ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ‘రాగస’ అనే తుఫాన్ 25 సెప్టెంబర్ 2025న రాబోతుందని, దీని వల్ల గంటకి 450 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో ఎప్పుడూ చూడని విధంగా భారీ వర్షాలను కురుస్తాయని, అందువలన రెండు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రైతులు అలెర్ట్‌గా ఉండాలని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ‘రాగస’ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోకి ప్రవేశించడం కారణంగా 2025 సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో గంటకు 450 కి.మీ గాలులతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.
ఫాక్ట్: రాగస తుఫాను భారత్‌లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ తుఫాను 2025 సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్యలో ఫిలిప్పీన్స్, చైనాలలో తీరం దాటిన తర్వాత బలహీనపడింది. అయితే, బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో 50-60 కి.మీ. వేగమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, రాగస తుఫాన్ గురించి ఇంటర్నెట్లో వెతకగా, దీనికి సంబంధించిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), వాతావరణ రిపోర్టులు (ఇక్కడ & ఇక్కడ) లభించాయి. వీటి ప్రకారం, రాగస తుఫాన్ పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో 19 సెప్టెంబర్ 2025లో ఏర్పడింది. సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్యలో ఫిలిప్పీన్స్, చైనాలలో ఈ తుఫాను తీరం దాటిన తర్వాత బలహీనపడింది.
ఈ తుఫాన్ ప్రభావం ఫిలిప్పీన్స్, తైవాన్, హాంకాంగ్, చైనా, వియత్నాం వంటి దేశాలపై పడింది. ఈ తుఫాను వల్ల గరిష్ఠంగా గంటకు 270 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ తుఫాను వల్ల కురిసిన వర్షాలు, వరదల కారణంగా పైన పేర్కొన్న దేశాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.
అయితే, ఈ తుఫాను భారత్‌లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎటువంటి తుఫాను హెచ్చరిక జారీ చేయలేదు. కానీ, సెప్టెంబర్ 25, 26 తేదీల్లో ఐఎండీ విడుదల చేసిన మీడియా ప్రకటనల్లో(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) , బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది క్రమంగా 27 సెప్టెంబర్ 2025 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో, సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో తీరప్రాంతంలో మత్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది. ఈ సమయంలో గంటకు 50- 60 కి. మీ. వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ ఆర్టికల్ పబ్లిష్ చేసే సమయానికి ఐఎండీ ఎటువంటి తుఫాను హెచ్చరిక జారీ చేయలేదు.
చివరిగా, రాగస తుఫాను భారత్‌లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.