ఈ వీడియోలో మండుతున్న పదార్థం అమోనియం డైక్రోమేట్, కుర్‌కురే కాదు

కుర్‌కురే పొడికి నిప్పు పెట్టడం వల్ల అది అగ్నిపర్వతంలాగా మండుతుందని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ)  సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ కారణంగా కుర్‌కురే తినడం ప్రమాదకరమని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోని పరిశీలించమని మాకు వాట్సాప్ టిప్లైన్ (+91 92470 52470) ద్వారా కూడా అభ్యర్థనలు వచ్చాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.  

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కుర్‌కురే పొడికి నిప్పు పెట్టడం వల్ల అది అగ్నిపర్వతంలాగా మండుతున్నట్లు చూపుతున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలో మండుతున్న పదార్థం కుర్‌కురే కాదు, అది అమోనియం డైక్రోమేట్ ((NH4)2Cr2O7). అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూపించే ప్రయోగాల్లో దీన్ని ఉపయోగిస్తారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోని పరిశీలించగా అందులో ‘@sarveshtripathimaxscience’ అనే ఇన్స్టాగ్రామ్ ఐడీ ఉండడం గుర్తించాం. దీని ఆధారంగా, ఈ వీడియో (ఆర్కైవ్) ముందుగా “Sarvesh Tripathi Max science” అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 20 డిసెంబర్ 2024న అప్లోడ్ చేసి ఉండడం గుర్తించాం. వారి వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇది గుజరాత్‌లోని ఒక విజ్ఞాన కేంద్రం. ఇక్కడ విదార్థులకు వివిధ సైన్స్ ప్రయోగాలను నేర్పుతారు.

ఇక, ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇలాంటి సైన్స్ ప్రయోగాన్నే చూపే మరిన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు యూట్యూబ్లో లభించాయి. అయితే, ఈ వీడియోల్లో ఉపయోగించిన ఈ నారింజ రంగు పదార్థం పేరు అమోనియం డైక్రోమేట్ ((NH4)2Cr2O7) అని పేర్కొన్నారు. అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూపించడానికి ఈ పదార్థంతో అనేక ప్రయోగశాలల్లో ఈ ప్రయోగాన్ని చేస్తుంటారు. అయితే అమోనియం డైక్రోమేట్ యొక్క హానికర స్వభావం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

పైగా, దీని గురించి ‘Sarvesh Tripathi Max science’ వారిని సంప్రదించగా, ఈ ప్రయోగంలో తాము వాడిన పదార్థం అమోనియం డైక్రోమేట్ అని, కుర్‌కురే వాడినట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

చివరిగా, ఆరోగ్యంపై కుర్‌కురే ప్రభావాన్ని మేము ధృవీకరించలేనప్పటికీ, వైరల్ వీడియోలో మండుతున్న పదార్థం కుర్‌కురే కాదని, అది అమోనియం డైక్రోమేట్ అని నిర్ధారించవచ్చు