ఒక సెటైరికల్ వెబ్సైటు రాసిన వార్తని, 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్ అని షేర్ చేస్తున్నారు

“ఒకరు కాదు.. ఇద్దరు కాదు..ఏకంగా 800 మందికి తండ్రయ్యాడు.. అతడేమీ అందగాడు కాదు.. కేవలం మిల్క్‌ డెలివరీ బాయ్‌.. అలా ఆడాళ్లు దగ్గరయ్యాడు.. అప్పట్లో డీఎన్‌ఏ లాంటి టెస్టులు లేవు” అంటూ ఒక వార్తని చాలా వార్త సంస్థలు పబ్లిష్ చేసాయి. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం.

YouTube Poster
దీని ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు

క్లెయిమ్: దక్షిణ కాలిఫోర్నియా శాన్ డియాగో ప్రాంతంలో 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్.

ఫాక్ట్ (నిజం): ఇది నిజమైన వార్త కాదు. ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ అనే ఒక వ్యంగ్యపు వార్తలు రాసే వెబ్సైటు ఈ వార్తని 24 డిసెంబర్ 2021న పబ్లిష్ చేసింది. అక్కడ నుండి చాలా మంది ఇది నిజం అనుకొని పబ్లిష్ చేసారు. ఆర్టికల్ లో ఇచ్చిన ఫోటో కూడా ‘రాండాల్ జెఫ్రీస్’ అనే వ్యక్తిది కాదు. ఈ ఫోటో ఒక స్టాక్ ఫోటో వెబ్సైటు నుండి తీసుకున్నది. కావున ఆర్టికల్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన వార్త గురించి వివరాల కోసం గూగుల్‌లో వెతికితే ఈ వార్తను అందరికంటే ముందుగా ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ అనే వెబ్సైట్ 24 డిసెంబర్ 2021న ప్రచురించినట్టు తెలిసింది. కానీ ప్రముఖ వార్తా సంస్థలు లేదా వెబ్సైట్లు ఇటువంటి వార్తను ఎక్కడా పబ్లిష్ చేయలేదు. ఇలాంటి సంఘటన నిజంగానే జరిగి ఉంటే ప్రపంచంలోని అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ వార్తను ప్రచురించేవి, కానీ అలా జరగలేదు. అసలు ‘రాండాల్ జెఫ్రీస్’ అనే వ్యక్తి పేరుతో ఎలాంటి వార్తా కథనాలు లేవు.

అయితే ఈ వార్తను మొదట పబ్లిష్ చేసిన ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ వెబ్సైట్ వివరాల కోసం వెతికితే, ఈ వెబ్సైట్ కల్పిత కథలను హాస్యం మరియు వ్యంగ్యం కోసం ప్రచురిస్తుందని వెబ్సైట్ వివరణలో పేర్కొన్నారు. అలానే తమ ఆర్టికల్‌లలో పేర్కొన్న పేర్లు నిజమైనవి కావని, కేవలం కల్పిత పేర్లు అని కూడా పేర్కొన్నారు. ఈ వివరాల ఆధారంగా ‘డైలీ న్యూస్ రిపోర్టడ్’ వెబ్సైట్ ప్రచురించిన ఈ కథనం నిజంగా జరిగిన సంఘటన కాదని కచ్చితంగా చెప్పవొచ్చు.

ఆర్టికల్‌లో ప్రచురించిన ‘మిల్క్ మాన్’ వ్యక్తి ఫోటో కోసం వెతికితే, అది ఒక స్టాక్ ఫోటో వెబ్సైటు నుండి తీసుకున్నట్టు తెలిసింది. ఇదే వార్తను ఒక వీడియో రూపంలో కూడా పబ్లిష్ చేసారు. ఇందులో ‘మిల్క్ మాన్’ యొక్క చాలా ఫొటోలు చూపించారు. కానీ, ఇవన్నీ కూడా వేరు వేరు వెబ్సైట్లు మరియు స్టాక్ ఫోటో వెబ్సైట్ల నుంచి తీసుకున్నట్టు తెలిసింది. ఇవి ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఒక సెటైరికల్ వెబ్సైటు రాసిన వ్యంగ్యపు కథనాన్ని పట్టుకొని 800 మందికి తండ్రి అయిన మిల్క్ డెలివరీ బాయ్ అని షేర్ చేస్తున్నారు.