TMC లో 29 ఎమ్మెల్యేలు రోహింగ్యాలని తేలిందని, అందుకే ఎన్నికల కమిషన్ పార్టీని నిషేధిస్తుంది అన్న వార్తల్లో నిజం లేదు

‘పశ్చిమ బెంగాల్ 29 మంది TMC ఎమ్మెల్యేలు రోహింగ్యాలని తేలింది, ఇది నిరూపితమైతే ఎన్నికల కమిషన్ TMCని 12 సంవత్సరాల పాటు నిషేదిస్తారని’  చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: ‘పశ్చిమ బెంగాల్ 29 మంది TMC ఎమ్మెల్యేలు రోహింగ్యాలని తేలింది, ఇది నిరూపితమైతే ఎన్నికల కమిషన్ TMCని 12 సంవత్సరాల పాటు నిషేదిస్తారు’ 

ఫాక్ట్ (నిజం): ఇటీవల జరిగిన ఎన్నికల్లో TMC నుండి గెలిచన ఎమ్మెల్యేలలో 29 మంది రోహింగ్యాలని, ఈ కారణంగా TMC ఎమ్మెల్యేలను గానీ లేక మొత్తంగా TMC పార్టీని గానీ అనర్హులుగా ప్రకటించినట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని లేవు. ఇది కేవలం ఒక కల్పిత వార్త. సాధారణంగా ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని రాజ్యాంగ నియమాలకు అనుకూలంగా అనర్హుడిగా ప్రకటించినప్పుడు దాని అర్ధం ఆ పార్టీ మొత్తానికి అర్హతలేదని ప్రకటించినట్టు కాదు. ఒక పార్టీని నిషేదించే విషయం రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పినట్టు ఇటీవల జరిగిన ఎన్నికల్లో TMC పార్టీ నుండి గెలిచన ఎమ్మెల్యేలలో 29 మంది రోహింగ్యాలని ఎటువంటి వార్తా కథనాలు గాని లేక మరే ఇతర సమాచారం గాని మాకు లభించలేదు. సాధారణంగా భారత దేశంలో జరిగే ఎన్నికల్లో కేవలం భారత దేశ పౌరసత్వం ఉన్నవాళ్లు మాత్రమే పోటీ చేయాలి. భారత పౌరసత్వంతో పాటు ఇతర దేశ పౌరసత్వం ఉన్నా కూడా పోటికి అనర్హులు. పైగా ఎన్నికల్లో పోటీ చేయడానికి కులం, మతం వంటి విషయాలతో సంబంధంలేదు. రిజర్వ్ అయిన నియోజకవర్గం మినహాయిస్తే, ఇతర అసెంబ్లీ లేదా లోక్ సభ నియోజకవర్గాలలో ఎవరైనా పోటీ చేయవచ్చు. దీన్ని బట్టి, పోటీ చేసే వారు రోహింగ్యా తెగ వారు అయినా కూడా, భారత దేశ పౌరసత్వం కలిగిన ఉంటే వారు కూడా ఎన్నికల్లో చెయ్యొచ్చు. కాకపోతే ఇలా బెంగాల్ ఎనికల్లో రోహింగ్యాలు పోటీ చేసినట్టు ఎటువంటి సమాచారం గాని వార్తా కథనాలు గాని లేవు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులను ఎలాంటి సందర్భాల్లో అనర్హులుగా గుర్తిస్తారో కింద వివరంగా చూద్దాం.

ఏ ప్రాతిపదికన ప్రజా ప్రతినిధిని అనర్హునిగా ప్రకటించవచ్చు?

భారత దేశంలో ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాలను  Representation of People Act, 1950 మరియు Representation of People Act, 1951 రెండు చట్టాలలో కూలంకషంగా ప్రస్తావించారు. వీటిలో 1950లో చేసిన చట్టంలో సీట్ల కేటాయింపు, ఎన్నికలకు నియోజకవర్గాల డీలిమిటేషన్, ఓటర్ల అర్హతలు మరియు ఓటరు జాబితాల తయారీ వంటి అంశాల గురించి ప్రస్తావించగా 1951లో చేసిన చట్టంలో ఎన్నికల నిర్వహణ, చట్ట సభలకు పోటీ చేసే అభ్యర్ధులకు కావలసిన అర్హతలు, ఏ సందర్భాల్లో ప్రజా ప్రతినిధులను అనర్హులుగా ప్రకటిస్తారు, ఎన్నికలకు సంబంధించిన వివాదాలు వంటి మొదలైన పలు అంశాల గురించి ప్రస్తావించారు.

