22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న TRF తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, భారత సైన్యంలో పనిచేసే అనే ఒక సీనియర్ అధికారి అని చెప్పబడుతున్న ఒక వ్యక్తి వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. తన పేరు అశోక్ కుమార్ అని, తాను భారత సైన్యంలో సీనియర్ అధికారి అని, పహల్గాం ఉగ్రదాడి ఎవరో ఉగ్రవాదులు చేసినట్లుగా లేదని, ఇది రాజకీయ లబ్ధి కోసం చేసినట్లుగా కనిపిస్తుందని ఈ వీడియోలో అతను చెప్పడం చూడవచ్చు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పహల్గాం ఉగ్రదాడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న భారతీయ సీనియర్ సైనికాధికారి అశోక్ కుమార్.
ఫాక్ట్: వైరల్ వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన మాలిక్ కాంజి. ఇతను ఒక డ్రామా ఆర్టిస్ట్, హోమియోపతి డాక్టర్. భారత ఆర్మీకి చెందినవాడు కాదని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్న ఎటువంటి విశ్వసనీయ జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాలు మాకు లభించలేదు.
ఇక వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వీడియో ముందుగా ‘@War_Analysts’ అనే పాకిస్తానీ ట్విట్టర్ హ్యాండిల్లో 24 ఏప్రిల్ 2025న (ఆర్కైవ్) అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. అయితే, ఈ వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన మాలిక్ కాంజి అని కొందరు గుర్తించారు. దీని ఆధారంగా ఇంటర్నెట్, వివిధ సోషల్ మీడియాలలో అతని వివరాల గురించి వెతకగా, వైరల్ వీడియోలోని వ్యక్తి యొక్క లింక్డిన్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్(ట్విట్టర్) ఖాతాలు మాకు లభించాయి. ఈ ఖాతాలు అన్నీ మాలిక్ కాంజి అనే పేరుతో ఉండడమే గాక, వాటి ప్రొఫైల్ ఫోటోల్లో కూడా వైరల్ వీడియోలోని వ్యక్తి (మాలిక్ కాంజి) యొక్క ఫోటోలను చూడవచ్చు.
ఇక లింక్డిన్ లో ఇచ్చిన వివరాల ప్రకారం, మాలిక్ కంజి పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, సీనియర్ హెచ్ ఆర్ ప్రొఫెషనల్, హోమియోపతి, రేకి డాక్టర్, డ్రామా ఆర్టిస్ట్ అని ఉంది.
ఇక, ఈ వివరాలను ఉపయోగించి గూగుల్ అడావెన్స్డ్ సెర్చ్ ద్వారా వెతకగా, మాలిక్ కంజి యొక్క రెస్యూమే (బయోడేటా) మాకు లభించింది. అతని స్వస్థలం పాకిస్తాన్లోని కరాచీ అని ఇందులో పేర్కొనబడింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఇచ్చే వివిధ ఐడెంటిటీ కార్డుల నంబర్లు ఇందులో ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ సైనిక అధికారులతో మాలిక్ కాంజికి సంబంధాలు ఉన్నట్లుగా ఇందులో చూడవచ్చు.
అలాగే, ఈ బయోడేటాలో ఉన్న ఫోన్ నంబర్ పాకిస్తాన్‌కు చెందినదిగా చూడవచ్చు. ఈ నంబర్ తో ఉన్న వాట్సాప్ అకౌంట్ యొక్క కవర్ ఫోటోలో కూడా మాలిక్ కాంజి ఉండడం చూడవచ్చు. ఈ వీడియో గురించి విశ్వాస్ న్యూస్ భారత ఆర్మీ పీఆర్వోని సంప్రదించగా వీడియోలోని వ్యక్తి భారత ఆర్మీకి చెందినవాడు కాదని, వీడియో పాకిస్తాన్ నుంచి వచ్చిందని తెలిపారు. పై ఆధారాలను బట్టి వైరల్ వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన వాడని నిర్ధారించవచ్చు.
చివరిగా, వైరల్ వీడియోలోని వ్యక్తి భారతీయ సైనికుడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.