“2002లో వాజ్‌పేయి ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిరోధించటానికి పోటా చట్టాన్ని తీసుకువచ్చింది. మన్మోహన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను కాపాడటానికి పోటా చట్టాన్ని రద్దు చేసిందని ఎంతమందికి తెలుసు??” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉగ్రవాదులను రక్షించడానికి, 2002లో ఉగ్రవాదాన్ని నిరోధించటానికి NDA ప్రభుత్వం తెచ్చినా POTA చట్టాన్ని రద్దు చేసింది.
ఫాక్ట్(నిజం): 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం ఉగ్రవాదులను రక్షించడానికి POTA చట్టాన్ని రద్దు చేసిందనే వాదన సరైనది కాదు. Prevention of Terrorism Act (POTA) చట్టం దుర్వినియోగం అవుతోందని పేర్కొంటూ, 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం, 2002లో అప్పటి NDA ప్రభుత్వం తెచ్చిన Prevention of Terrorism Act (POTA) చట్టాన్ని రద్దు చేసింది. అయితే, ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అప్పటికే ఉన్న Unlawful Activities (Prevention) Act (UAPA), 1967 చట్టంలో కొత్తగా ‘ఉగ్రవాద చర్యలకు’ సంబంధించిన పలు నిబంధనలను కూడా చేర్చింది. 2014లో మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మందిపై ఉగ్రవాద ఆరోపణల మీద UAPA కింద కేసులు నమోదయ్యాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
2001లో, వాజ్‌పేయి నేతృత్వంలోని అప్పటి NDA ప్రభుత్వం ఉగ్రవాదాన్ని నిరోధించటానికి The Prevention of Terrorism Ordinance, 2001 (POTA) అమలులోకి తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను పార్లమెంటు మార్చి 2002లో ఆమోదించింది. Prevention of Terrorism Act (POTA), 2002 కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.
అయితే, POTA చట్టం దుర్వినియోగం అవుతోందని పలువురు ఆరోపించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, 21 సెప్టెంబర్ 2004న మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం, 2002లో అప్పటి NDA ప్రభుత్వం తెచ్చిన Prevention of Terrorism Act (POTA) చట్టాన్ని రద్దు చేస్తూ Prevention of Terrorism (Repeal) Ordinance, 2004 తెచ్చింది. అయితే, అదే రోజు ఉగ్రవాదాన్ని నిరోధించటానికి అప్పటికే ఉన్న Unlawful Activities (Prevention) Act (UAPA), 1967 చట్టంలో కొత్తగా ‘ఉగ్రవాద చర్యలకు’ సంబంధించిన పలు నిబంధనలను చేరిస్తూ Unlawful Activities (Prevention) Amendment Ordinance, 2004 కూడా తెచ్చింది.
ఈ రెండు ఆర్డినెన్స్‌లను పార్లమెంట్ 2004 డిసెంబర్‌లో ఆమోదించింది. 21 డిసెంబర్ 2004న, The Prevention of Terrorism (Repeal) Act, 2004 & 29 డిసెంబర్ 2004న, The Unlawful Activities (Prevention) Amendment Act, 2004, రాష్ట్రపతిచే ఆమోదించబడ్డాయి.
Unlawful Activities (Prevention) Act (UAPA), 1967 పలు సార్లు సవరించబడింది. ఇందులో 2004, 2008, 2013, 2019 సంవత్సరాల్లో చేసిన సవరణలు ముఖ్యమైనవి. 2008లో ఉగ్రవాదం అనే మాటకు విస్తృతమైన అర్ధాన్ని నిర్వచిస్తూ ఈ చట్టంలో మార్పులు చేశారు. UAPA చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం, బీభత్సం వ్యాప్తి చేయడానికి, భారతదేశంలో లేదా విదేశాలలో లేదా ప్రజలలో ఏ విభాగంలోనైనా భయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా భారతదేశపు ఐక్యత, సమగ్రత, వ్యక్తిగత భద్రత, ఆర్థిక భద్రత, సార్వభౌమత్వాన్ని హాని చేసే ప్రమాదకరమైన చర్యలను ‘ఉగ్రవాద చర్యలు’ అంటారు.
2014లో మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ G. N. సాయిబాబా, విరసం నేత & కవి వరవరరావు, ప్రసిద్ధ రచయిత్రి అరుంధతీ రాయ్, కశ్మీరీ డాక్టర్ షేక్ షౌకత్ హుస్సేన్, న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్థ, విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, లపై UAPA కింద కేసులు నమోదయ్యాయి. ఇటీవల 10 నవంబర్ 2025న ఢిల్లీలో ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై UAPA చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది.
చివరగా, 2004లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని UPA ప్రభుత్వం POTA చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో UAPA చట్టంలో మార్పులు చేసింది.