‘చెరువులో వయాగ్రా… వేల గొర్రెలు తహతహ!’ అంటూ వైరల్ అయిన వార్తలో ఎటువంటి నిజం లేదు

ఐర్లాండ్‌లో ఫిజర్ అనే ఫార్మా కంపెనీ శుద్ధి చేయని 755 టన్నుల వయాగ్రాను చెరువులో వేయడంతో అక్కడి గొర్రెల కాపర్లకు కష్టకాలం వచ్చింది. ఆ చెరువులో నీళ్లు తాగిన 80 వేల గొర్రెలు వయాగ్రా వేసుకున్న మనుషుల వలే తోడు కోసం తహతహ లాడాయి” అంటూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వయాగ్రాను చెరువులో వేయడంతో, ఆ నీళ్లు తాగిన 80 వేల గొర్రెలు తహతహలాడాయి.

ఫాక్ట్ (నిజం): వ్యంగ్యంగా వార్తలు రాసే ‘World News Daily Report’ అనే వెబ్ సైట్ వారు పెట్టిన కల్పిత వార్తను తీసుకొని, నిజంగా జరిగినట్టు ప్రచారం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగా, ఆ లింక్ లో పెట్టిన ఆర్టికల్ ఇప్పుడు లేదు. కావున, ఈ విషయం గురించి గూగుల్ లో వెతకగా, ప్రముఖ వార్తాసంస్థలు [ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్డ్) మరియు AP 24×7 (ఆర్కైవ్డ్)] కూడా ఈ వార్త ను ప్రచురించినట్టు తెలుస్తుంది.

ఈ వార్తను మొదటిగా ‘World News Daily Report’ అనే వార్తాసంస్థ ప్రచురించినట్టుగా సెర్చ్ రిజల్ట్స్ లో చూడవొచ్చు. తాము రాసిన ఆర్టికల్ ని ఫేస్బుక్ లో నవంబర్ 26 న (తెలుగు వార్తాసంస్థలు డిసెంబర్ లో ప్రచురించారు) పోస్ట్ చేసారు. ఇంగ్లీష్ వార్తాపత్రిక ‘Outlook’ వారు రాసిన ఆర్టికల్ లో కూడా ఈ వార్తను  ‘World News Daily Report’ వారి ఆర్టికల్ నుండి తీసుకున్నట్టుగా ఉంటుంది.

‘World News Daily Report’ వారి ‘About’ సెక్షన్ లో అది ఒక ‘satirical news’ (వ్యంగంగా వార్తలు రాసే) వెబ్ సైట్ అని చూడవొచ్చు. ఇదే విషయం వారి వెబ్ సైట్ లో కూడా చూడవొచ్చు. కావున, వారు రాసిన ఆర్టికల్లను నిజమైనవిగా భావించలేము.

చివరగా, ‘చెరువులో వయాగ్రా… వేల గొర్రెలు తహతహ!’ అంటూ వైరల్ అయిన వార్తలో ఎటువంటి నిజం లేదు. అదే విషయాన్ని బ్రిటన్ కి చెందిన ‘డైలీ మెయిల్’ వార్తా సంస్థ కూడా ధ్రువపరిచింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?