భారత ప్రభుత్వం “2025 సీనియర్ స్కీం అప్డేట్” అనే పేరుతో ఎటువంటి సమగ్ర పథకాన్ని ఆమోదించలేదు

“భారత ప్రభుత్వం 21 నవంబర్ 2025న ప్రకటించిన ‘2025 సీనియర్ స్కీం అప్డేట్’ వృద్ధులకు మరింత ఆర్థిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ లిటరసీ, ప్రయాణ సబ్‌సిడీలు, నివాస భద్రత, హెల్ప్‌లైన్ సేవలు అందించడానికి రూపొందించిన సమగ్ర పథకం” అంటూ పలు ఉప స్కీములను ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. 

ఆర్కైవ్ చేయబడ్డ పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ప్రభుత్వం 21 నవంబర్ 2025న ప్రకటించిన “2025 సీనియర్ స్కీం అప్డేట్” వృద్ధులకు మరింత ఆర్థిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ లిటరసీ, ప్రయాణ సబ్‌సిడీలు, నివాస భద్రత, హెల్ప్‌లైన్ సేవలు అందించడానికి రూపొందించిన సమగ్ర పథకం. 

ఫాక్ట్ (నిజం): “2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్” అనే ఒకే స్కీం కింద ఈ ప్రయోజనాలన్నింటినీ అందించే అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సమగ్ర పథకం ఏదీ లేదు. ఏ మంత్రిత్వ శాఖ కూడా అలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. పోస్ట్‌లో పేర్కొన్న కొన్ని స్కీములు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి 21 నవంబర్ 2025 ముందు నుండే అందుబాటులో ఉన్న పథకాలు. డిజిటల్ గ్రాంట్లు, ప్రయాణ తగ్గింపులు, వృద్ధులకు గృహ ప్రాధాన్యత, CCTV/పానిక్ బటన్ సబ్సిడీ మొదలైన పథకాలు అందుబాటులో లేవు. కాబట్టి ఈ పోస్టు తప్పుదోవ పట్టిస్తుంది.

ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్న పథకం గురించి తెలుసుకోవడానికి కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే, ఇటువంటి సమగ్ర పథకం ఉందని చప్పటానికి ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు. తదుపరి, ఈ పోస్టులో సెక్షన్ 4లో ఇచ్చిన లింక్ నేషనల్ పోర్టల్ ఆఫ్ ఇండియా వెబ్సైటుకు దారి తీసింది. ఈ వెబ్సైటులో కూడా ఎటువంటి స్కీమ్ ఒకటి మాకు లభించలేదు. సెక్షన్ 3లో ఇచ్చిన వివిధ సబ్ స్కీములను ఇప్పుడు పరిశీలిద్దాం.

నెలసరి పెన్షన్ పెంపు

ప్రభుత్వం ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (Indira Gandhi National Old Age Pension Scheme) కింద 65+ వయసు గల వారికి అదనంగా నెలకు ₹1,000లు, 70+ వయసు గల వారికి నెలకు ₹1,500 అందిస్తుందని పోస్టులో షేర్ చెయ్యబడింది.

కానీ, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం (NSAP) వృద్ధాప్య పెన్షన్ పథకం కింద కేంద్రం, 60 నుండి 79 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారునికి నెలకు ₹ 200/-, 80 సంవత్సరాలు పైబడిన లబ్ధిదారునికి నెలకు ₹ 500/- అందిస్తుంది. ఈ పథకం ప్రకారం, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయానికి టాప్-అప్ మొత్తాన్ని అదనంగా అందించవచ్చు.

ఉచిత ఆరోగ్య బీమా

కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆరోగ్య బీమా కింద 70 ఏళ్లు దాటిన వారికి అయుష్మాన్ భారత్ పథకం కింద ₹5 లక్షల వార్షిక కవరేజ్ అందిస్తుంది అని పోస్టులో పేర్కొన్నారు.

కానీ, సెప్టెంబర్ 2024లోనే కేంద్ర మంత్రివర్గం ఆయుష్మాన్ భారత్ PM-JAY ఆరోగ్య పథకం యొక్క ప్రధాన విస్తరణను ఆమోదించింది. దీని ప్రకారం ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ₹5 లక్షల వరకు కొత్త “వే వందన కార్డ్”తో వార్షిక ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. ఇది ఇప్పటికే PM-JAYలో ఉన్నవారికి అదనపు ₹5 లక్షల టాప్-అప్ నిధులను అందిస్తుంది మరియు ఇతర సీనియర్లకు కుటుంబ ప్రాతిపదికన ₹5 లక్షలు అందిస్తుంది.

 హోమ్-బేస్డ్ హెల్త్ కేర్

“సేవామిత్ర సేవ” ద్వారా డోర్-స్టెప్ డాక్టర్ సందర్శనలు, డయాగ్నస్టిక్స్, మెడిసిన్ డెలివరీ కేంద్రం అందిస్తుంది అని పోస్టులో షేర్ చెయ్యబడింది. కానీ, పోస్ట్‌లలో పేర్కొన్నట్లుగా గృహ ఆరోగ్య సంరక్షణ లేదా వృద్ధుల ఇంటి వద్దకే సేవల అందించే “సేవామిత్ర సేవ” అనే జాతీయ ప్రభుత్వ కార్యక్రమం ఏదీ అందుబాటులో లేదు (ఇక్కడ).

