05 ఏప్రిల్ 2025న, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 కు తన ఆమోదాన్ని తెలిపారు, రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది (ఇక్కడ, ఇక్కడ). ఇటీవల వక్ఫ్ (సవరణ) బిల్లును భారత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లును లోక్‌సభ 03 ఏప్రిల్ 2025న సుదీర్ఘ చర్చ తర్వాత ఆమోదించింది, లోక్‌సభలో ఈ బిల్లుకు 288 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే 04 ఏప్రిల్ 2024న తెల్లవారుజామున ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది, రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి (ఇక్కడ, ఇక్కడ). వక్ఫ్ (సవరణ) బిల్లుపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అన్ని సవరణలు తిరస్కరించబడ్డాయి. ఈ నేపథ్యంలో, “వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటన చేసిన వైసీపీ (YSRCP) లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వేటు వేసి, రాజ్యసభలో మాత్రం వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసింది” అని చెప్తూ ఉన్న పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ (YSRCP) ఓటు వేసింది.
ఫాక్ట్(నిజం): రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ (YSRCP) ఓటు వేసింది అనే వాదన సరైనది కాదు. 03 ఏప్రిల్ 2024న రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో, YSRCP నుండి పాల్గొన్న ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, YSRCP వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తుందని అన్నారు. YSRCP కి చెందిన ఏడుగురు (07) రాజ్యసభ ఎంపీలు వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మేము ఖచ్చితంగా నిర్ధారించలేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఆధారాలు YSRCP రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుకు మద్దతు ఇవ్వలేదని సూచిస్తున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ వేసిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైసీపీ (YSRCP) లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వేటు వేసి, రాజ్యసభలో మాత్రం వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది అంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
04 ఏప్రిల్ 2025న, ఈ విమర్శలపై YSRCP స్పందిస్తూ ఈ ఆరోపణలలో నిజం లేదని పేర్కొంటూ తన అధికారిక X(ట్విట్టర్)లో ఓ పోస్టు చేసింది. ఈ పోస్టులో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఓటు వేయాలని YSRCP విప్ జారీ చేస్తూ విడుదల చేసిన లేఖను, వక్ఫ్ (సవరణ) బిల్లునుYSRCP వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రసంగాన్ని షేర్ చేసింది. వక్ఫ్ బిల్లును YSRCP వ్యతిరేకించినట్లు జాతీయ మీడియానే కాదు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా చెప్పింది అని ఈ పోస్టులో పేర్కొంది.
03 ఏప్రిల్ 2024న రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో, YSRCP నుండి పాల్గొన్న ఆ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, YSRCP వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తుందని అన్నారు (ఇక్కడ, ఇక్కడ). అలాగే 02 ఏప్రిల్ 2024న లోకసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చలో, YSRCP నుండి పాల్గొన్న ఆ పార్టీ లోకసభ ఎంపీ మిథున్ రెడ్డి, YSRCP వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తుందని అన్నారు (ఇక్కడ).
తరువాత, రాజ్యసభ అధికారిక వెబ్‌సైట్‌లో 03 ఏప్రిల్ 2024న రాజ్యసభలో జరిగిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై జరిగిన చర్చకు సంబంధించిన పత్రాలను మేము పరిశీలించాము, ఈ చర్చలో YSRCP నుండి పాల్గొన్న ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, YSRCP వక్ఫ్ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తుందని అన్నారు. రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుకు సంబంధించిన చర్చా పత్రాలల్లో ఓట్ల విభజన అనగా బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయని మాత్రమే పేర్కొన్నారు, ఈ బిల్లుకు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఏయే ఎంపీలు ఓటు వేశారో పేర్కొనలేదు.
పలు మీడియా సంస్థలు YSRCPకి చెందిన పలువురు ఎంపీలు వక్ఫ్ (సవరణ) బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేశారని పేర్కొంటూ కథనాలు ప్రచురించాయి. YSRCP రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ (గుజరాత్ నుండి) వక్ఫ్ (సవరణ) బిల్లు 2025 కు మద్దతు ఇవ్వగా, ఇతర YSRCP ఎంపీలు రాజ్యసభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని, 05 ఏప్రిల్ 2025న ప్రచురించబడిన ‘ఎకనామిక్ టైమ్స్’ కథనం పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభలో YSRCPకి ఏడుగురు (07) ఎంపీలు ఉన్నారు (ఇక్కడ).
YSRCP కి చెందిన ఏడుగురు (07) రాజ్యసభ ఎంపీలు వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారని మేము ఖచ్చితంగా నిర్ధారించలేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఆధారాలు బట్టి YSRCP రాజ్యసభలో వక్ఫ్ (సవరణ) బిల్లుకు మద్దతు ఇవ్వలేదని మనం నిర్ధారించవచ్చు.
చివరగా, రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా వైసీపీ (YSRCP) ఓటు వేసింది అనే వాదన సరైనది కాదు.