29 ఏళ్ల నమీబియా యువకుడు ప్రపంచంలోనే మొదటి సిమ్ లేని ఫోన్‌ని తయారు చేశాడని చెప్తూ ఒక పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ ఫోన్‌కి నెట్‌వర్క్, డేటా, వైఫై, బ్లూటూత్ ఏదీ అవసరం లేదని, ఇది రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీతో మరో ఫోన్‌కి కనెక్ట్ అవుతుందని, అందువలన కాల్ ఛార్జీలు ఉండవని ఈ పోస్టులో పేర్కొనబడింది. ఈ పోస్టులో ఎంత నిజముందో నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఉచితంగా కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యం ఉన్న సిమ్ లేని ఫోన్‌ని ప్రపంచంలోనే మొదటిగా ఒక నమీబియా యువకుడు తయారు చేశాడు.
ఫాక్ట్: 2016లో నమీబియాకి చెందిన సైమన్ పెట్రస్ అనే విద్యార్థి రేడియో తరంగాలను ఉపయోగించి కొద్ది దూరం వరకు కాల్స్ చేయలిగే పరికరాన్ని తయారు చేశాడు. అయితే, మే 2025 నాటికి ఈ పరికరానికి సాంకేతిక, చట్టపరమైన కారణాల వల్ల పేటెంట్ రాక ఉత్పత్తి జరగలేదు. పైగా, రేడియో తరంగాలను ఉపయోగించి మాట్లాడుకునే వాకీ-టాకీ వంటి పరికరాలు ఎప్పట్నుంచో అందుబాటులో ఉన్నాయి. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా వైరల్ పోస్టులో యువకుడి ఫోటోకి సంబంధించి 2016లో ఆఫ్రికా మీడియా సంస్థలు ప్రచురించిన పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) లభించాయి.
వీటి ప్రకారం, 2016లో నమీబియాకి చెందిన సైమన్ పెట్రూస్ అనే పన్నెండవ తరగతి విద్యార్థి సిమ్ లేకుండా ఉచితంగా కాల్స్ చేయగలిగే ఫోన్ వంటి పరికరాన్ని తయారు చేశాడు. టెలిఫోన్, టీవీ, రేడియో విడి భాగాలను ఈ పరికరంలో ఉపయోగించడం జరిగింది. ఈ పరికరం ద్వారా కొంతదూరం వరకు కాల్స్ చేసుకోవడంతో పాటు ఒక స్థానిక టీవీ ఛానల్‌ని కూడా చూడవచ్చు. అయితే, 2023లో సైమన్ స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం, సాంకేతికపరమైన, చట్టపరమైన కారణంతో తాను తయారుచేసిన పరికరానికి పేటెంట్ హక్కులు రాలేదని సైమన్ పేర్కొన్నాడు.
అలాగే, ఈ పరికరం అభివృద్ధికి, ఉత్పత్తికి ఎటువంటి మే 2025 నాటికి ఎటువంటి సంస్థ రాలేదని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, రేడియో తరంగాలను ఉపయోగించుకొని సిమ్ లేకుండా పని చేసే పరికరాలను 1940ల కంటే ముందు నుంచే ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు వాకీ-టాకీలు (హాఫ్ డూప్లెక్స్ & ఫుల్ డూప్లెక్స్), హామ్ రేడియోలు, ఎయిర్ క్రాఫ్ట్ రేడియోలు, మరైన్ రేడియోలు, కార్డ్లెస్ ఫోన్లు ఇవన్నీ రేడియో తరంగాలను ఉపయోగించుకొని ఒకరితో పదుల కిలోమీటర్లు దూరంగా ఉన్నా మాట్లాడుకునేలా తయారుచేయబడ్డాయి. అయితే పరికరాన్ని బట్టి, ఫ్రీక్వెన్సీని బట్టి, ఆయా దేశాల చట్టాలను బట్టి రేడియో స్పెక్ట్రమ్ ని ఉపయోగించుకొన్నందుకు ప్రభుత్వ అనుమతి తీసుకొని లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
భారత్‌లో కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహిస్తోంది. ఈ వేలంలో వివిధ టెలికాం కంపెనీలు పాల్గొని ఫీజు చెల్లించి రేడియో తరంగాలను ఉపయోగించుకోవడానికి లైసెన్స్ పొందుతాయి.
చివరిగా, రేడియో తరంగాలు ఉపయోగించుకొని పని చేసే పరికరాలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2016లో నమీబియాకి చెందిన సైమన్ పెట్రస్ తయారుచేసిన పరికరానికి పేటెంట్ ఇంకా రాలేదు. దానిని అభివృద్ధి చేసి ఉత్పత్తి చెయ్యడానికి ఏ సంస్థ ముందుకు రాలేదు.