డెన్మార్క్ ముస్లింల ఓటు హక్కును రద్దు చేసిందనే వాదనలో నిజం లేదు

“ముస్లింల ఆగడాలు తట్టుకోలేక ముస్లింలకు ఓటు హక్కును రద్దుచేసిన మొట్టమొదటి దేశంగా డెన్మార్క్” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింలకు ఓటు హక్కును డెన్మార్క్ రద్దు చేసింది.

ఫాక్ట్(నిజం): డెన్మార్క్ ముస్లింల ఓటు హక్కును రద్దు చేయలేదు. డెన్మార్క్ ఎన్నికల చట్టం ప్రకారం, డెన్మార్క్‌లో నివసిస్తున్న 18 ఏళ్లు పైబడిన, ఎటువంటి మానసిక వైకల్యం లేని, ఏ డానిష్ పౌరుడైనా డెన్మార్క్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు. డెన్మార్క్ ఏ వ్యక్తినీ వారి మతం ఆధారంగా ఎన్నికల్లో ఓటు వేయకుండా నిషేధించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, ఇటీవల అనగా 2025లో ముస్లింలకు ఓటు హక్కును డెన్మార్క్ రద్దు చేసిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, డెన్మార్క్‌లో ముస్లింల ఓటు హక్కులు రద్దు చేశారని గానీ, రద్దు చేయనున్నారని గానీ నిర్ధారించే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ డెన్మార్క్ ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేసి ఉంటే, కచ్చితంగా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి.

డెన్మార్క్ ప్రభుత్వ పార్లమెంట్ వెబ్‌సైట్ ప్రకారం, డెన్మార్క్‌లో 18 ఏళ్లు పైబడిన, ఎటువంటి మానసిక వైకల్యం లేని, ఏ డానిష్ పౌరుడైనా డెన్మార్క్ ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులు (గ్రీన్‌ల్యాండ్, ఫారో దీవుల పౌరులు కూడా డెన్మార్క్ పరిధిలోకి వస్తారు).

డెన్మార్క్ ప్రభుత్వ వెబ్‌సైట్లలో డానిష్ ఎన్నికల ప్రక్రియ గురించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), డెన్మార్క్ ఏ వ్యక్తినీ వారి మతం ఆధారంగా ఎన్నికల్లో ఓటు వేయకుండా నిషేధించలేదు అని స్పష్టమవుతోంది.

ఈ వైరల్ పోస్ట్ చాలా సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ). 2020లో, ఇదే క్లెయిమ్‌తో పలు పోస్టులు ఇంగ్లీషులో వైరల్ కాగా, ఈ వార్త నిజం కాదని పేర్కొంటూ Factly రాసిన ఫ్యాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

అంతేకాకుండా 2020లో ఈ వార్తలో ఎంత నిజం ఉందని ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ భారతదేశంలోని డానిష్ రాయబార కార్యాలయాన్ని ఇ-మెయిల్ ద్వారా సంప్రదించగా, డానిష్ రాయబార కార్యాలయ అప్పటి మినిస్టర్‌ కౌన్సిలర్ స్టీన్ మాల్తే హాన్సెన్ ఈ వార్త నిజం కాదని, అలాంటి చట్టం ఏదీ ఆమోదించబడలేదని పేర్కొన్నారు.

చివరగా, ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేస్తూ డెన్మార్క్ ఎలాంటి చట్టం చేయలేదు.