వీడియోలో కనిపిస్తున్న పత్రం అయోధ్య మందిరం కోసం నిర్వహించిన తవ్వకాల్లో బయటపడలేదు

శ్రీ రాముడు అయోధ్యలోనే పుట్టాడనే ఆధారం దొరికింది. అది కూడా రామ మందిరం కట్టడానికి తీసిన తవ్వకాల్లో బయటపడింది”, అని ఉన్న పోస్ట్‌లో నిజమెంతుందో కనుక్కోమని FACTLY వాట్సాప్ టిప్‌లైన్‌కి (‘+91 92470 52470’) కొందరు ఒక వీడియోని పంపించారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో సెప్టెంబర్ 2020 నుండే షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: రాముడు అయోధ్యలోనే పుట్టాడనే దానికి ఆధారంగా మందిరం తవ్వకాల్లో బయటపడిన పత్రం. దానికి సంబంధించిన వీడియో.

ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్న పత్రం అయోధ్య మందిరం కోసం నిర్వహించిన తవ్వకాల్లో బయటపడలేదు. అలాంటి పత్రం ఒకటి అయోధ్య మందిరం తవ్వకాల్లో దొరికినట్టుగా ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారంలేదు.‘Shri Ram Janmbhoomi Teerth Kshetra’ వారు కూడా వీడియోలోని పత్రం తవ్వకాల్లో బయటపడలేదని తెలిపారు. పత్రంపై ఉన్న చిహ్నాలు, యూదులకు సంబంధించిన చిహ్నాలతో పోలి ఉన్నట్టు తెలిసింది. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని పత్రం గురించి వెతకగా, అలాంటి పత్రం ఒకటి అయోధ్య మందిరం తవ్వకాల్లో దొరికినట్టుగా ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారంలేదు. ఒకవేళ నిజంగానే అలాంటిది ఏదైనా దొరుకుతే, అన్నీ మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, ఎవరు కూడా వీడియోలోని పత్రం గురించి రాయలేదు. తవ్వకాల్లో బయటపడిన వస్తువులకు సంబంధించి గత సంవత్సరం ‘Shri Ram Janmbhoomi Teerth Kshetra’ వారు చేసిన ట్వీట్లను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. వాటిలో ఎక్కడా కూడా వీడియోలోని పత్రం గురించి ఇవ్వలేదు.

అంతేకాదు, వీడియోలోని పత్రం గురించి ‘Shri Ram Janmbhoomi Teerth Kshetra’ వారిని ‘Fact Crescendo’ సంస్థ వారు సంప్రదించగా, అసలు అలాంటి పత్రం తవ్వకాల్లో బయటపడలేదని వారు తెలిపినట్టు తెలిసింది.

వీడియోలో కనిపిస్తున్నది ఏంటి?

వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియో కనీసం జనవరి 2020 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. ఎక్కడా కూడా వీడియోలోని పత్రానికి సంబంధించి కచ్చితమైన సమాచారం లభించలేదు. జనవరి 2020లో వీడియోని పోస్ట్ చేసిన ‘define.avcilari’ అనే ఇన్‌స్టాగ్రాం పేజీ అలాంటి చాలా వీడియోలను పోస్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. ఎక్కడా కూడా ఆ వీడియోలు అయోధ్యకి సంబంధించినట్టు రాయలేదు.

అయితే, వీడియోలోని పత్రంలో ఉన్న బాష ‘హీబ్రూ’ అని, కనిపిస్తున్న చిహ్నాలు యూదులకు సంబంధించినవని కొందరు రాసినట్టు ఇక్కడ చదవొచ్చు. పత్రంపై ఉన్న చిహ్నాలు, యూదులకు సంబంధించిన చిహ్నాలతో పోలి ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, వీడియోలో కనిపిస్తున్న పత్రం అయోధ్య మందిరం కోసం నిర్వహించిన తవ్వకాల్లో బయటపడలేదు. దానికీ, అయోధ్యలోని రామ మందిరానికి ఎటువంటి సంబంధంలేదు.