Fake News, Telugu
 

తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని 15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు

0

‘తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని 15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని 15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది.

ఫాక్ట్ (నిజం): తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు 15 మీడియా ఛానెళ్లకు నోటీసులు జారీ చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు. కాకపోతే గతంలో పలు సందర్భాల్లో తబ్లిగి జమాత్‌ వ్యవహారంలో ప్రభుత్వాలు, మీడియా సంస్థల వ్యవహార శైలిని తప్పుబడుతూ సుప్రీంకోర్టు, పలు రాష్ట్ర హైకోర్టులు తీవ్రంగా స్పందించాయి. టైమ్స్ నౌ, టీవీ 18 కన్నడ మరియు సువర్ణ న్యూస్ అనే మూడు న్యూస్ ఛానెళ్లను తబ్లిగి జమాత్‌ను లక్ష్యంగా చేసుకొని కథనాలు ప్రసారం చేసినందుకు నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (NBSA) ఈ మూడు ఛానెళ్లకు ఫైన్ విధించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు 15 మీడియా ఛానెళ్లకు నోటీసులు జారీ చేసినట్టు వార్తా సంస్థలు రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ సుప్రీంకోర్టు నిజంగానే ఇలా ఆదేశించి ఉంటే మీడియా కచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేది.

ఐతే గతంలో సుప్రీంకోర్టు, పలు రాష్ట్ర హైకోర్టులు తబ్లిగి జమాత్‌కు సంబంధించి  కేంద్ర ప్రభుత్వం, మీడియా సంస్థలపై తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఉదాహారణకి జనవరి 2021లో తబ్లిగి జమాత్‌కు సంబంధించి పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తబ్లిగి జమాత్‌కు సంబంధించి హింసను ప్రేరేపించేలా వార్తా కథనాలు మరియు టెలివిజన్ కార్యక్రమాలు ప్రసారమైన నేపథ్యంలో వీటిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించింది.

జూన్ 2021 లో మరొక సందర్భంలో విద్వేశాపురిత ప్రసంగాల విషయంలో వచ్చిన కంప్లైంట్స్ పై స్పందిస్తూ నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ టైమ్స్ నౌ, టీవీ 18 కన్నడ మరియు సువర్ణ న్యూస్ అనే మూడు న్యూస్ ఛానెళ్లను తబ్లిగి జమాత్‌ను లక్ష్యంగా చేసుకొని కథనాలు ప్రసారం చేసినందుకు తీవ్రంగా మందలించింది. అలగే బ్రాడ్కాస్టర్లపై ఒక లక్ష రూపాయలు ఫైన్ విధించి, బ్రాడ్‌కాస్టింగ్ ప్రమాణాలను మరియు నైతిక నియమావళిని ఉల్లంఘించినందుకు జూన్ 23న ఛానెళ్లలో క్షమాపణ ప్రసారం చేయాలనీ ఆదేశించింది. సువర్ణ న్యూస్ ఛానల్ పై ఇదే విషయంలో రూ. 50,000 ఫైన్ విధించింది.

అలాగే గతంలో బొంబాయి, ఢిల్లీ మొదలైన పలు రాష్ట్ర హైకోర్టులు తబ్లిగి జమాత్‌ వ్యవహారంలో ప్రభుత్వాలు మరియు మీడియా సంస్థల వ్యవహార శైలిని తప్పుబడుతూ తీర్పులు చెప్పిన సందర్భాలు ఉన్నప్పటికీ (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ), పోస్టులో చెప్పినట్టు తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని 15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసినట్టు మాత్రం ఎటువంటి సమాచారం లేదు.

చివరగా, తబ్లిగి జమాత్‌కు క్షమాపణ చెప్పాలని15 మీడియా ఛానెళ్లకు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసినట్టు ఎటువంటి సమాచారం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll