Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పోస్టులోని వీడియో పాతది (2011). చైనాకు గానీ, కొరోనా వైరస్ కు గానీ సంబంధించిన వీడియో కాదు.

0

ఒక ఇంటి పైకప్పు మీద ఉన్న గబ్బిలాలను వెలికితీస్తున్న వీడియో ని పోస్టు చేసి, ‘చైనాలో కొరోనా వైరస్ పుట్టడానికి గల కారణాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు.. చైనాలోని హుబయ్ పరిసర ప్రాంతంలలో ఇండ్ల పెంకులు కింద దాక్కుని ఉన్న క్రిశాంతియుమ్ అనే జాతి గబ్బిలాల వలన వచ్చిందని తేలింది.. ఇప్పుడు వాటిని నివారించే పనిలో పడ్డారు.. మాంసాహార ప్రియులు అయినటువంటి చైనీయులు వీటి సూప్ తాగుతూ ఉండడం వలన వాటి నుండి కొరోనా వైరస్ వీరికి సంక్రమించింది’ అని దాని గురించి పేర్కొంటున్నారు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనాలో కొరోనా వైరస్ పుట్టడానికి కారణమై, ఇండ్ల పెంకుల కింద దాక్కున్న ‘క్రిశాంతియుమ్’ జాతి గబ్బిలాలని నిర్మూలిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): చైనాలో కొరోనా వైరస్ పుట్టడానికి గల కారణం గబ్బిలాలని కొన్ని పరిశోధనలు పేర్కొంటున్నప్పటికీ, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ దాన్ని ఇప్పటివరకు కచ్చితమైన నిర్ధారణ చేయలేదు. పోస్టులోని వీడియో 2011 లో మియామీ లోని ఒక ఇంటి పైకప్పు మీది పెంకులను తొలగించేటప్పుడు, గబ్బిలాలను గుర్తించినప్పటిది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

చైనాలో కొరోనా వైరస్ పుట్టడానికి గల కారణం గబ్బిలాలని కొన్ని పరిశోధనలు పేర్కొంటున్నట్లుగా ‘The Economic Times’ వారి కథనం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ దాన్ని ఇప్పటివరకు ఎటువంటి కచ్చితమైన నిర్ధారణ చేయలేదు.

పోస్టులోని వీడియోలో ఒక ఇంటి పైకప్పు మీది పెంకులను తొలగించేటప్పుడు, గబ్బిలాలు బయటకి వస్తాయి. దాంతో, యూట్యూబ్ లో ‘Bats on roof top’ అని వెతికినప్పుడు, పోస్టులోని వీడియో యొక్క పూర్తి వీడియో లభించింది. దానిని ‘Istueta Roofing’ అనే ఒక సంస్థ 2011లో తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది. ఆ ఛానెల్ లో ఆ పూర్తి వీడియోకి సంబంధించిన మరొక సంక్షిప్త భాగం కూడా లభించింది. దాని డిస్క్రిప్షన్ ద్వారా, ‘Istueta Roofing’ సంస్థ తమ రూఫింగ్ సేవలలో భాగంగా, 2011 లో మియామీ లోని ఒక ఇంటి పైకప్పు మీది పెంకులను తొలగించేటప్పుడు, గబ్బిలాలు బయటికి రావడంతో వారు వీడియో రికార్డు చేసారని తెలిసింది.

చివరగా, పోస్టులోని వీడియో పాతది (2011). చైనాకు గానీ, కొరోనా వైరస్ కు గానీ సంబంధించిన వీడియో కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll