కాంగ్రెస్ నేత, లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రేక్షకులు పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారంటూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభలో పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తున్నప్పటి దృశ్యాలు.
ఫాక్ట్: ఈ వీడియోలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్నప్పుడు ప్రదర్శించిన జెండాలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ యొక్క విద్యార్థి విభాగమైన ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్‌కి సంబంధించినవి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని వివిధ మీడియా సంస్థలు 24 మార్చి 2025న ప్రసారం (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) చేసినట్లు గుర్తించాం. జాతీయ విద్యా విధానం (NEP) 2020, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ముసాయిదా నియమాలు, ఇటీవలి పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా INDI కూటమి పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టాయి. వైరల్ వీడియో ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని చూపుతుంది.
ఈ కార్యక్రమం యొక్క పూర్తి వీడియోని పరిశీలించగా, ఇందులో ప్రదర్శించిన ఇస్లామిక్ తరహా జెండాలు పాకిస్తాన్ జాతీయ జెండాకి భిన్నంగా ఉండడం గమనించాం. ఈ జెండాలపై ‘msf’ అని రాసి ఉండడం గుర్తించాం. దీని గురించి వెతకగా, ‘msf’ అంటే ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ అని తెలిసింది. ఈ సంస్థ INDI కూటమిలో భాగమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) యొక్క విదార్థి విభాగంగా పని చేస్తుంది. ఈ కార్యక్రమంలో ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ కూడా పాల్గొన్నట్లు వార్త కథనాలు పేర్కొన్నాయి. msf జెండాకి, పాకిస్తాన్ జాతీయ జెండాకి ఉన్న తేడాని కింద చూడవచ్చు.
అలాగే, ఈ కార్యక్రమంలో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ జెండాలను ప్రదర్శించడాన్ని చూపుతున్న వేరే వీడియోలు, ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సభలో పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.