ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్ష విధించిన దానికి ప్రతీకారంగా భారత్ ఖతర్‌కు చెందిన 500 మందిని అరెస్ట్ చేసిందన్న వార్త నిజం కాదు

ఇటీవల భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్‌లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఐతే దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఖతర్‌కు చెందిన 500 మందిని అరెస్ట్ చేసిందని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది (ఇక్కడ). ఖతర్‌కు చెందిన విమానాయాన సంస్థలు పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు గుర్తించి భారత్‌ ఈ అరెస్టులు చేసిందని ఈ వీడియోలో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా వీడియోలో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్‌ మరణశిక్ష విధించిన దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఖతర్‌కు చెందిన 500 మందిని అరెస్ట్ చేసింది.

ఫాక్ట్(నిజం): GST చట్టానికి విరుద్ధంగా ఈ కంపెనీలు పన్నులు ఎగవేస్తున్నాయన్న ఆరోపణలతో DGGI అక్టోబర్‌ 2023లో సౌదీ, ఖతార్ ఎయిర్‌వేస్, మొదలైన విమానాయాన సంస్థలపై సోదాలు నిర్వహించిన వార్త నిజమే అయినప్పటికి ఈ సోదాలకు సంబంధించి ఖతర్‌కు చెందిన 500 మందిని అరెస్ట్ చేసారన్న వార్తలో నిజం లేదు.  అంతకుముందు ఏప్రిల్ 2020 – సెప్టెంబర్ 2023  మధ్య కాలంలో 57,000 కోట్ల రూపాయల GST ఎగవేతలకు పాల్పడిన కేసులకు సంబంధించి 500 మంది అరెస్టు అయినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపిన విషయాన్ని ఖతార్ సంస్థలలో జరిగిన సోదాలతో ముడిపెట్టడంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కాని నిజానికి ఈ రెండు వేరువేరు వార్తలు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

గూఢచర్యానికి పాల్పడుతున్నారన్న అభియోగాలపై ప్రైవేటు భద్రతా సంస్థ అల్ దహ్రాలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారులను 2022 ఆగస్టులో ఖతర్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎనిమిది మందికి అక్కడి కోర్టు ఇటీవల మరణశిక్ష విధించింది. ఐతే ఈ కేసుకు సంబంధించి ఇటీవలే ఖతర్‌లో అప్పీలు దాఖలు చేయగా, వీరిని కలిసేందుకు భారత రాయబారికి కాన్సులర్ యాక్సెస్ లభించిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు ప్రతీకారంగానే భారత్ 500 మంది ఖతర్‌కు చెందిన వారిని అరెస్ట్ చేసిందని ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో చెప్తున్నారు.

ఐతే ఇటీవల భారత ప్రభుత్వం ఖతర్‌కు చెందిన విమానాయాన సంస్థలపై సోదాలు నిర్వహించి ఈ సంస్థలు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నారని గుర్తించిందని వార్తలు రిపోర్ట్ అయినప్పటికీ, ఈ దాడుల్లో ఖతర్‌కు చెందిన 500 మందిని అరెస్ట్ చేసిందన్న వార్తలో స్పష్టత లేదు. వార్తా కథనాల ప్రకారం అక్టోబర్‌ 2023లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI) అధికారులు ఎతిహాద్, ఎమిరేట్స్, సౌదీ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్, ఎయిర్ అరేబియా, ఒమన్ ఎయిర్ మరియు కువైట్ ఎయిర్‌వేస్‌లలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ కంపెనీలు GST చట్టానికి విరుద్ధంగా పన్నులు ఎగవేస్తున్నాయన్న ఆరోపణలతో DGGI వారు ఈ సోదాలు నిర్వహించారు. ఐతే ప్రత్యేకించి ఈ దాడుల్లో 500 మందిని అరెస్ట్ చేసినట్టు/ ఖతార్ అధికారులు సంస్థలు 57,000 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టు తెలపలేదు.

అంతకుముందు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో “ఏప్రిల్ 2020 నుండి సెప్టెంబర్ 2023 వరకు 6,000 నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) క్లెయిమ్‌ల ద్వారా 57,000 కోట్ల రూపాయల GST ఎగవేతలకు పాల్పడిన కేసులకు సంబంధించి 500 మంది అరెస్టు అయినట్టు తెలిపింది.”  ఐతే ఈ ప్రకటనలో ఖతర్‌ సంస్థలలో జరిగిన దాడికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఒకవేళ నిజంగానే ఈ 500 మంది అరెస్టుకు ఖతర్‌ సంస్థలలో దాడులకు సంబంధం ఉంటే, ఈ ప్రకటనలో ఆ విషయం స్పష్టం చేసేవారు.

అసలు ఖతర్‌ విమానాయాన సంస్థలలో జరిగిన సోదాలకు వీటికి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే ఆర్థిక శాఖ అందించిన లెక్కలు సెప్టెంబర్ 2023 వరకు కాగా, ఖతర్‌ సంస్థలలో సోదాలు అక్టోబర్‌ 2023లో జరిగాయి. ఐతే ఆర్థిక శాఖ వెల్లడించిన వివరాలను మరియు ఖతర్‌ విమానాయాన సంస్థలలో జరిగిన దాడులకు సంబంధించి వార్తలను కలిపి రిపోర్ట్ చేయడంతో రెండు ఒకే ఘటనకు సంబంధించినవని తప్పుగా అర్ధం చేసుకొని ఉంటారు (ఇక్కడ మరియు ఇక్కడ). కాని నిజానికి ఈ రెండు వేరువేరు వార్తలు.

ఇదిలా ఉంటే అంతకుముందు జులై 2023లో పార్లమెంట్‌కు ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం 2020-2023(మే) కాలంలో మొత్తం GST ఎగవేతకు సంబంధించి (నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లు మొదలైనవన్ని కలిపి) వెయ్యికి పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అంటే పైన తెలిపిన నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లకు సంబంధించిన 500 అరెస్టులు వీటిలో భాగమే అయ్యుండొచ్చు.

చివరగా, ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు మరణశిక్ష విధించిన దానికి ప్రతీకారంగా భారత్ ఖతర్‌కు చెందిన 500 మందిని అరెస్ట్ చేసిందన్న వార్త నిజం కాదు.