NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ నిందితుల్లో కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇతర మతాల వారూ ఉన్నారు

ఇటీవల NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈ పేపర్ లీక్ కేసులో నిందితులు అందరు ముస్లింలే అని ఆరోపిస్తున్న పోస్ట్ ఒకటి సోషల్  మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. హుస్సేన్,  ఇంతియాజ్ ఆలం, జమాలుద్దీన్, సలావుద్దీన్ పేరుగల నిందితులు పేపర్ లీక్ చేసినట్టు వారి ఫోటోలు కూడా ఈ పోస్ట్‌లో షేర్ చేసారు. ఈ కథనం ద్వారా ఈ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ కేసులో నిందితులు అందరు ముస్లింలే.

ఫాక్ట్(నిజం): NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంలో అనుమానితులుగా భావిస్తూ CBI చేసిన అరెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ ప్రకారం నిందితుల్లో ముస్లింలు, హిందువులు, ఇతర మతాలకు చెందిన వారు ఉన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ కేసు నిందితుల్లో ముస్లింలు ఉన్నప్పిటికీ, వీరు కాకుండా నిందితుల్లో హిందువులు కూడా ఉన్నారు. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తకు సంబంధించి మరింత సమాచారం కోసం కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ కేసుకు సంబంధించి CBI పలువురిని అరెస్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

జమాలుద్దీన్ అన్సారీ అనే జర్నలిస్టు; జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒయాసిస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎహసానుల్ హక్ మరియు అదే పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఇంతియాజ్ ఆలంను CBI ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేసినట్టు ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఐతే కేవలం వీరినే కాకుండా, ఈ కేసుకు సంబంధించి CBI మరికొందరిని కూడా అరెస్ట్ చేసింది. గుజరాత్‌కు చెందిన  జే జలరామ్ స్కూల్ యజమాని దీక్షిత్ పటేల్,  ప్రిన్సిపాల్ పురుషోత్తం శర్మ, టీచర్ తుషార్ భట్, అలాగే మధ్యవర్తిగా వ్యవహరించిన విభోర్ ఆనంద్‌ను అరెస్ట్ చేసినట్టు ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి. వీరి పేర్ల బట్టి వీరు హిందువులు అని స్పష్టంగా అర్ధమవుతుంది.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు నిందితులుగా పరిగణించిన వారి పూర్తి  జాబితాను ఇక్కడ చూడొచ్చు. ఈ లిస్ట్‌లో చాలా వరకు హిందువుల పేర్లు ఉండడం గమనించొచ్చు. ఈ కథనం ప్రకారం ఈ వ్యవహారంలో కీలక పాత్రదారిగా భావిస్తున్న అమన్ సింగ్ అనే వ్యక్తిని CBI అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీన్నిబట్టి పోస్టులో ఆరోపిస్తున్నట్టు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా హిందువులు మరియు ఇతర మతాలకు చెందినవారు కూడా ఉన్నారని స్పష్టమవుతుంది (ఇక్కడ & ఇక్కడ).

చివరగా, NEET(UG) 2024 పరీక్ష పేపర్ లీక్ నిందితుల్లో కేవలం ముస్లింలు మాత్రమే కాదు, ఇతర మతాల వారూ ఉన్నారు.