ఈ వీడియోలో మహిళల పై దాడి చేస్తున్న వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే కాదు; ఘటన ఉత్తరప్రదేశ్ లో జరగలేదు

YouTube Poster

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఘాతుకం. తల్లి, బిడ్డను కోరిక తీర్చమని బెదిరించి, అఘాయిత్యానికి పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యే’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ లో మహిళల పై అఘాయిత్యానికి పాల్పడుతున్న బీజేపీ ఎమ్మెల్యే వీడియో.

ఫాక్ట్: వీడియోలో మహిళల పై దాడి చేస్తున్న వ్యక్తి పేరు అశోక్ గోయల్. అతను బీజేపీ ఎమ్మెల్యే కాదు. వీడియోలోని వ్యక్తి అతను ఒక బీజేపీ నేత అని చెప్పుకుంటాడు అని మాత్రం కొన్ని వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. అంతేకాదు, వీడియోలోని ఘటన జరిగింది హర్యానా లో; ఉత్తరప్రదేశ్ లో కాదు. కావున, ‘ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఎమ్మెల్యే ఘాతుకం’, అని పోస్ట్ లో చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని వీడియోపై ‘City NEWS 100’ అనే లోగో ఉన్నట్టు చూడవొచ్చు. ఆ పేరుతో వెతకగా, ‘City NEWS 100’ అనే ఫేస్బుక్ పేజీ దొరికింది. పోస్ట్ లోని వీడియోని ‘City NEWS 100’ వారు 13 మార్చి 2021 న పెట్టిన వీడియో నుండి తీసుకున్నట్టు తెలిసింది. ‘City NEWS 100’ వారు పెట్టిన వీడియోలో ఇరుపక్షాల వాదన వినొచ్చు. అయితే, వీడియోలోని ఘటన హర్యానా లోని ఫరీదాబాద్ లో జరిగిందని, వీడియోలో మహిళల పై దాడి చేస్తున్న వ్యక్తి పేరు అశోక్ గోయల్ అని తెలిసింది. అశోక్ గోయల్ పై POCSO చట్టం కింద లైంగిక వేధింపుల కేసు నమోదైందని చెప్తూ, ఆ కేసు సంబంధించిన FIR కాపీని తో ‘City NEWS 100’ వారు పెట్టిన పోస్ట్ ని ఇక్కడ చూడవొచ్చు.

‘అశోక్ గోయల్’ అనే పేరుతో ప్రస్తుత హర్యానా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఎవరూ లేరు. అయితే, వీడియోలోని వ్యక్తి అతను ఒక బీజేపీ నేత అని చెప్పుకుంటాడు అని మాత్రం కొన్ని వార్తాసంస్థలు రిపోర్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఈ వీడియోలో మహిళల పై దాడి చేస్తున్న వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే కాదు. వీడియోలోని ఘటన జరిగింది హర్యానా లో; ఉత్తరప్రదేశ్ లో కాదు.