“గత కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ మిషనరీలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో స్వాతంత్య్రం వచ్చిన 60 ఏళ్లలో నాగాలాండ్‌లో క్రైస్తవం 0% నుంచి 87%కి పెరిగింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: స్వాతంత్ర్యం వచ్చిన 60 సంవత్సరాలలో, నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా 0% నుండి 87%కి పెరిగింది.
ఫాక్ట్(నిజం): స్వాతంత్ర్యం వచ్చిన 60 సంవత్సరాలలో, నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా 0% నుండి 87%కి పెరిగింది అనే వాదన పూర్తిగా నిజం కాదు. 1947లో నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభ ఎంత ఉందని చెప్పడానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. స్వాతంత్య్రానంతరం భారతదేశ జనాభాను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 1951లో సెన్సస్(మొదటి జనాభా గణనను) నిర్వహించింది. 1951 సెన్సస్ ప్రకారం, 1951 నాటికి నాగాలాండ్ జనాభాలో క్రైస్తవ జనాభా శాతం సుమారు 46.05%గా ఉంది మరియు 2011 సెన్సస్ డేటా ప్రకారం, 2011 నాటికి నాగాలాండ్ జనాభాలో క్రైస్తవ జనాభా శాతం 87.93% గా ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్య్రానంతరం భారతదేశ జనాభాను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 1951లో సెన్సస్ (మొదటి జనాభా గణనను) నిర్వహించింది.
1947లో క్రైస్తవ (క్రిస్టియన్) జనాభా ఎంత ఉందో చెప్పడానికి అధికారిక సమాచారం లేనందున, 1951 మరియు 2011 సెన్సస్ సమాచారాన్ని పరిశీలిద్దాం. ఇందుకోసం, మేము భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జనాభా లెక్కల వివరాల కోసం censusindia.gov.in వెబ్‌సైట్‌లో 1951 సెన్సస్ వివరాలను పరిశీలించగా, 1951 సెన్సస్ అధికారిక డేటా ప్రకారం, 1951లో నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా సుమారు 98 వేలు, అలాగే 1951 నాటికి నాగాలాండ్ జనాభాలో క్రైస్తవ జనాభా శాతం సుమారు 46.05%గా ఉంది (ఇక్కడ).
2011 సెన్సస్ అధికారిక డేటా ప్రకారం, 2011 నాటికి నాగాలాండ్ మొత్తం జనాభా 19.79 లక్షలు, కాగా అందులో క్రైస్తవ జనాభా సుమారు 17.40 లక్షలుగా ఉంది, మరియు 2011 నాటికి నాగాలాండ్ జనాభాలో క్రైస్తవ జనాభా శాతం 87.93% (ఇక్కడ, ఇక్కడ).
సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్, ఇండియా వారి రిపోర్ట్ ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో దాదాపు 2.78 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, వీరిలో దాదాపు 78 లక్షల మంది ఈశాన్య భారతదేశంలో (అసోంతో సహా) ఉన్నారు. అలాగే, ఈ రిపోర్ట్ ప్రకారం, ఈశాన్య భారతదేశంలో క్రైస్తవ మతం విస్తరణ 1931-1951 మధ్య జరిగింది. ఈ విస్తరణ 1941-51 మధ్య భారీగా జరిగింది. మిజోరాం, మణిపూర్ మరియు నాగాలాండ్‌లోని గిరిజన జనాభా ఇప్పుడు దాదాపు పూర్తిగా క్రైస్తవులుగా మారారు. అలాగే, ఈ రిపోర్ట్ ప్రకారం, 1901లో నాగాలాండ్‌లో క్రైస్తవుల సంఖ్య కేవలం 601 మరియ మొత్తం జనాభాలో క్రైస్తవుల జనాభా 0.59 శాతంగా ఉంది. 1901 తర్వాత, వారి సంఖ్య నెమ్మదిగా విస్తరించడం ప్రారంభించి 1931 నాటికి సుమారు 23 వేలకి చేరుకుంది, అలాగే 1931లో నాగాలాండ్ మొత్తం జనాభాలో క్రైస్తవుల జనాభా 12.8 శాతానికి చేరింది. భారతదేశ స్వాతంత్ర్య ప్రక్రియ సమయంలో అనగా 1941 నుండి 1951 మధ్య నాగాలాండ్‌లో క్రైస్తవుల జనాభా సంఖ్య భారీగా పెరిగింది. 1951లో నిర్వహించిన స్వతంత్ర భారత తొలి జనాభా గణనలో, నాగాలాండ్‌లో దాదాపు లక్ష మంది క్రైస్తవులు ఉన్నారు, మరియు మొత్తం జనాభాలో క్రైస్తవుల జనాభా 46.05 శాతంగా ఉంది.
1947లో నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభ ఎంత ఉందని చెప్పడానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 1951 మరియు 2011 అధికారిక సెన్సస్ డేటా ప్రకారం, 1951 నాటికి నాగాలాండ్ జనాభాలో క్రైస్తవ జనాభా శాతం సుమారు 46.05%గా ఉంది. అలాగే, 2011 నాటికి నాగాలాండ్ జనాభాలో క్రైస్తవ జనాభా శాతం 87.93% గా ఉంది.
చివరగా, స్వాతంత్ర్యం వచ్చిన 60 ఏళ్లలో నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా 0% నుండి 87%కి చేరిందన్న వాదన పూర్తిగా నిజం కాదు.