గత అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించినందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ కి 15 ఎకరాల 25 గుంటల భూమిని బహుమతి గా ఇచ్చారని చెప్తూ ఒక భూమి రికార్డు ఫోటోని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: గత అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించినందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ కి 15 ఎకరాల 25 గుంటల భూమిని బహుమతి గా ఇచ్చారు.
ఫాక్ట్ (నిజం): 2013-14 సమయంలో రజత్ కుమార్ కొన్న భూమి యొక్క రికార్డు ఫోటోని పెట్టి తాజాగా ఎన్నికల్లో తాను ఒక పార్టీకి సహకరించినందుకు ఆ భూమిని బహుమతిగా పొందినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. ఈ విషయం పై సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న తప్పుడు మెసేజుల పై సైబర్ క్రైమ్ వారికి రజత్ కుమార్ ఫిర్యాదు కూడా చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
ఫోటోలో ఇచ్చిన వివరాలతో తెలంగాణ ల్యాండ్ రికార్డుల వెబ్ సైట్ లో వెతకగా, నిజంగానే రజత్ కుమార్ పేరు మీద పోస్ట్ లో ఇచ్చిన భూమి ఉన్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ భూమిని తను 2013-14 మధ్య కొన్నానని, సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫేక్ మెసేజ్ పై తగిన చర్యలు తీసుకోమని సైబర్ క్రైమ్ వారికి రజత్ కుమార్ రాసిన ఉత్తరాన్ని కింద చూడవొచ్చు.
ఐఏఎస్ ఆఫీసర్ల ఆస్తుల వివరాలను భారత ప్రభుత్వ ఈ వెబ్ సైట్ లో చూడవొచ్చు. ప్రతి ఏడాది, IAS ఆఫీసర్లు తమ ఆస్తుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. కావున, 2013 మరియు 2014 లలో రజత్ కుమార్ యొక్క ఆస్తి వివరాలు చూస్తే 2013 మరియు 2014 మధ్య లోనే తను మహబూబ్ నగర్ లో 15 ఎకరాల 15 గుంటల భూమిని కొన్నట్టు తెలుస్తుంది. తన పేరు మీద ఇంకో పది గుంటల భూమిని 2016 సంవత్సరంలో కొన్నట్టు చూడవొచ్చు.
చివరగా, ‘ఎన్నికల్లో సహకరించినందుకు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ కి 15 ఎకరాల 25 గుంటల భూమి బహుమతి’ అని వస్తున్న వార్తల్లో నిజం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఎన్నికల అధికారి రజత్ కుమార్ కి 15 ఎకరాల భూమి కొన్నది 2013లో - Fact Checking Tools | Factbase.us