వీడియోలో బల్బు వెలిగింది కరోనా టీకా వల్ల కాదు, అది ఒక రీఛార్జిబుల్/ఇన్వర్టర్ బల్బు

YouTube Poster

‘కరోనా టీకా వేసుకున్నాక ఒంట్లో కరెంట్; టీకా వేసుకున్న దగ్గర బల్బు పెడితే ఫుల్ లైట్’, అని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కరోనా టీకా వేసుకున్న దగ్గర బల్బు పెడితే ఫుల్ లైట్ వస్తున్న వీడియో.

ఫాక్ట్:  వీడియోలో లైట్ వచ్చింది కరోనా టీకా వల్ల కాదని, తను ఒక రీఛార్జిబుల్/ఇన్వర్టర్ బుల్బ్ తో కేవలం సరదాకి ఆ వీడియో చేసినట్టు వీడియోలోని వ్యక్తి ‘Dighvijay News’ వారితో తెలిపాడు. కరోనా టీకా వల్ల అలాంటివి ఏమీ జరగవని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా వివరణ ఇచ్చారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో పై ‘న్యూస్18 – తెలుగు’ లోగో ఉన్నట్టు చూడవొచ్చు. వీడియో గురించి వారి ఫేస్బుక్ ప్రొఫైల్ లో వెతకగా, ఆ వీడియోని వారు నిజంగానే పోస్ట్ చేసినట్టు తెలిసింది. ముందు కేవలం – ‘అవును ఇది నిజం. కర్నాటకలోని హుబ్లీలో ఈ వింత జరిగింది’ అని వివరణలో రాసి పోస్ట్ చేసారు. అయితే, తర్వాత అందరు అది ఫేక్ న్యూస్ అని కామెంట్ చేయడంతో, వివరణలో – ‘ఐతే ఇది నిజం కాదని.. ఏదో మ్యాజిక్ ఉందని మరికొందరు కొట్టిపారేస్తున్నారు’, అని జోడించారు.

వీడియోకి సంబంధించిన ఇతర వివరాల కోసం వెతకగా, ‘Dighvijay News’ వారి ఒక వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. పోస్ట్ లోని వీడియోలో ఉన్న వ్యక్తి ‘Dighvijay News’ వారితో మాట్లాడుతూ, ఆ వీడియో అతను సరదాగా రీఛార్జిబుల్/ఇన్వర్టర్ బల్బు తో చేసాడని, శరీరం పై తేమ వల్ల బల్బు ఆన్ అయిందని, లైట్ వచ్చింది కరోనా టీకా వల్ల కాదని వివరణ ఇచ్చాడు. ధార్వాడ్ డీహెచ్ఓ కూడా ఇదే విషయం ‘ప్రజావాణి’ వార్తాసంస్థ తో మాట్లాడుతూ తెలిపాడు.

అంతేకాదు, ఇలాంటి వీడియోనే ఒకటి మే నెలలో వైరల్ అవ్వగా, అది ఒక ఫేక్ న్యూస్ అని, కరోనా టీకా వల్ల అలాంటివి ఏమీ జరగవని ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా వివరణ ఇచ్చారు. 2018 లో ఇలాంటి మరో వార్తా పై స్పందిస్తూ, శరీరం పై పెట్టినప్పుడు రీఛార్జిబుల్ బల్బు ఎందుకు ఆన్ అవుతుందో నిపుణులు చెప్పిన కారణం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, వీడియోలో బల్బు వెలిగింది కరోనా టీకా వల్ల కాదు. అది ఒక రీఛార్జిబుల్/ఇన్వర్టర్ బల్బు.