రాజ్యాంగాన్ని సవరించి ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదు

“రాజ్యాంగాన్ని సవరించి, ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’ తో భర్తీ చేయాలన్న సుప్రీంకోర్టు 2020 ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దేశం పేరును భారత్‌గా మార్చాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మన దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫాక్ట్(నిజం): రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలని కోరుతూ ఢిల్లీకి చెందిన నమహా అనే వ్యక్తి 2020 లో సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఈ పిటిషన్‌ను అభ్యర్థనగా (representation) పరిగణించి, దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, 03 జూన్ 2020న తీర్పు ఇచ్చింది. అయితే, తన అభ్యర్థనకు సంబంధించి అధికారుల నుండి ఎటువంటి సమాచారం రాకపోవడంతో పిటిషనర్‌ 2025లో ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం, 2020 నాటి సుప్రీంకోర్టు ఆదేశాలను త్వరగా పాటించాలని 12 మార్చి 2025న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకానీ, ఈ తీర్పులో ఢిల్లీ హైకోర్టు మన దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా ఆదేశించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, మన దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, దేశం పేరును “ఇండియా” నుండి “భారత్”గా మార్చాలని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అభ్యర్థనగా (representation) పరిగణించి, దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని త్వరగా పాటించాలని ఢిల్లీ హైకోర్టు 12 మార్చి 2025న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని పేర్కొంటున్న పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాలు ఏవీ మన దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అని పేర్కొనలేదు.

ఈ పిటిషన్ నేపథ్యాన్ని పరిశీలిస్తే, రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలని కోరుతూ ఢిల్లీకి చెందిన నమహా అనే వ్యక్తి మొదట 2020లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ (W.P.(C) 422/2020) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే, జస్టిస్ ఎ.ఎస్. బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ఈ పిటిషన్‌ను అభ్యర్థనగా (representation) పరిగణించి, దీనిపై కేంద్ర మంత్రిత్వ శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, 03 జూన్ 2020న ఈ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది (కొట్టివేసింది).

సుమారు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి చూసిన తర్వాత, పిటిషనర్ ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలన తన అభ్యర్థనపై కేంద్ర తీసుకుంటున్న చర్యల యొక్క స్థితి గురించి సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం, 2005 కింద దరఖాస్తు దాఖలు చేయగా, డిసెంబర్ 2021లో, ఈ విషయాన్ని అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) K.M నటరాజ్ కు 03 జూన్ 2020న అప్పగించారని, భారత పార్లమెంటు కార్యదర్శి ద్వారా దరఖాస్తును లోక్‌సభ & రాజ్యసభ, CPIO కు బదిలీ చేయవచ్చని పిటిషనర్‌కు తెలియజేయబడింది.

అతర్వాత తన అభ్యర్థనకు సంబంధించి అధికారుల నుండి ఎటువంటి స్పందన/సమాచారం రాకపోవడంతో పిటిషనర్‌ 2025లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ (W.P.(C) 1433/2025) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సచిన్ దత్తా ధర్మాసనం, రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని త్వరగా పాటించాలని 12 మార్చి 2025న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పులో ఎక్కడా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మన దేశం పేరును ఇండియా నుండి భారత్‌గా మార్చమని ఆదేశించలేదు.

చివరగా, రాజ్యాంగాన్ని సవరించి ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలని ఢిల్లీ హైకోర్టు/ సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించలేదు.