09 జూలై 2025న, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి ముందు జరిగిన హత్యను భారతదేశానికి ముడిపెడుతూ తప్పుడు వాదనలతో షేర్ చేస్తున్నారు

కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తిని రోడ్డుపై పడేసి, రాళ్లతో దారుణంగా దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియోను “ఉత్తరప్రదేశ్ లో RSS & BJP ఉన్మాదులు ఒక దళితుడిని ఎంత భయంకరంగా బండ రాయితో ఎలా కొట్టి చంపుతున్నారో చూడండి” అంటూ విస్తృతంగా షేర్ చేస్తున్నారు (ఇక్కడ, & ఇక్కడ). ఇదే వీడియోను “ముస్లింల (మెజార్టీ) జనాభా ఎక్కువగా ఉన్నచోట హిందువుల పరిస్థితి” అంటూ కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
(గమనిక: ఈ వీడియోలో కలవరపరిచే దృశ్యాలు ఉన్నాయి)

క్లెయిమ్: ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో ఒక దళితుడిపై RSS, BJP కార్యకర్తలు చేసిన దాడిని చూపిస్తుంది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదు, అలాగే ఈ సంఘటనలో మృతి చెందిన లాల్ చంద్ అలియాస్ సోహాగ్ హిందువు కాదు. ఈ వైరల్ వీడియో, 09 జూలై 2025న, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సర్ సలీముల్లా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి) గేట్ నంబర్ 3 ముందు రోడ్డుపై లాల్ చంద్ అలియాస్ సోహాగ్ (39) అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో కొట్టి చంపిన దృశ్యాలను చూపిస్తుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం, లాల్ చంద్ అలియాస్ సోహాగ్ ముస్లిం అని, అతని తలిదండ్రుల పేర్లు ఎండీ అయ్యుబ్ అలీ, అలియా బేగం అని స్పష్టం చేసింది. లాల్ చంద్ సోదరి మంజురా బేగం ఫిర్యాదు మేరకు ఢాకా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై కేసు నమోదైందని పలు బంగ్లాదేశ్ వార్తా కథనాలు రిపోర్ట్ చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు యూట్యూబ్‌లో ప్రసారం చేసిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వైరల్ వీడియో, 09 జూలై 2025న, ఢాకాలోని సర్ సలీముల్లా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి) గేట్ నంబర్ 3 ముందు రోడ్డుపై లాల్ చంద్ అలియాస్ సోహాగ్ (39) అనే వ్యక్తిని కొంతమంది వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో కొట్టి చంపిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది.

దీని ఆధారంగా ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనను రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు ప్రచురించిన వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 09 జూలై 2025న, మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి ముందు రద్దీగా ఉండే వీధిలో పట్టపగలు ఈ దారుణ హత్య జరిగింది. జుబో దళ్, ఛత్ర దళ్, స్వేచ్ఛసేబక్ దళ్ సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హత్యకు కారణం ఆర్ధిక వివాదాలని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు, స్థానికలు పేర్కొన్నారు. లాల్ చంద్ ఒకప్పుడు జుబో దళ్‌తో అనుబంధం కలిగి ఉన్నాడని పోలీసు వర్గాలు నిర్ధారించాయి ఈ కథనాలు పేర్కొన్నాయి. లాల్ చంద్ సోదరి మంజురా బేగం ఫిర్యాదు మేరకు ఢాకా కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు, రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (RAB) నలుగురు అనుమానితులను అరెస్టు చేశారని, మిగిలిన వారిని పట్టుకోవడానికి ఆపరేషన్లు కొనసాగుతున్నాయని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-చార్జ్ (OC) Md మోనిరుజ్జామన్ చెప్పారు.

11 జూలై 2025న, ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (DMP) నిర్వహించిన పత్రికా సమావేశంలో, ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు, మహముదుల్, తారిఖ్‌లను అరెస్టు చేశారని, అలాగే తారిఖ్ నుండి ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు.

పలు భారతీయ మీడియా సంస్థలు మరణించిన వ్యక్తి లాల్ చంద్ అలియాస్ సోహాగ్ హిందూ అని తప్పుగా పేర్కొన్నాయని బంగ్లాదేశ్ ప్రభుత్వ (ముఖ్య సలహాదారు) ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. లాల్ చంద్ అలియాస్ సోహాగ్ ముస్లిం అని, అతని తలిదండ్రుల పేర్లు ఎండీ అయ్యుబ్ అలీ, అలియా బేగం అని బంగ్లాదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది (ఆర్కైవ్డ్). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించినది కాదని, అలాగే మృతుడు లాల్ చంద్ అలియాస్ సోహాగ్ హిందువు కాదని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఈ వైరల్ వీడియో 09 జూలై 2025న, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మిట్‌ఫోర్డ్ ఆసుపత్రి ముందు అనే ముస్లిం వ్యక్తిని కొంతమంది వ్యక్తులు హత్య చేయడాన్ని చూపిస్తుంది.