వేడి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయని టాటా మెమోరియల్ హాస్పిటల్ ప్రకటించలేదు

వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్‌ కణాలను చంపుతాయని, వేడి కొబ్బరి రసం అల్సర్, ట్యూమర్లపై ప్రభావం చూపుతాయని, ఇది వైద్య రంగంలో సరికొత్త పురోగతి అని టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ‘రాజేంద్ర ఏ.’ చెప్పారని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఇదే విషయం ఉన్న కొన్ని ఆంగ్ల పోస్టులలో ఆ డాక్టర్ పేరు Dr. Rajendra A. Badwe అని ఉంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: టాటా మెమోరియల్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ‘రాజేంద్ర ఏ.’ వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్ కణాలను చంపుతాయని ఒక మెసేజిలో తెలిపారు.

ఫ్యాక్ట్(నిజం): ఈ వైరల్ సందేశాన్ని డాక్టర్ రాజేంద్ర ఇవ్వలేదని, అలాగే వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్‌ను నయం చేయగలవని సూచించడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని టాటా మెమోరియల్ హాస్పిటల్ స్పష్టం చేసింది. పలు వార్తా సంస్థలు కూడా ఇదే విషయాన్ని రిపోర్ట్ చేశాయి. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికాము. ఈ సెర్చ్ ద్వారా, ఈ క్లెయిమ్‌కు సంబంధించిన 2019 నాటి కొన్ని వార్తా కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). టైమ్స్ నౌ వారి ఒక కథనం ప్రకారం, టాటా మెమోరియల్ హాస్పిటల్ వారు డాక్టర్ రాజేంద్ర బద్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసెజ్‌లో చెప్తున్న విషయాన్ని అనలేదని స్పష్టం చేశారు. అలాగే, ఈ క్లెయిమ్ అశాస్త్రీయం అని, వేడి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల క్యాన్సర్ నయం అవుతుందని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కూడా వారు తెలిపారు. 

ఇదే విషయంపై, ది హిందూ వారి ఒక వార్తా కథనం ప్రకారం, టాటా మెమోరియల్ హాస్పిటల్ వైరల్ సందేశానికి, తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఈ సందేశంలో ఉన్న సమాచారం తప్పని, వేడి కొబ్బరి నీరు ఏ రకమైన క్యాన్సర్‌కైనా నివారణను అందించగలదని సూచించడానికి ఎటువంటి డేటా లేదని వారు ఒక వివరణ ఇచ్చారు.

దీనికి సంబంధించన మరింత సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, టాటా మెమోరియల్ హాస్పిటల్ వారు జారీ చేసిన పత్రికా ప్రకటన (Press release) అని చెప్తున్న ఫేస్‌బుక్ పోస్ట్ ఒకటి మాకు లభించింది. అందులో డాక్టర్ బద్వే ఇంకా టాటా మెమోరియల్ హాస్పిటల్, ఇద్దరూ, వేడి కొబ్బరి నీరు క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదనే వాదనను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.

అయితే, ఈ పత్రికా ప్రకటన యొక్క ప్రామాణికతను మేము స్వతంత్రంగా వెరిఫై చేయలేకపోయాము. అదనంగా, వేడి కొబ్బరి నీరు క్యాన్సర్‌ను నయం చేస్తుందనే విషయం గురించి మాకు ఏ ప్రసిద్ధ వైద్య జర్నల్స్ లో కూడా విశ్వసనీయ సమాచారం లభించలేదు.

చివరగా, వేడి కొబ్బరి నీళ్లు క్యాన్సర్ కణాలను చంపుతాయని డాక్టర్ రాజేంద్ర బాద్వే గానీ, టాటా మెమోరియల్ హాస్పిటల్ గానీ చెప్పలేదు.