ఒడిశా రైలు ప్రమాద బాధితుల నుండి RSS కార్యకర్తలు విలువైన వస్తువులను దొంగిలించారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం

ఇటీవల ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులని ఆదుకుంటామని చెప్పి RSS కార్యకర్తలు బంగారం, డబ్బు, ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడ్డారని చెప్తూ, RSS కార్యకర్తలను పోలీసులు కొడుతున్నట్లు ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఒడిశా రైలు ప్రమాద బాధితుల నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తూ పట్టుబడిన RSS కార్యకర్తలను పోలీసులు కొడుతున్న ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటో నవంబర్ 2012లో తీసినది. 11 నవంబర్ 2012లో  ఆగ్రాలో RSS కార్యకర్తలు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీలో కొన్ని సైకిల్లను బిఎస్పీ నేతకు చెందిన కారు ఢీ కొట్టడంతో, RSS కార్యకర్తలు వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు RSS కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేశారు. ఈ ఫొటోతో ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఘటన జరిగినట్లు మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. ఇక వైరల్ అవుతున్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా నవంబర్ 2012లో ఇదే ఫోటోతో జాగరణ్ పత్రిక ఒక వార్తాకథనాన్ని ప్రచురించినట్లు గుర్తించాం.  

ఈ కథనం ప్రకారం, 11 నవంబర్ 2012న ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో టేడీ బగియా ప్రాంతంలో సైకిల్ ర్యాలీ చేస్తున్న RSS కార్యకర్తలను బిఎస్పీ పార్టీకి చెందిన ఒక నేత కారు ఢీ కొట్టింది. ఈ విషయంపై ఇరు వర్గాలకి గొడవ జరిగింది. అయితే పోలీసులు బిఎస్పీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోలేని RSS కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంలో పోలీసులు RSS కార్యకర్తలపై లాఠీ ఛార్జి చేయడం జరిగింది.

ఇక ఇదే ఫొటోని 2015 నుంచి సంబంధం లేని అనేక పుకార్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్న కారణంగా అనేక మీడియా సంస్థలు దీనిపై ఫాక్ట్- చెక్ కథనాలను మరియు వివరణలను ప్రచురించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఒడిశా రైలు ప్రమాద బాధితుల నుంచి విలువైన వస్తువులను దొంగిలిస్తూ RSS కార్యకర్తలను పట్టుబడ్డారని సంబంధం లేని పాత ఫొటోని షేర్ చేస్తున్నారు.