డిజిటల్ లిటరసీ గ్రాంట్

ఈ పోస్టు ప్రకారం సీనియర్ సిటిజన్లకు స్మార్ట్‌ఫోన్ కోసం ₹3,000,  ఇంటర్నెట్ కోసం నెలకు ₹500 కేంద్రం అందిస్తుంది. డిజిటల్ అక్షరాస్యత కోసం సీనియర్ సిటిజన్లకు నేరుగా “నగదు గ్రాంట్” అందించే ప్రభుత్వ పథకం అందుబాటులో ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు (ఇక్కడ, ఇక్కడ).

వృద్ధులకు ట్రావెల్ కార్డ్  

వృద్ధులకు ప్రభుత్వం రైల్వే లేదా RTC బస్సుల్లో 50% డిస్కౌంట్  అందిస్తుంది అని, అంతే కాకుండా 70 ఏళ్లు పైబడిన వారికి ఫస్ట్ క్లాస్/AC టికెట్లపై కూడా డిస్కౌంట్ అందిస్తుంది అని పోస్టులో షేర్ చెయ్యబడింది.

ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు “కొత్త ట్రావెల్ కార్డ్” అందిస్తున్నట్టుగానీ సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% రాయితీ అందిస్తున్నట్టు గానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రస్తావించలేదు. భారత ప్రభుత్వం లేదా సంబంధిత మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ఎటువంటి ప్రకటనలు చేయలేదు. 

ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అధీనంలో నడిచే కొన్ని రకాల బస్సులలో  సీనియర్ సిటిజన్లకు ఛార్జీలపై 25% రాయితీని అందిస్తున్నాయి. ఇటీవల, ఒడిశా ప్రభుత్వం ముఖ్యమంత్రి బస్ సేవ (MBS) అనే పథకాన్ని ఆమోదించింది, ఈ పథకం సీనియర్ సిటిజన్లకు AC, నాన్-AC బస్సులలో ఛార్జీలపై 50% రాయితీని అందిస్తుంది.ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ బస్సులలో సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న రాయితీలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఫ్యాక్ట్లీ ఇదివరకు సీనియర్ సిటిజన్ల రవాణా సదుపాయాల గురించి వివరించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ప్రాధాన్యత హౌసింగ్  

PMAY (Urban/Gramin) హౌసింగ్‌ స్కీం కింద వృద్ధులకు రిజర్వేషన్, ఇల్లు లేని వృద్ధులకు ప్రత్యేక కేటగిరీ కల్పిస్తుంది అని పోస్టు పేర్కొంది.

PMAY అర్బన్ (PMAY-U)  ప్రత్యేక నిబంధనల ద్వారా సీనియర్ సిటిజన్లుతో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు,ట్రాన్స్‌జెండర్లు, SC/ST/OBC వర్గాలు, మైనారిటీలు మొదలైన వారికి ప్రాధాన్యత ఇస్తుంది. 

గ్రామసభలచే ధృవీకరించబడిన SECC 2011 డేటా ఆధారంగా అత్యంత దుర్బలమైన గ్రామీణ కుటుంబాలకు PMAY గ్రామీణ్ (PMAY-G) ప్రాధాన్యత ఇస్తుందని మార్చ్ 2025లో కేంద్రం ప్రకటించింది. కానీ ఈ రెండు పథకాలు వృద్ధులకు ప్రత్యేక “రిజర్వేషన్ కోటా” కల్పించదు.

లీగల్, పెన్షన్ హెల్ప్‌లైన్ నంబర్

చట్టపరమైన, పెన్షన్ సంబంధిత ఫిర్యాదుల కోసం 24*7 హెల్ప్‌లైన్ నంబర్ ఈ సమగ్ర స్కీం కల్పిస్తుందని పోస్టులో షేర్ చెయ్యబడింది.

కేంద్రం సీనియర్ సిటిజన్ల కోసం ఎల్డర్ లైన్ అనే ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ – 14567ను అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా 2021లో ఆరంభించింది. ఇది సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడానికి, అవసరమైన సమాచారం అందించే ఒకే వేదిక.

భద్రత & సర్వైలెన్స్ సపోర్ట్ 

ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు CCTV, ₹5,000 పానిక్ బటన్ సబ్సిడీని కేంద్రం ఈ యూనిఫైడ్ స్కీం ద్వారా అందిస్తుందని షేర్ చెయ్యబడింది. CCTV లేదా పానిక్ బటన్లను వ్యవస్థాపించడానికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులకు ₹5,000 సబ్సిడీ ఇచ్చే ఎటువంటి స్కీం అందుబాటులో లేదు. 

చివరిగా, భారత ప్రభుత్వం “2025 సీనియర్ స్కీం అప్డేట్” అనే పేరుతో  ఎటువంటి సమగ్ర పథకాన్ని ఆమోదించలేదు.