“ప్రభుత్వాలని సోషల్ మీడియా వేదికగా దేశ పౌరులు ఎవరైనా ప్రశ్నించవచ్చు- సుప్రీం కోర్టు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక తీర్పు ఇచ్చింది.
ఫాక్ట్(నిజం): సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉందని పేర్కొంటూ ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఎప్పుడూ తీర్పు ఇవ్వలేదు. అయితే, పలు కేసుల విచారణ సమయంలో, సుప్రీంకోర్టు ఈ వాదనను సమర్థించేలా వ్యాఖ్యానించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉందని సుప్రీంకోర్టు ఎప్పుడూ ప్రత్యేకంగా తీర్పు ఇవ్వలేదు. అయితే, పలు కేసుల విచారణ సమయంలో, సుప్రీంకోర్టు ఈ వాదనను సమర్థించేలా వ్యాఖ్యానించింది.
ముందుగా, ఈ వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉందని ప్రత్యేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు. ఈ క్రమంలోనే, ఈ వైరల్ క్లెయిమ్ మే 2021 నుండే ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతుందని తెలిసింది (ఇక్కడ, & ఇక్కడ). అయితే, అప్పుడు క్లెయిమ్‌కు మద్దతుగా ఒక వార్త కథనం కూడా షేర్ చేసినట్లు మేము గుర్తించాము. ఈ కథనం ప్రకారం, 2021 కరోనా సెకండ్ వేవ్ సమయంలో తప్పుడు సమాచారం, రూమర్స్ అన్న సాకుతో జనం గొంతును నొక్కొద్దు అని కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల డీజీపీలను సుప్రీంకోర్టు 30 ఏప్రిల్ 2025న ఆదేశించింది.
30 ఏప్రిల్ 2025న, దేశంలో కరోనా కట్టడి కోసం జాతీయ పాలసీని అమలుచేసే విషయంపై చేపట్టిన సుమోటో కేసును జస్టిస్ డీ.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ విచారించింది. ఈ విచారణ సందర్భంగా, ఆపదలో ఉన్న ప్రజలు సాయం కోరుతూ లేదా ఆక్సిజన్, బెడ్లు, డాక్టర్ల కొరత వంటి సమస్యలను తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు, మెసేజీలు పెడితే ప్రజలపై చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రజల సమస్యలను వినాల్సిందేనని, ప్రస్తుత కష్టకాలంలో (కోరనా) ఇన్ఫర్మేషన్ ఫ్లో(వ్యాప్తి)కు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని పేర్కొంది, అలాగే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కారం (కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్) కింద చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మే 2021లో ప్రచురించబడిన మరిన్ని కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి ఈ కేసు విచారణ సమయంలో, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుగా వ్యాప్తి చేస్తున్నారు అని మనం నిర్ధారించవచ్చు. ఈ వ్యాఖ్యలు కేవలం ఈ కేసుకు మాత్రమే పరిమితం.
అయితే, పలు కేసుల విచారణ సమయంలో, సుప్రీంకోర్టు వైరల్ పోస్టులో చేస్తున్న వాదనను సమర్థించేలా వ్యాఖ్యానించింది. బాల్ థాకరే అంత్యక్రియల రోజున శివసేన పిలుపునిచ్చిన మహారాష్ట్ర బంద్‌ను విమర్శిస్తూ సోషల్ నెట్‌వర్క్ సైట్‌లో పోస్ట్ చేసినందుకు మహారాష్ట్రలో ఇద్దరు బాలికలను రాత్రిపూట అరెస్టు చేసిన తర్వాత, న్యాయ విద్యార్థిని శ్రేయ సింఘాల్ సెక్షన్ 66A యొక్క రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు (ఇక్కడ, ఇక్కడ). ప్రభుత్వం, రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తు పోస్టులు చేసే వారిపై సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66Aని ఉపయోగించి పోలీసులు విచక్షణారహితంగా ‘కేసులు నమోదు చేస్తున్నారని, ఈ చట్టం ‘రాజ్యాంగ విరుద్ధం’ అని, ఇది వాక్ స్వాతంత్య్రం, స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తుంది అని సుప్రీంకోర్టు మార్చి 2015లో సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66Aని కొట్టివేసింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) భారతదేశ పౌరులందరికీ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛను అందిస్తుంది. ఈ ఆర్టికల్ ద్వారా ఒక వ్యక్తి తన భావాలను ఇతరులకు తెలియజేయవచ్చు. అయితే రాజ్యాంగం కల్పించిన ఈ వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా హక్కుకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వాక్ స్వాతంత్య్రం పేరుతో పౌరులు భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను భంగపరచకూడదు, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడకూడదు, విదేశీ సంబంధాలకు హాని కలిగించకూడదు.
పౌరులు తమ భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి వార్తాపత్రికలు, సినిమాలు, రేడియో, టీవీ, కరపత్రాలు, కార్టూన్లు, పాటలు, నృత్యాలు, నాటకాలు, కథలు, సమావేశాలు, వేదికలు, వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా మొదలైన వాటిని ఉపయోగించవచ్చు. ఆర్టికల్ 19 (1a) ప్రకారం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలోనే అంతర్భాగంగా ఉంది. కాబట్టి, పౌరులకు సోషల్ మీడియా లేదా మరే ఇతర మాధ్యమంలోనైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంది. అయితే, పైన పేర్కొన్న విధంగా భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యానించవద్దు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు కేసుల విచారణ సమయంలో స్పష్టంచేసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
చివరగా, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు ఉందని ప్రత్యేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందనే వాదన సరైనది కాదు.