ఈ వీడియోలో బురఖా వేసుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహిళ కర్ణాటక రాష్టంలోని కలెక్టర్ కాదు

ఈ ఏడాది భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో, కర్ణాటకలోని ఒక ముస్లిం మహిళా కలెక్టర్ బురఖా వేసుకొని పాల్గొన్నారని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘…నిషేధానికి గురి అయిన చోట గెలవడం అంటే ఇదే..’ అని గత సంవత్సరం కర్ణాటకలోని విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించటాన్ని నిషేదించిన విషయాన్ని ఉద్దేశిస్తూ పోస్టు వివరణ ఉంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: కర్ణాటకలోని ఒక ముస్లిం మహిళా కలెక్టర్ బురఖా ధరించి జండా వందనం చేసారు. 

ఫాక్ట్(నిజం): ఈ వీడియో జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఈ ఏడాది జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి చెందినది. ఇందులో ఉన్న మహిళ, కిష్త్వార్‌ జిల్లా District Development Council యొక్క Vice-Chairperson అయిన సైమా పర్వీన్ లోన్ . కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించగా, ఒకచోట, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బ్యానర్ పైన ‘ District Administration, Kishtwar అని కనిపించింది. అంతే కాక, ఈ విడియో పైన “ఫాస్ట్ న్యూస్” అనే లోగో కూడా ఉంది.

ఈ రెండిటిని హింట్ లాగా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటెరెట్లో వెతకగా, ఫాస్ట్ న్యూస్ అనే Facebook పేజీలో ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ లభించింది. 

ఈ వీడియోలో మొదటి ముప్పై సెకండ్లు వైరల్ వీడియోతో సరిపోలాయి. ఈ వీడియో జమ్మూ & కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఈ నెల జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చూపిస్తుంది. వీడియోలో బురఖా ధరించి వేడుకకు విచ్చేసిన మహిళ కిష్త్వార్‌ జిల్లా District Development Council యొక్క Vice-Chairperson సైమా పర్వీన్ లోన్ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ వేడుక కిష్త్వార్‌లోని చౌగన్ గ్రౌండ్‌లో జరిగింది అని జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ వెబ్సైటు చెప్తుంది. ఈ ఆధారాలను బట్టి, ఈ వేడుకల వీడియోలోని చిన్న భాగాన్ని కట్ చేసి, అందులో ఉన్న మహిళ కర్ణాటకలోని ఒక కలెక్టర్ అని తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు. 

చివరిగా, ఈ వీడియోలో బురఖా వేసుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మహిళ కర్ణాటక రాష్టంలోని కలెక్టర్ కాదు, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌ జిల్లా District Development Council Vice-Chairperson సైమా పర్వీన్ లోన్.