రదర్శించవచ్చని కొందరు ఈ రకమైన అసత్య కథనాలని ప్రచురిస్తారని వివిధ అధ్యయనాలు పేర్కొన్నాయి.

చివరిగా, ₹3,249కే టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేసిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.