భారత జాతీయ జెండా రంగులతో సూర్య నమస్కారం చేస్తున్న ఈ వీడియోకి టోక్యో ఒలింపిక్స్‌తో సంబంధం లేదు

జపాన్ ‘టోక్యో ఒలంపిక్స్ 2020’ ఓపెనింగ్ కార్యక్రమంలో భారత జాతీయ జెండా రంగులతో కూడిన డ్రెస్ వేసుకొని సూర్య నమస్కారాలు చేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘టోక్యో ఒలంపిక్స్ 2020’ ఓపెనింగ్ సెర్మనీలో భారత జాతీయ జెండా రంగులతో కూడిన డ్రెస్ వేసుకొని సూర్య నమస్కారాలు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, మంగోలియా దేశంలో ‘Art of Living’ సంస్థ వారు నిర్వహించిన ఒక పాత వేడుకకి సంబంధించింది. 2015లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా తొలిసారి మంగోలియా దేశంలో పర్యటించిన సందర్భంగా, ‘Art of Living’ సంస్థ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వీడియో ‘టోక్యో ఒలంపిక్స్ 2020’కి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని కొంత మంది సోషల్ మీడియా షేర్ చేస్తూ, వీడియోలోని వేడుక మంగోలియా దేశంలో జరిగినట్టు తెలిపారు.  ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో గుగూల్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన మరింత వ్యవధి గల వీడియోలని  ‘నరేంద్ర మోదీ’ మరియు ‘PMO India’ అధికారిక యూట్యూబ్ చానెల్స్ 2015లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.  నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్లో, ఈ వీడియోని “PM Modi at the Community Reception & Yoga Event organised by ‘Art of Living’in Mongolia”, అనే టైటిల్ తో పబ్లిష్ చేసారు.   

నరేంద్ర మోదీ భారత ప్రధానిగా తొలిసారి మంగోలియా దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా, ‘Art of Living’ సంస్థ ఈ వేడుకని మంగోలియా దేశంలోని Buyant Ukhaa స్టేడియంలో నిర్వహించారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించే విధంగా భారతీయ నాట్య కళలు, యోగా మరియు సూర్య నమస్కారాలని ఈ వేడుకలో ప్రదర్శించారు. 2015 మే నెలలో జరిగిన ఈ వేడుకకి సంబంధించి నరేంద్ర మోదీ మరియు ‘PMO India’ పెట్టిన ట్వీట్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

ఈ వేడుకకి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, మంగోలియా దేశంలో జరిగిన ఒక పాత వేడుక వీడియోని ‘టోక్యో ఒలంపిక్స్ 2020’ ఓపెనింగ్ సెర్మనీ లో సూర్య నమస్కారాలు చేస్తున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.