9 ఏండ్ల కేంద్ర బీజేపీ అధికారంలో దాదాపు 10 లక్షల కంపెనీలు మూత పడిపోగా, తెలంగాణలోని BRS అధికారంలో 23 వేల కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని చెప్తూ రెండు ప్రభుత్వాల పనితీరుని పోలుస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అలాగే ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వ పనితీరు వల్ల 22 కోట్ల యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడిపోగా, తెలంగాణలో మాత్రం 17 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిందని కూడా ఈ పోస్టులో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న విషయాలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 9 ఏండ్ల కేంద్ర బీజేపీ అధికారంలో దేశంలో దాదాపు 10 లక్షల కంపెనీలు మూత పడిపోగా, తెలంగాణలోని BRS అధికారంలో 23 వేల కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయి.
ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం నియమాలకు లోబడని కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు అవుతుంటాయి. ఇందులో తెలంగాణలోని కంపెనీలు కూడా ఉండి ఉంటాయి. అదే విధంగా దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం కొత్తగా రిజిస్టర్ అవుతూనే ఉంటాయి. ఉదాహారణకి 2021-22లో సంవత్సరంలో 1,67,076 కంపెనీలు, 2020-21లో 1,55,377 కంపెనీలు దేశ వ్యాప్తంగా రిజిస్టర్ అయ్యాయి. వీటి వల్ల ఉద్యోగాలు ఏర్పడుతాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం కూడా భాగమే. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పరిశ్రమలు మూత పడిపోవడం:
గత తొమ్మిది ఏండ్లలో దేశంలో లక్షల సంఖ్యలో పరిశ్రమల రిజిస్ట్రేషన్ రద్దు చేయబడ్డాయి అన్న మాట నిజమే. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వార్షిక నివేదికలు పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. 2022 వార్షిక నివేదిక ప్రకారం 31 మార్చ్ 2022 నాటికీ దేశం మొత్తంలో రిజిస్టర్ అయిన 23 లక్షల పైచిలుకు కంపెనీలలో 8 లక్షల పైచిలుకు కంపెనీల రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.
లక్షల సంఖ్యలో పరిశ్రమల రిజిస్ట్రేషన్ రద్దు అయినప్పటికీ, ఇక్కడ మన అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఇలా కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేయడం అనేది నిరంతర ప్రక్రియ. ఆర్థిక నివేదికలు, ఐటీ రిటర్న్స్ సమర్పించకపోవడం, మొదలైన కారణాల వల్ల ప్రభుత్వం ఇలా కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ఉంటుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఇలా రిజిస్ట్రేషన్ రద్దు అనేది జరుగుతుంది. అంటే పైన పేర్కొన్న సంఖ్యలో తెలంగాణలోని కంపెనీలు కూడా ఉంది ఉంటాయి. ఏ రాష్ట్రం ఎన్ని కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు అయ్యయో అన్న వివరాలు ఇక్కడ చూడొచ్చు.
అలాగే ప్రతీ ఏడు లక్షల సంఖ్యలో కొత్త కంపెనీలు రిజిస్టర్ అవుతూనే ఉంటాయి. ఉదాహారణకి 2021-22 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా కొత్తగా 1,67,076 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఈ కంపెనీల ద్వారా 2,03,849.53 కోట్ల మూల ధనంతో ఈ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన కంపెనీలు కూడా ఉండి ఉంటాయి. అలాగే అంతకు ముందు 2020-21 సంవత్సరంలో సుమారు 80వేల కోట్ల మూల ధనంతో 1,55,377 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి.
వైరల్ పోస్టులో తెలంగాణలో ఏర్పాటు అయిన కంపెనీల సంఖ్యకు సంబంధించిన వివరాలు సరైనవే అయినప్పటికీ, తెలంగాణ మినహాయిస్తే దేశంలో కంపెనీలు మూత పడుతున్నాయి అన్న వాదన కరెక్ట్ కాదు. ఎందుకంటే పైన చెప్పినట్టు రిజిస్ట్రేషన్ రద్దు అయిన కంపెనీలలో తెలంగాణలోని కంపెనీలు కూడా ఉండి ఉంటాయి. అలాగే కేంద్ర నివేదిక ప్రకారం ప్రతీ సంవత్సరం దేశంలో ఏర్పాటు అవుతున్న కంపెనీలలో వల్ల తెలంగాణ కూడా ఆర్ధికంగా లాభం జరుగుతుంది.
ఉద్యోగాలు :
అలాగే పైన తెలిపినట్టు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ప్రతీ సంవత్సరం దేశ వ్యాప్తంగా కంపెనీలు రిజిస్టర్ అవుతుండడం వల్ల ఉద్యోగాలు కూడా ఏర్పడుతాయి. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న ఈపీఎఫ్ చందాదారుల డేటాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఉదాహరణకు 2020-21లో 77 లక్షలకు పైచిలుకు ఉన్న చందాదారుల సంఖ్య 2021-22లో 1 కోటి 22 లక్షల పైచిలుకు చేరుకుంది.
నెలవారిగా ఈపీఎఫ్ చందాదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఉదాహరణకు ఏప్రిల్ 2023లో నికరంగా 17లక్షల పైచిలుకు మంది ఈపీఎఫ్ సభ్యత్వం పొందారు. అంతకు ముందు నెల 13లక్షల పైచిలుకు మంది ఈపీఎఫ్ సభ్యత్వం పొందారు. ఏప్రిల్ నెలలో సభ్యత్వం పొందిన వారిలో ఎక్కువ సుమారు 8.5 లక్షల మంది కొత్తవారు ఉన్నారు. అంటే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అర్థం చేసుకోవొచ్చు. కాబట్టి కేవలం కేవలం తెలంగాణలో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పోస్టులో చేస్తున్న వాదన కరెక్ట్ కాదని అర్ధం చేసుకోవచ్చు.
చివరగా, దేశంలో కంపెనీలు మూత పడుతుంటే తెలంగాణలో మాత్రం కొత్త కంపెనీలు ఏర్పాటు అవుతున్నాయి అంటూ ఈ పోస్టులో చేస్తున్న వాదన తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.