ఒక ముస్లిం వ్యక్తి (తలకి టోపీ వేసుకుని ఉన్నాడు) ఒక ఇంటి ముందుకి అడుక్కోవడానికి వెళ్లి, ఆ ఇంట్లో నుంచి ఒక కుక్క రాగానే, దాన్ని చూసి పరిగెత్తుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది. ఈ వీడియోలో, తన కాళ్లకు, చేతులకు కట్లు ఉండటం, అతను ఒక తోపుడు బండిలో రావడం మనం చూడవచ్చు. తను కాళ్లు చేతులు విరిగిన వాడిలా నటిస్తూ, కుక్కని చూడగానే పరిగెత్తాడు అని చెప్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు, అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: కాళ్లు చేతులు విరిగిన వాడిగా నటిస్తూ భిక్షాటన చేస్తూ, పట్టుబడ్డ ఒక ముస్లిం వ్యక్తి వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఇది నిజమైన సంఘటన కాదు, స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని ‘Bindas Fun Joke’ అనే యూట్యూబ్ ఛానల్ వారు తయారు చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ముందుగా, వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా, ఇదే వీడియో ఉన్న కొన్ని సోషల్ మీడియా పోస్టులు (ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఈ పోస్టులలో ఉన్న వీడియోలో, కింద భాగంలో ఉన్న వాటర్ మార్క్ సరిగ్గా కనిపిస్తుంది, వైరల్ వీడియోలో ఇది మసకగా ఉంది. యూట్యూబ్, ఫేస్‌బుక్ లోగోతో పాటు ‘BindasFunJOKE’ అనే టెక్స్ట్ అక్కడ అది.
దీన్ని క్లూ గా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ‘Bindas Fun Joke’ అనే పేరు గల యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్‌బుక్ పేజీలు మాకు లభించాయి. వీటిల్లో ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ 18 జనవరి 2025న అప్లోడ్ చేశారు (ఇక్కడ, ఇక్కడ (ఆర్కైవ్ లింక్)).
అయితే ‘Bindas Fun Joke’ యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్ పేజి వారు స్క్రిప్ట్ చేసి షూట్ చేసిన ఫిక్షనల్ వీడియోలను అప్లోడ్ చేస్తారు అని మేము తెలుసుకున్నాం. వీరి ఫేస్‌బుక్ పేజి యొక్క పరిచయ భాగంలో ఈ వీడియో(లు) కేవలం వినోదం కోసం తయారు చేశారు అని, ఇందులోని పాత్రలు, సంఘటనలు అన్ని కల్పితం అని ఒక వివరణ ఉంది.
ఇదే వివరణ ఈ వీడియో ఉన్న యూట్యూబ్ పోస్ట్ యొక్క వివరణలో కూడా ఉంది. దీన్ని బట్టి ఇది నిజమైన సంఘటన కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ‘Bindas Fun Joke’ వారు అప్లోడ్ చేసిన ఇలాంటి మరిన్ని కల్పిత, స్క్రిప్టెడ్ వీడియోలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
చివరగా, భిక్షాటన చేస్తున్న ఒక ముస్లిం వ్యక్తి, కాళ్లు చేతులు విరిగిన వాడిలా నటిస్తూ పట్టుబడ్డ వీడియో అని చెప్తూ ఒక స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నారు.