Fake News, Telugu
 

మయన్మార్ లో రోహింగ్యలు ఉండే ప్రదేశం చైనా కంటే భారత్ కే దగ్గర

0

ఒక మ్యాప్ ఫోటో పెట్టి, ‘2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా దేశాన్ని వదిలేసి, చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోకి ఎందుకు అక్రమంగా చొరబడుతున్నారు…?’ అని అంటూ పోస్ట్ చేస్తున్నారు. చైనా దేశంలోని పరిస్థితులను కూడా ఆ పోస్ట్ లో చెబుతున్నారు.  ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చైనా దేశాన్ని వదిలేసి 1,769 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోకి అక్రమంగా చొరబడుతున్న రోహింగ్యాలు. 

ఫాక్ట్ (నిజం) : చైనా మరియు భారత్ రెండిటితో మయాన్మార్ సరిహద్దులు పంచుకుంటుంది. పోస్ట్ చేసిన మ్యాప్ లో ఈశాన్య భారత్ ను పరిగణలోకి తీసుకోలేదు. అంతేకాదు, మయాన్మార్ లో ఎక్కువ శాతం రోహింగ్యాలు రాఖైన్ స్టేట్ లో ఉంటారు. చైనా కంటే భారతదేశానికి రాఖైన్ స్టేట్ దగ్గర. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో ఇచ్చిన మ్యాప్ ని చూస్తే, ఈశాన్య భారతదేశాన్ని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. భారతదేశం 1,643 కిలోమీటర్ల సరిహద్దుని మయాన్మార్ తో పంచుకుంటుంది. ఈశాన్య భారత రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మరియు మిజోరాం రాష్ట్రాలు మయాన్మార్ తో సరిహద్దులను పంచుకుంటాయి.

భారతదేశంలోకి రావాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలో ఆరంభం మరియు గమ్యస్థానాల మీద ఆధార పడి ఉంటుంది. పోస్టులో ఇచ్చిన మ్యాప్ లో భారతదేశంలోకి రావాలంటే 1769 కిలోమీటర్లు ప్రయాణం చేయాలని ఉంటుంది. రెండు ప్రదేశాల మధ్య అంత దూరం ఉన్న వివిధ సిటీలను చూడగా, మ్యాండెలే (మయాన్మార్ లోని ఒక ప్రముఖ సిటీ మరియు భౌగోళికంగా మయాన్మార్ సెంటర్ లో ఉంటుంది) నుండి నాగపూర్ (భారత్) మధ్య కూడా సుమారు అంతే దూరం ఉన్నట్టు చూడవొచ్చు. కానీ, ఇక్కడ కూడా నాగపూర్ రాకముందే భారత్ లోకి రోహింగ్యాలు అడుగుపెడుతారు.

భౌగోళికంగా మయాన్మార్ సెంటర్ లో ఉన్నందున మ్యాండెలే నుండి దగ్గర లోని భారత్ మరియు చైనా సరిహద్దులకు ఎంత దూరం ఉందో చూడగా, మ్యాండెలే నుండి భారత్ సరిహద్దుకు సుమారు 280 కిలోమీటర్లు ఉంటే, మ్యాండెలే నుండి చైనా సరిహద్దుకు సుమారు 260 కిలోమీటర్లు ఉంది.

పై మ్యాపులలో ఎక్కడ కూడా మయాన్మార్ లో రోహింగ్యాలు ఎక్కడ ఉంటారో పరిగణలోకి తీసుకోలేదు. ఐక్యరాజ్యసమితి మరియు మీడియా సంస్థల రిపోర్టుల ప్రకారం, మయాన్మార్ లో ఎక్కువ శాతం రోహింగ్యాలు రాఖైన్ స్టేట్ లో ఉంటారు. భారత లోక్ సభ లో రోహింగ్యా ప్రజల గురించి ప్రభుత్వ ప్రతినిధి ఇచ్చిన సమాధానం లో కూడా రాఖైన్ స్టేట్ నుండి వలస వస్తున్న ప్రజల గురించి మయాన్మార్ మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాలతో భారత ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపాడు. భౌగోళికంగా మయాన్మార్ లో రోహింగ్య ప్రజలు ఎక్కువ శాతం ఏ ప్రాంతంలో ఉంటారో అల్ జజీరా వారి ఇన్ఫోగ్రాఫిక్ లో చూడవొచ్చు.

ఇన్ఫోగ్రాఫిక్ ద్వారా చైనా కంటే భారతదేశానికి రోహింగ్య ప్రజలు అధికంగా ఉన్న రాఖైన్ స్టేట్ దగ్గరగా ఉన్నట్టు చూడవొచ్చు. అంతేకాదు, అల్ జజీరా వారి మరో ఇన్ఫోగ్రాఫిక్ ద్వారా రోహింగ్య ప్రజలు భారతదేశంలోకే కాదు, మయాన్మార్ కి పశ్చిమాన ఉన్న చాలా దేశాలకు వలస పోతున్నట్టు చూడవొచ్చు.

చివరగా, భారతదేశం మయాన్మార్ తో సరిహద్దు పంచుకుంటుంది. పోస్ట్ లోని అంకెలు తప్పు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll