మహారాష్ట్రలోని సతారాలో ఒక మైనర్ బాలికను కత్తితో బెదిరించిన ఈ సంఘటనలో నిందితుడు ముస్లిం కాదు

స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక అమ్మాయిని, ఒక యువకుడు పట్టుకుని,ఎవరైనా దగ్గరకు వస్తే కత్తితో చంపేస్తానని బెదిరిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని సతారాలో 10వ తరగతిలో చదివే బాలిక, తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందని, ఒక 18 ఏళ్ల ముస్లిం యువకుడు ఆమె బడి నుంచి తిరిగి వచ్చే సమయంలో అడ్డుకుని ఈ విధంగా కత్తితో బెదిరించాడని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహారాష్ట్రలోని సతారాలో, 10వ తరగతిలో చదివే ఒక బాలిక, తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందని, ఒక ముస్లిం యువకుడు తన గొంతు కోయడానికి ప్రయత్నించిన వీడియో.

ఫ్యాక్ట్ (నిజం): ఈ సంఘటన 21 జూలై 2025న మహారాష్ట్రలోని సతారా నగరంలోని బసప్ప పేట్‌లో జరిగింది, నిందితుడి పేరు ఆర్యన్ వాఘ్మలే. ఆర్యన్ వాఘ్మలే ముస్లిం కాదని, హిందువు అని పోలీస్ అధికారులు నిర్ధారించారు, ఈ కేసులో ఎటువంటి మతపరమైన కోణం లేదు. కావున, పోస్ట్‌లో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, ముందుగా, వైరల్ వీడియోలోని కొన్ని కీఫ్రేమ్‌లు ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చూసాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ సంఘటనకు సంబంధించిన అనేక వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన 21 జూలై 2025న మహారాష్ట్రలోని సతారా నగరంలోని బసప్ప పేట్ ప్రాంతంలో జరిగింది. ఆ రోజు ఉదయం, ఒక మైనర్ బాలికను గత కొద్ది కాలంగా ప్రేమిస్తున్న (one-side lover) ఒక యువకుడు, కత్తితో బెదిరించి పట్టుకున్నాడు. ఇది ఆ ప్రాంతంలో భయాందోళనలను రేకెత్తించింది. చుట్టూ గుమిగూడిన జనం, సతారా నగర పోలీసుల చాకచక్యం వల్ల, ఆ బాలిక సురక్షితంగా కాపాడబడింది. యువకుడి నుండి బాలికను కాపాడిన తర్వాత, అక్కడ ఉన్న జనం అతన్ని కొట్టారు.

సతారా పోలీస్ ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), నిందితుడు పేరు ఆర్యన్ వాఘ్మలే. అతనిపై పోక్సో చట్టం, ఆయుధ చట్టం, లైంగిక వేధింపులు, ఉద్దేశపూర్వకంగా గాయపరచడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్యన్ ఆ బాలికని ప్రేమించాడని చెప్తూ గత కొద్ది కాలంగా వెంటబడుతున్నాడని వార్తా కథనాలు పేర్కొన్నాయి. దీని గురుంచి ఆమె కుటుంబం హెచ్చరికలు ఇచ్చినా కూడా వినకుండా, 21 జూలై 2025 నాడు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తున్న బాలికని, ఆర్యన్ ఆమె నివాసం సమీపంలో అడ్డుకుని, వైరల్ వీడియోలో కనిపిస్తున్నట్లు కత్తి పట్టుకుని బెదిరించాడు. కానీ పక్కనే ఉన్న ఒక డాక్టర్ సకాలంలో జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడింది. 

ఈ కేసు గురించి మరిన్ని వివరాల కోసం, మేము ఈ కేసు దర్యాప్తు అధికారి, షాహుపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పి.సి. బాబర్‌ను సంప్రదించాము. వైరల్ క్లెయిములో చెప్తున్నట్లు నిందితుడు ముస్లిం కాదని, హిందువు అని ఆమె మాకు తెలిపింది. అలాగే, ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని ఆమె స్పష్టం చేసింది.  బాధితురాలు 14 ఏళ్ల మైనర్ అని, పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నెంబర్ 201 నమోదు చేయబడింది ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది.

చివరగా, మహారాష్ట్రలో మైనర్ బాలికను కత్తితో బెదిరించిన ఈ సంఘటనలో నిందితుడు వైరల్ పోస్టులో చెప్తున్నట్లు ముస్లిం కాదు, ఇతను ఆర్యన్ వాఘ్మలే అనే హిందూ వ్యక్తి.