బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ కి 45 కోట్ల సాయం అందించలేదు

పాకిస్తాన్ దేశానికి షారుఖ్ ఖాన్ 45 కోట్ల సాయం చేసినందుకు గాను ఆయన నటిస్తున్న ‘పఠాన్’ అనే చిత్రాన్ని మనం బహిష్కరించి బుద్ధిచేప్పాలంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

     ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బాలీవుడ్ నటుడుషారుఖ్ ఖాన్ పాకిస్తాన్ దేశానికి 45 కోట్ల సాయం అందించారు.

ఫాక్ట్ (నిజం): పాకిస్తాన్ లో జరిగిన ఒక ఆయిల్ టాంకర్ ప్రమాదంలో మరణించినవారికి షారుఖ్ ఖాన్ 45 కోట్ల సాయం అందించాడని వస్తున్న వార్తలు తప్పు అని ‘INDIA TV’ ఛానల్ వారు తమ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియో పోస్ట్ చేసారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ గురించి గూగుల్ లో వెతకగా, ఈ క్లెయిమ్ కు సంబంధించి ‘INDIA TV’ వారు ‘4 జూలై 2014’ నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన ఒక వీడియో దొరికింది. పాకిస్తాన్ లో జరిగిన ఒక ఆయిల్ టాంకర్ ప్రమాదంలో క్షతగాత్రులు అయిన వారికి షారుఖ్ ఖాన్ 45 కోట్ల సాయం అందిస్తున్నారని వస్తున్న న్యూస్ తప్పు అని అందులో తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ‘INDIA TV’ రిపోర్టర్ షారుఖ్ ఖాన్ మీడియా టీం ని సంప్రదించగా ఈ న్యూస్ లో ఎలాంటి వాస్తవాలు లేవు అని వారు తెలిపారు.

‘INDIA TV’ వెబ్ సైట్ వారు పోస్ట్ చేసిన ఈ వీడియో లోని ఒక క్లిప్ ని చూపిస్తూ షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ కి 45 కోట్లు సాయం అందించాడని షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పాకిస్తాన్ దేశానికి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 45 కోట్ల సాయం అందించలేదు.