అక్టోబర్ 2025లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో పలు దేవాలయాలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన వ్యక్తులు హిందువులు; ముస్లింలు కాదు

“అలీఘర్‌లోని ఒక శివుని ఆలయంలో “ఐ లవ్ మహ్మద్” అని రాసిన #ముస్లిమ్స్”  అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ & ఇక్కడ). ఈ వీడియోలో ఒక శివాలయంపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసి ఉండటం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అలీఘర్‌లోని ఒక శివాలయంపై “ఐ లవ్ ముహమ్మద్” అని ముస్లింలు రాశారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 25 అక్టోబర్ 2025న ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని లోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్ పూర్, బులాకిగఢ్ గ్రామాల్లోని 04 దేవాలయాల గోడలను కొందరు ధ్వంసం చేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన సంఘటనకు సంబంధించినది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు, నిందితులందరూ హిందువులే. ఈ సంఘటనలో నిందితులు జీశాంత్ సింగ్, ఆకాష్ సరస్వత్, దిలీప్, అభిషేక్ సరస్వత్, రాహుల్ అని, రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, మిగిలిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని అలీఘర్ పోలీసులు మీడియాకు స్పష్టం చేశారు. నిందితులకు కొంతమంది ముస్లిం వ్యక్తులతో వ్యక్తిగత భూ వివాదాలు ఉన్నాయని, వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితులు ఇలా చేశారని అలీఘర్ పోలీసులు స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, 25 అక్టోబర్ 2025న ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని లోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగవాన్ పూర్, బులాకిగఢ్ గ్రామాల్లోని 04 దేవాలయాల గోడలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేసి, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఆలయ గోడలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాశారు. అయితే, ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదని, నిందితులందరూ హిందువులేనని పోలీసు దర్యాప్తులో తేలిందని, ఈ సంఘటనకు సంబంధించి అలీఘర్ పోలీసులు జీశాంత్ సింగ్, ఆకాష్ సరస్వత్, దిలీప్, అభిషేక్ సరస్వత్ అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారని ఈ కథనాలు పేర్కొన్నాయి.

ఈ సంఘటనపై 30 అక్టోబర్ 2025న అలీఘర్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP), పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అలీఘర్ జిల్లా SSP మాట్లాడుతూ, ఈ సంఘటనలో నిందితులు జీశాంత్ సింగ్, ఆకాష్ సరస్వత్, దిలీప్, అభిషేక్ సరస్వత్, రాహుల్ అని అన్నారు. రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, మిగిలిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని, నిందితులకు కొంతమంది ముస్లిం వ్యక్తులతో వ్యక్తిగత భూ వివాదాలు ఉన్నాయని, వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితులు ఇలా చేశారని ఆయన మీడియాకు స్పష్టం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన సమాచారం కోసం, ఈ కేసును దర్యాప్తు చేసిన అలీఘర్ జిల్లా లోధా పోలీసులను మేము సంప్రదించగా, వారు మాతో (Factly) మాట్లాడుతూ, “ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు నిందితులందరూ హిందువులే అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి లోధా పోలీస్ స్టేషన్ లో (FIR 303/2025) నమోదు చేయబడిందని కూడా పేర్కొన్నారు.

చివరగా, అక్టోబర్ 2025లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో పలు దేవాలయాలపై “ఐ లవ్ ముహమ్మద్” అని రాసిన వ్యక్తులు హిందువులు అని అలీఘర్ పోలీసులు స్పష్టం చేశారు.