పూణేలో రైలులో సీటుకు సంబంధించి ఒక చిన్న సమస్యపై 12 మంది ముస్లింలు హిందూ భార్య, భర్తని పిల్లల ముందు కొట్టారని చెప్తూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: పూణేలో రైలులో సీటుకు సంబంధించి తలెత్తిన వివాదంలో 12 మంది ముస్లింలు హిందూ భార్య, భర్తని కొట్టారు.
ఫాక్ట్ (నిజం): ‘ముంబై-లాతూర్-బీదర్’ ఎక్స్‌ప్రెస్ రైలు లో పూణే వద్ద సీటుకి సంబంధించి తలెత్తిన వివాదంలో ‘సాగర్ జనార్దన్ మర్కాడ్’ అనే వ్యక్తిని కొట్టిన 12 మంది హిందువులే. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
పోస్టులోని విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, ‘Pune Mirror’ కథనం లభించింది. దాని ప్రకారం, ‘13 ఫిబ్రవరి 2020’ న ‘ముంబై-లాతూర్-బీదర్’ ఎక్స్‌ప్రెస్ రైలు లో పూణే వద్ద సీటుకి సంబంధించి ‘సాగర్ జనార్దన్ మర్కాడ్’ అనే వ్యక్తికి మరియు ఒక మహిళకి వివాదం తలెత్తింది. దాంతో, ఆ రైలు లో ఉన్న సహప్రయాణికులు సాగర్ ని కొట్టడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఆ ఘటనలో 12 మందిని (ఒకరు మైనర్) అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. ఆ కథనంలో ఎక్కడా కూడా దాడి చేసిన వ్యక్తులు ముస్లింలు అని పేర్కొనలేదు. ఆ ఘటనకి సంబంధించిన మరికొన్ని న్యూస్ రిపోర్ట్స్ చూసినా అదే విషయం తెలుస్తుంది.
పోస్టులోని విషయమే ట్విట్టర్ లో కూడా వైరల్అ యినప్పుడు, అది తప్పని పేర్కొంటూ ‘Central Railway’ వారు ట్వీట్ చేసి, ఆ వివాదంలో అరెస్ట్ కాబడిన వ్యక్తుల పేర్లను అందులో పెట్టారు. ఆ పేర్లలో ముస్లిం పేర్లు లేనట్టు చూడవొచ్చు.
చివరగా, రైలు లో సీటుకి సంబంధించి పూణే లో తలెత్తిన వివాదంలో వ్యక్తి పై దాడి చేసిన వారందరూ హిందువులే.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?