సాధారణంగా ఒక ప్రజా ప్రతినిధిని ఏ సందర్భంలో అనర్హునిగా ప్రకటించవచ్చో Representation of People Act, 1951లో పార్ట్ 2 లోని చాప్టర్ 3లో వివరించారు. ఈ చాప్టర్ పలు సెక్షన్స్ కింద ఏ సందర్భాలలో ప్రజాప్రతినిధి అనర్హుడిగా పరిగనణిస్తారో వివరించారు, ఈ సెక్షన్స్ కి సంబంధించిన వివరాలు కింద చూడొచ్చు.

1985లో చేసిన 52వ రాజ్యాంగ సవరణ ద్వారా గెలిచిన ప్రజాప్రతినిధులు ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి ఫిరాయించినపుడు ఆ సభ్యుడిని అనర్హుడిగా గుర్తించడం ఈ సవరణ యొక్క ఉద్దేశం. ఈ సవరణ కోసం రాజ్యాంగంలో కొత్తగా 10వ షెడ్యూల్ ని కలిపారు. ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన ఒక సభ్యుడు ఎలాంటి సందర్భాల్లో అనర్హుడిగా గుర్తిస్తారో కింద చూడొచ్చు.

ఐతే పైన తెలిపిన వివిధ సెక్షన్స్ కింద ఒక ప్రజా ప్రతినిధి పలు చట్టాల కింద దోషిగా తేలితే తన పదవికి అనర్హుడిగా ప్రకటించి, తిరిగి కొన్ని సంవత్సరాల వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిర్దేశించే ఆస్కారం ఉంది. ఐతే ఇలా ప్రజాప్రతినిధులను అనర్హులుగా గుర్తిస్తారే తప్ప ఒక రాజకీయ పార్టీ మొత్తాన్ని ఎన్నికలలో పోటీ చేయకుండా అనర్హత లేదని గుర్తించరు. సాధారణంగా భారతదేశంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కి సంబంధించిన వివరణ కింద చూడొచ్చు. 

రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ :

ఒక సంస్థ రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను Representation of People Act, 1951లో పార్ట్ 4A లోని సెక్షన్ 29Aలో వివరించారు. సెక్షన్ 29Aలోని సబ్ సెక్షన్ 4 కింద రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకోవలనుకునే పార్టీ, పేరు, చిరునామా, పార్టీ కి చెందిన ఇతర విభాగాల వివరాలు, ఆఫీస్ బేరర్స్ పేర్లు మొదలైన ప్రాధమిక వివరాలతో పార్టీ ఏర్పాటు చేయబోయే 30 రోజుల ముందు ఎన్నికల కమిషన్ కి దరఖాస్తు చేసుకోవాలి.  Representation of People Act, 1951 పార్ట్ 4A, సెక్షన్ 29A, సబ్ సెక్షన్ 6 కేంద్ర ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కి అదనపు సూచనలు చేసే అధికారానిచ్చింది. ఈ అధికారం కింద ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ కి సంబంధించి కొత్త నియమాలను సూచిస్తూ వస్తుంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్యాంగం ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఎటువంటి అధికారం ఇవ్వలేదు. ఐతే ఒక రాజకీయ పార్టీని రిజిస్టర్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ మూడు సందర్భాలలో పునఃసమీక్షించు కోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఐతే ఒక పార్టీ రిజిస్ట్రేషన్ ఉపసంహరణకి సంబంధించి పైన తెలిపిన విషయాల ఆధారంగా TMC పార్టీకి అనర్హతలేదని ప్రకటించినట్టు గాని లేదా ప్రజాప్రతినిధుల అనర్హతకి సంబంధించి వివరాల ఆధారంగా TMC పార్టీ ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు, కాబట్టి పోస్టులో చెప్తున్న విషయం కేవలం కల్పితం మాత్రమేనని అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, TMC లో 29 ఎమ్మెల్యేలు రోహింగ్యాలని తేలిందని అందుకే ఎన్నికల కమిషన్ పార్టీని నిషేదించిందన్న వార్తల్లో నిజం లేదు.