Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (విపత్తు నిధి) లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది

0

గుట్టు రట్టు…దొరికిపోయిన కేసీఆర్’ అని చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, కోవిడ్-19 వ్యాధిని అరికట్టడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 500  కోట్ల రూపాయల ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డిసాస్టర్ ఫండ్ కింద ఇచ్చిందని, ఆ విషయం ప్రజలకు తెలియకూడదని రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ. మీద నెంబర్ కూడా ఇవ్వలేదని చెప్తాడు. అతని మాటల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్-19 వ్యాధిని అరికట్టడానికి కేసీఆర్ ప్రకటించిన 500  కోట్ల రూపాయల ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డిసాస్టర్ ఫండ్ కింద ఇచ్చింది.

ఫాక్ట్ (నిజం): SDRF ఫండ్ కి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు నిధులు ఇస్తాయి. తెలంగాణ కి కేటాయించిన SDRF ఫండ్ నుండి గరిష్టంగా 35 శాతం మాత్రమే (25 శాతం క్వారెన్టైన్, శాంపిల్ కలెక్షన్ మరియు స్క్రీనింగ్ కి, 10 శాతం ఎక్విప్మెంట్ కి) కోవిడ్-19 నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించాలని హోం శాఖ సర్కులర్ లో చూడవొచ్చు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడితే, వాటికి తమ సొంత వనరులు ఉపయోగించాలని హోం శాఖ తెలిపింది. అంతేకాదు, జీ.ఓ. మీద నెంబర్ ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియోలో చెప్పిన జీ.ఓ. ని తెలంగాణ ప్రభుత్వ వెబ్సైటులో చూడవొచ్చు. ఆ జీ.ఓ. మీద నెంబర్ లేదని వీడియోలోని వ్యక్తి చెప్తాడు, కానీ ఆ జీ.ఓ. పై నెంబర్ ఉన్నట్టు తెలుస్తుంది. కోవిడ్-19 వ్యాధిని అరికట్టడానికి 500  కోట్ల రూపాయల ఫండ్ ని కేసీఆర్ ప్రకటించినట్టు కూడా ఆ జీ.ఓ. లో చూడవొచ్చు.

వీడియోలో చెప్పిన డిసాస్టర్ ఫండ్ గురించి మరింత సమాచారం కోసం వెతకగా, ‘స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ (SDRF) అనేది నోటిఫైడ్ విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్రాల దగ్గర ఉండే ప్రాథమిక ఫండ్ అని తెలుస్తుంది. అయితే, ఆ ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ప్రతి రాష్ట్రానికి కేటాయించిన ఫండ్ లో 75 శాతం కేంద్ర ప్రభుత్వం మరియు 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయి. (స్పెషల్ కాటేగోరి రాష్ట్రాలకి ఇది 90:10 ఉంటుంది). కావున, SDRF ఫండ్ కి కేవలం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు.

2020-21 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ SDRMF (స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ ఫండ్) (దీంట్లో 80 శాతం SDRF మరియు 20 శాతం SDMF (స్టేట్ డిసాస్టర్ మిటిగేషన్ ఫండ్) ఉండాలని 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది) ఫండ్ కి సుమారు 600 కోట్లు కేటాయించాలని 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం షేర్ 449 కోట్లు మరియు రాష్ట్ర ప్రభుత్వం షేర్ 150 కోట్లు. 15వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సిఫరసుని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ, వేటికి ఆ ఫండ్ ఉపయోగించాలో నిర్ణయించడానికి తాజాగా ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. గత సంవత్సరంలో కేటాయించిన ఫండ్ వివరాలు ఇక్కడ చూడవొచ్చు.

తెలంగాణ కి కేటాయించిన SDRMF ఫండ్ లో SDRF ఫండ్ కోసం ఉన్నది సుమారు 480 కోట్లు (SDRMF లో 80 శాతం). ఆ ఫండ్ నుండి గరిష్టంగా 35 శాతం మాత్రమే (25 శాతం క్వారెన్టైన్, శాంపిల్ కలెక్షన్ మరియు స్క్రీనింగ్ కి, 10 శాతం ఎక్విప్మెంట్ కి) కోవిడ్-19 నివారణకు ఉపయోగించాలని హోం శాఖ సర్కులర్ లో చూడవొచ్చు. అంతకు మించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడితే, వాటికి తమ సొంత వనరులు ఉపయోగించాలని హోం శాఖ తెలిపింది. అంటే, కేసీఆర్ ప్రకటించిన 500 కోట్ల ఫండ్ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. అంతే కాదు, SDRF నుంచి హోమ్ శాఖ సర్కులర్ ప్రకారం కేవలం 170 కోట్ల వరకు మాత్రమే కోవిడ్-19 నివారణకు ఉపయోగించొచ్చు. దీని కంటే ఎంత ఎక్కువ ఖర్చు అయినా కూడా అదంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.

హోం శాఖ ఇచ్చిన సర్కులర్ పై ప్రధాన మంత్రి కి కేరళ ముఖ్యమంత్రి రాసిన లేఖను ఇక్కడ చూడవొచ్చు. మొదట జారీ చేసిన సర్కులర్ లో ఉన్న రెండు క్లాజులు (కోవిడ్-19 వల్ల చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి పరిహారం మరియు  కోవిడ్-19 వచ్చిన వారి వైద్యానికి SDRF ఫండ్ ఉపయోగించోచ్చని) తిరిగి తాజా సర్కులర్ లో జోడించాలని కేరళ ముఖ్యమంత్రి కోరారు.

చివరగా, కోవిడ్-19 ని అరికట్టడానికి కేసీఆర్ ప్రకటించిన 500  కోట్ల రూపాయల ఫండ్ ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (విపత్తు నిధి) లో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll